ఏటా వచ్చే వేసవికి అదనంగా ఈసారి ఎన్నికల వేసవిని చవిచూస్తున్నాం. కాకపోతే రెంటి మధ్యా ఒక తేడా ఉంది. సూర్యతాపం ద్విగుణీకృతమవుతున్నకొద్దీ, వోటర్లలోనూ ఎన్నికల సమరోత్సాహం త్రిగుణీకృతమవుతుంది. అదే ప్రజాస్వామ్యంలోని అందమూ, చందమూ, ఆకర్షణా. ప్రజా స్వామ్యం అత్యుత్తమం కాకపోవచ్చుకానీ, ఇప్పటివరకూ అనుభవంలోకి వచ్చిన అన్ని వ్యవస్థల్లో అదే ఉత్తమమని పండితులెందరో తేల్చారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక. తమ కలలు, కాంక్షలతో ముడిపడినవి కనుకే ఎన్నికలు జనానికి మండు వేసవిలోనూ మంచు లేపనమవుతాయి.
రాచరికం, సైనిక నియంతృత్వం లాంటి చేదు అనుభవాల దరిమిలా ప్రజాస్వామ్యాన్ని తెచ్చు కున్నామని పొరబడేవారున్నారు. రాజ్యమూ, సామ్రాజ్యమూ ఉనికిలోకి రాకముందే, మనుషులు గుంపు కట్టడం నేర్చిన తొలి దశలోనే అంకురించిన తాత్వికత– ప్రజాస్వామ్యం. కాలికమైన అంతరాలను, అడ్డంకులను దాటుకుని నేటికీ పురివిప్పుతున్న రాజకీయ తాత్వికత అదే. వేట– ఆహార సేకరణ దశలో మనిషి ప్రకృతి శక్తులతో పోరాడుతున్నప్పుడే తోటి మనుషుల తోడు, తోడ్పాటుల విలువ గుర్తించాడు; అభిప్రాయాల కలబోతనూ, ఐక్య కార్యాచరణనూ అలవరచుకున్నాడు. అంద రినీ కలుపుకొనిపోయే నాయకత్వాన్నీ ఆనాడే ప్రతిష్ఠించుకున్నాడు. గణతంత్రం పేరిట సాముదా యికంగా అభివృద్ధి చేసుకున్న సమాజాలతోనే రాజకీయ చరిత్ర ప్రారంభమైందని విజ్ఞులంటారు.
గణతంత్రంలో నాయకుడు సమానులలో మొదటివాడే తప్ప అసామాన్యుడూ కాదు, అడ్డు అదుపుల్లేని అధికార శ్రీమంతుడూ కాదు. నేడు ప్రతి వోటుకూ ఒకే విలువ ఉన్నట్టే, నాడు ప్రతి ఒకరికీ ఒకే విలువ. పురాణేతిహాసాల్లో ఇందుకు సాక్ష్యాలు కనిపిస్తాయి. రామాయణంలో దశరథుడు తన పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చేయడానికైనా; మహాభారతంలో యయాతి తన చిన్న కొడుకు పూరునికి రాజ్యం కట్టబెట్టడానికైనా పౌర, జానపదుల ఆమోదం తప్పనిసరి. సమష్టి స్థానంలో వ్యక్తి ప్రాధాన్యం పుంజుకున్న దశలోనూ మంత్రి పరిషత్తులో చర్చించే నిర్ణయాలు తీసుకు నేవారు. విభీషణ శరణాగతి ఘట్టంలో రాముడు వానరవీరుల అభిప్రాయాన్ని అడుగుతాడు.
ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నో మలుపులూ, మరకలతోపాటు మెరుపులూ మన చూపుల్ని జిగేలుమనిపిస్తాయి. గణాలు వ్రాతాలుగా, వ్రాతాలు జనాలుగా, జనాలు మహాజనాలుగా మారే క్రమంలోనే సామ్రాజ్యాలు ఉనికిలోకి వచ్చాయి. మనదేశంలో మగధ సామ్రాజ్యావతరణకు ముందున్నది గణతంత్రమే. ఆనాడు దేశం పదహారు జనపదాలుగా ఉండేది. గ్రీస్, మెసపోటేమియాలలో గణతంత్ర రాజ్యాలు ఉండేవి.
నాటి గ్రీస్‌లోని ఎథెన్స్ అధినేత పెరిక్లీస్ ప్రజాస్వామిక అనుభవాన్ని కొత్త పుంతలు తొక్కించి జనతంత్రానికే ఘన చిహ్నమయ్యాడు; సంపన్నుల ప్రతిఘటనకు ఎదురొడ్డుతూ పేదలవైపు నిలబడి కలబడడంలోనూ ప్రజానాయకులకు తొలిమూసై మణిపూస అయ్యాడు. బలవత్తరులైన పర్షియన్ల దాడిని దీటుగా తిప్పికొట్టినా, సాటి గ్రీసు రాజ్యమైన స్పార్టాతో యుద్ధమొచ్చిన దశలో ప్లేగు వాతబడి అతను కన్నుమూయడం ఎథెన్స్ స్వాతంత్య్రానికీ; ప్రజాస్వామ్యానికీ చితిపేర్చింది. ఆ తర్వాత, స్పార్టా సహా గ్రీస్ అలెగ్జాండర్ సామ్రాజ్యంలో, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యంలో చిన్న వలసగా మసకబారిపోయింది. అలా కొడిగట్టిన ప్రజా స్వామ్యం తిరిగి కాంతినీ, క్రాంతినీ తెచ్చుకోవడానికి రెండువేల సంవత్సరాలు పట్టింది.
ఎథెన్స్ ప్రభవించిన తాత్విక శిఖరాలే సోక్రటిస్, ప్లేటో, అరిస్టాటిల్! సోక్రటిస్ ప్రజాస్వా మ్యాన్ని వ్యతిరేకించినా; ప్లేటో అన్ని అధికారాలనూ రాజ్యం చేతుల్లో పెట్టి, ఉదారవాద నియంతృత్వమనే ఊహాస్వర్గానికి నిచ్చెన వేసినా; అరిస్టాటిల్ మధ్యేమార్గంగా రాజ్యాంగబద్ధ ఆదర్శ రాజ్యాన్ని నొక్కి చెప్పినా– ముగ్గురూ పశ్చిమ దేశాల రాజకీయ తాత్విక చింతనను ఉద్దీపింపజేసిన వారే. ప్రత్యేకించి అరిస్టాటిల్ ఆధునిక కాలంలో జాన్ లాక్, మాంటెస్క్యూ వంటి ప్రజాస్వామ్య దిశానిర్దేశకులకు ఒరవడి అయ్యాడు. గ్రీకుల బహుళ దేవతారాధనను వ్యతిరేకించినందుకు సోక్ర టిస్‌ను ఉరితీయడం ఎథెన్స్ ప్రజాస్వామ్య పరిమితిని, అపరిణతిని నొక్కిచెప్పి; భావప్రకటనా స్వేచ్ఛలేనిది ప్రజాస్వామ్యమే కాదన్న నీతినీ బోధించింది.
పౌర ప్రాతినిధ్యం నుంచి రాచరిక నియంతృత్వంలోకి జారిపోయిన రోమ్ అనుభవమూ ఇలాంటిదే. వ్యక్తులు ఉత్తములూ, ఉన్నత సంకల్పవంతులూ అయితే చాలదు; వ్యవస్థలను బలోపేతం చేస్తేనే ప్రజాస్వామ్యానికి ఉనికీ, మనికీ అన్నది రోమ్ నేర్పిన గుణపాఠం. యూరప్ అంతటా ప్రజాస్వామ్య వ్యవస్థల సంపూర్ణ పతనం; ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇంగ్లండ్ వేగుచుక్క కావడం; ఫ్రెంచి విప్లవం తిప్పిన మలుపులు; ప్రజాస్వామ్య మార్గంలో అమెరికా వేసిన ముందడుగు– ఇదంతా మరో చరిత్ర. వోటుహక్కు చరిత్రనే తిరగేస్తే, ఎథెన్స్ ప్రజాస్వామ్యంలోనూ బానిసలకు వోటు హక్కు లేదు. ఆ తర్వాతా శ్రామికులకు, స్త్రీలకు వోటు హక్కు లభించడానికి పెద్ద పోరాటాలే జరిగాయి. యూరప్ దేశాలు అనేకం ప్రజాస్వామ్యంలోకి రావడానికి ఇరవయ్యో శతాబ్ది చివరి వరకూ ఎదురుచూశాయి.
ఇలాంటి చీకటి వెలుగుల చిత్రపటంలో భారత్ ఉనికే ఉజ్వలమూ, ఉత్తేజవంతమూ! వోటు హక్కును సార్వత్రికం చేసిన తొలి ఘనత మనదే. భారత్ ఒక దేశంగా మారడాన్నే అనుమానించి అవహేళన చేసిన నాటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ సహా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్రజాస్వామిక ప్రస్థానంలో ముందడుగు వేస్తూనే ఉన్నాం. బహుళ మతాలూ, భాషల వైవిధ్యం వైరుద్ధ్యం కాదనీ, ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువనీ ప్రపంచానికి చాటి చెప్పాం.
భారత ప్రజాస్వామ్యమా! జయతు జయతు!
జనస్వామ్యమా! జయీభవ!!
Published Mon, May 13 2024 4:45 AM | Last Updated on Mon, May 13 2024 4:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment