ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఎన్నికల సమయం వచ్చింది. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకూ, అదే విధంగా మరో 4 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకూ శనివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించడంతో ఒక బృహత్ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో మరో నెల రోజుల పైచిలుకులో తొలి దశతో సుదీర్ఘ ఎన్నికల పర్వం ఊపందు కోనుంది. ఇదే ఏడాది అమెరికా సహా పలు భారీ ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా, 96.9 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లతో మన దేశం సంఖ్యాపరంగా అన్నిటి కన్నా ముందు వరుసలో ఉంది.
అలాగే, మిగిలిన దేశాలతో పోలిస్తే సుదీర్ఘంగా ఈ ప్రక్రియ సాగనుంది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు సైతం ఇలాగే సుదీర్ఘంగా సాగాయి. 489 స్థానాలకు గాను మొత్తం 68 దశల్లో అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత మళ్ళీ అంత సుదీర్ఘంగా సాగుతున్నవి ఈ సార్వత్రిక ఎన్నికలే. ఈ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఈ హంగామా కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో రానున్న రెండున్నర నెలలు వేసవి వేడితో పాటు దేశమంతటా ఎన్నికల ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయి.
ఇవి యువతరం ఎన్నికలు కావడం విశేషం. ఓటర్లలో 29 శాతం మంది 18 నుంచి 29 ఏళ్ళ మధ్యవయసు యువతరమే. 2660 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా! అధికారికంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు విధించారన్న మాటే కానీ, పార్టీల ప్రచారం సహా ఈ ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు దాదాపు రూ. 1.2 లక్ష కోట్లు దాటుతుందని లెక్క. ఏకంగా 15,256 అడుగుల ఎత్తైన ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న బృహత్తర ప్రక్రియ ఇది.
వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, ఫోన్–ఇన్ ప్రచార సాధనాలతో వర్చ్యువల్ ప్రచారం ప్రబలిన ఆధునిక కాలమిది. ఓటింగ్‌కు 48 గంటల కన్నా ముందే ప్రచారం ఆపాలి, అంశాల ప్రాతిపదికన – కులమతాలకూ, విద్వేషానికీ దూరంగా ప్రచారం సాగాలి లాంటి నిబంధనల్ని ఆచరణలో పెట్టించడం ఈసీకి కష్టమే. అలాగే 1999లో 29 రోజులతో మొదలై గత 2019లో 39, ఈసారి 44 రోజులకూ వ్యాపిస్తూ పోతున్న ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండే పాలకపక్షాలకు వాటంగా మారుతుందని ఆరోపణలొస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకటన ఫలితంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో ఈసీ క్రియాశీలక పాత్ర మొదలైంది. తాజాగా సోమవారం గుజరాత్, యూపీ సహా అరడజనుల రాష్ట్రాల్లో హోమ్‌శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ కౌరడా జుళిపించింది. పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన డీజీపీపై వేటు వేసింది.ఎన్నికలు నిష్పక్ష పాతంగా సాగాలంటే, ఆయా ప్రాంతాల్లో పాలకపక్ష అనుకూలురని పేరుబడ్డ అధికారులకు చెక్ చెప్పడం సమంజసమే, స్వాగతించాల్సిందే.
అయితే, అనేక సందర్భాల్లో కేంద్రంలోని పాలక వర్గాల చేతిలోని సంస్థగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వింటూనే ఉన్నాం. అవన్నీ నిరాధారమని మాటలతో కన్నా చేతల ద్వారా తేల్చడమే ఈసీ ముందున్న మార్గం. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒకప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్‌ను ఆదర్శంగా నిలుపుకోవాలి. పాలకుల కన్నా ప్రజలకు జవాబుదారీగా ఈసీ నిలబడాలి. డబ్బు, అధికారం లేనివారు సైతం ఎన్నికల బరిలో స్వేచ్ఛగా పోటీ చేసే ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి.
దురదృష్టవశాత్తూ పరిస్థితులన్నీ ఆ ఆదర్శాలకు తగ్గట్టు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పూర్తిగా కలగడం లేదు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలోనే దేశంలో ఒకటికి రెండు కీలక పరిణామాలు సంభవించాయి. రహస్యమయమైపోయిన ఎన్నికల బాండ్లలో దాతలు, గ్రహీతల (పార్టీల) వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)ని ఆదేశించాల్సి వచ్చింది.
మరోపక్క మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అంశంపై వేలకొద్దీ పేజీల నివేదిక సమర్పిస్తూ, లోక్‌సభకూ, రాష్ట్రాల శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలని సిఫార్సు చేసింది. ఇంకొకపక్క కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి భాగం లేకుండా ప్రభుత్వం ఆ మధ్య చేసిన మార్పులు సైతం మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఒక రకంగా భారత ప్రజాస్వామ్య ప్రస్థానం నునుపైన జారుడు శిఖరం మీద సాగుతున్న అంశాన్ని పట్టిచూపాయి. రానున్న కాలంలో ఈ ప్రయాణం ఇంకెంత సంక్లిష్టం కానున్నదో చెప్పకనే చెప్పాయి.
బాండ్ల సాక్షిగా పారిశ్రామిక వర్గాలకూ, రాజకీయాలకూ మధ్య రహస్యబంధం అంతకంతకూ బలపడుతున్న వేళ, దేశమంతా ఒకేసారి ఎన్నికలతో సమస్తం కేంద్ర పాలకుల కనుసన్నల్లోకి మార్చాలని చూస్తున్న వేళ... రానున్న ఎన్నికల్లో ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలు కీలకం కానున్నాయి. ‘‘చరిత్ర కూడలిలో నిల్చొని, ఏ మార్గంలో వెళ్ళాలో ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి జాతికీ ఒకానొక దశలో వస్తుంది’’ అని భారతదేశానికి రెండో ప్రధాన మంత్రి అయిన లాల్‌బహదూర్ శాస్త్రి ఒక సందర్భంలో అన్నారు.
ఆ మార్గాన్ని బట్టే భవితవ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతావని తన ప్రయాణంలో ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎంచు కొనే మార్గం పౌరుల మొదలు న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికార వ్యవస్థ, మీడియా దాకా సమస్తాన్నీ ప్రభావితం చేయనుంది. అందుకే, సరైన మార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. సరైన ఎంపిక సాగాలంటే, అలక్ష్యం చేయకుండా విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడమే సాధనం.
ఎన్నికల బృహత్ పర్వం!
Published Tue, Mar 19 2024 12:09 AM | Last Updated on Tue, Mar 19 2024 12:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment