PK mohanthy
-
విన్నపాలు వినవలె..!
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పంపిణీపై ఏర్పా టైన కమల్‌నాథన్ కమిటీ రెండో రోజైన శనివారం కూడా ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయింది. విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా వారి అభిప్రాయాలను తెలుసుకుంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ సంఘాల ప్రతినిధులు మరోసారి స్పష్టం చేశారు. సర్వీస్ రిజిస్టర్లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థానికతను నిర్ధారించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కాకుండా జిల్లాల నిష్పత్తిలో ఉద్యోగుల పంపిణీ జరగాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆప్షన్స్ ఆధారంగానే విభజన జరగాలని, ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా మార్గదర్శకాలు ఉండకూడదని సీమాంధ్ర సంఘాల నేతలు వాదించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, లేదంటే ప్రత్యేక రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండిపోయే అవకాశముందని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం పేర్కొంది. తాము ఆప్షన్లకు వ్యతిరేకమని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర స్థాయి పోస్టే అయినప్పటికీ డిప్యూటీ కలెక్టర్లుగా నియమితులైన వారిని జోన్ల ఆధారంగా స్థానికతను నిర్ధారించి సొంత రాష్ట్రాలకే కేటాయించాలని తెలంగాణ తహశీల్దార్ల సంఘం పేర్కొంది. హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలకు తహశీల్దార్లను కాకుండా.. ఆ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని, ఇప్పుడు ఈ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా పరిగణిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదించింది. ఈ వాదనతో కమల్‌నాథన్ ఏకీభవించారు. అవసరమైన కొందరికి మాత్రమే ఆప్షన్ ఇవ్వాలని, మిగతా వారిని స్థానికత ఆధారంగానే పంచాలని తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లనూ కమల్‌నాథన్ కమిటీ పరిధిలో చేర్చాలని, స్థానికతనే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ గిరిజన ఉద్యోగుల సమాఖ్య కోరింది. స్థానికతనే పరిగణించాలంటూ తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నేతలు కమల్‌నాథన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 500 మంది స్థానికేతరులు డిప్యుటేషన్ వచ్చి 5, 6 జోన్లలో అక్రమంగా పనిచేస్తున్నారని తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. విద్యాభ్యాసం ఆధారంగా స్థానికతను నిర్ధారించి ఆయా ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు తరలించాలని, రాష్ర్ట స్థాయి పోస్టుల్లో ఉన్న ప్రిన్సిపాళ్లను కూడా వారి వారి జోన్లకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, రిజర్వేషన్ నిబంధనల మేరకు రెండు రాష్ట్రాల్లోని పోస్టుల సంఖ్యను స్పష్టంగా పేర్కొనాలని, అందుకు తగినట్లే ఎస్సీ, ఎస్టీల ప్రాధాన్యత కల్పించాలని సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆప్షన్స్ మేరకే ఉద్యోగులను విభజించాలని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం విన్నవించింది. ఇక విద్యుత్ ఉద్యోగులందరికీ ఆప్షన్ ఇవ్వాలని, తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన సీమాంధ్ర ఉద్యోగులకు హెచ్ఎండీఏ పరిధిలోనే పోస్టింగ్ ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అభిప్రాయపడింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని అయినందున ఆ తర్వాత ఆప్షన్ మార్చుకునే అవకాశాన్ని ఇరు రాష్ట్రాల్లో కల్పించాలని సూచించింది. -
జూన్ రెండుకల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం
న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో కలసి డీవోపీటీ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది. రెండు వారాల్లో మార్గదర్శకాలు రూపొందిస్తామని కమల్‌నాథన్ పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనపై విధి విధానాలు ఎలా ఉండాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.స్థానికతనా లేక మరింకేమైనా అంశాలను ఆధారం చేసుకోవాలా అన్న దానిపై చర్చించినట్లు కమల్ నాథన్ తెలిపారు. దీనిపై మరోసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు. జూన్ రెండు కల్లా ఉద్యోగుల విభజన పూర్తి చేస్తామన్నారు. -
సీఎస్ పదవి పొడిగింపుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పదవి పొడిగింపును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయింది. రాజిరెడ్డి దీన్ని దాఖలు చేశారు. కేబినెట్ అనుమతి లేకుండా ఆపద్ధర్మ ప్రభుత్వం సీఎస్ పదవి పొడిగింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం లేకుండా సీఎస్ పదవి పొడిగించడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్ మహంతి కొనసాగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ సేథ్‌కు ఇంతకుముందు లేఖ రాశారు. -
ఉద్యోగుల విభజనపై కసరత్తు
-
ఉద్యోగుల విభజనపై కసరత్తు
* సీఎస్‌తో కమల్‌నాథన్ కమిటీ భేటీ * మార్గదర్శకాల రూపకల్పనకు తొలి సమావేశం * 2 వారాల్లోనే పూర్తి చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై కసరత్తు ప్రారంభమైంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతితో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాధికారులు అర్చనావర్మ, కె.కిప్జెన్, ఎస్.నాయక్, ప్రతాప్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్కే సిన్హా తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో.. ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎలా ఉండాలనే అంశం మీదే చర్చ సాగింది. భేటీ అనంతరం సమావేశం వివరాలను అధికారులు వెల్లడించారు. వాటిలో ముఖ్యాంశాలు ఇవీ.. * మార్గదర్శకాలు ఖరారు, అన్ని శాఖల స్టాఫ్ పాట్రన్ నిర్ధారణ తర్వాతే ఉద్యోగుల విభజన మొదలవుతుంది. పోస్టులను జనా భా నిష్పత్తిలో విభజించిన తర్వాత ఉద్యోగుల కేటాయింపు ప్రారంభమవుతుంది. * కమిటీ సూచనలకు అనుగుణంగా పోస్టుల గణాంకాలపై రెండు మూడు రోజుల్లో అధికారులు నివేదిక రూపొందించనున్నారు. * రాష్ట్రంలో 76 వేల రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయని అధికారుల అంచనా. ప్రస్తుతం ఈ పోస్టుల్లో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగుల వివరాలు ప్రభుత్వానికి అందాయి. మరో 4 వేల మంది వివరాలు త్వరలో అందుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. * ఉద్యోగుల విభజనలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కమిటీకి నెల రోజుల గడువు ఉంది. అయితే రెండు వారాల్లోనే పని పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులు, సింగిల్ యూనిట్ (సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ) ఉద్యోగుల విభజన కమిటీ పరిధిలో ఉంటుంది. అఖిల భారత అధికారుల విభజనతో సంబంధం లేదు. * కమిటీ తదుపరి సమావేశం వచ్చే వారం నిర్వహించవచ్చు. ఉద్యోగ సంఘాలతోనూ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. సొంత జిల్లాలకు వెళ్లడానికి అనుమతించాలి ఓపెన్ కోటా టీచర్లపై పీఆర్టీయూ సాక్షి, హైదరాబాద్: ఓపెన్ కేటగిరీలో ఎంపికైన నాన్ లోకల్ టీచర్లు సొంత జిల్లాలకు వెళ్లడానికి వీలుగా వారికి ఆప్షన్ సౌకర్యం కల్పించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమల్‌నాథన్ కమిటీకి సిఫార్సు చేయాలని కోరుతూ పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, కె.జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డితో కూడిన ప్రతినిధి బృందం గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. ప్రతినిధి బృందం సమర్పించిన వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ... * ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను ఒకే యాజమాన్యం కిందకు తీసుకురావాలి. టీచర్లకు పదోన్నతులు కల్పించి.. విద్యాశాఖలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. * రాష్ట్రంలో 3.50 లక్షల మంది ఉపాధ్యాయుల వివరాలను కంప్యూటరీకరించి ఆన్లైన్లో పొందుపరచాలి. * గతేడాది బదిలీ చేసి, ఇంకా రిలీవ్ చేయని ఉపాధ్యాయులను ఈ విద్యాసంవత్సరం ఆఖరు రోజు (లాస్ట్ వర్కింగ్ డే) రిలీవ్ చేయాలి. -
శిక్ష పడితే వెంటనే వివరాలు ఇవ్వండి
సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో సీఎస్ ఉత్తర్వులు జారీ ప్రజాప్రతినిధులకు ఏ కోర్టు శిక్ష విధించినా 24 గంటల్లో రిపోర్టు ఆ వివరాలను డీజీపీ రాష్ట్ర సీఈవోకు పంపాలి పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు తెలియజేయాలి ప్రతి నెల 15న కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర సీఈవో నివేదిక సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా న్యాయస్థానాలు శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏ సభ్యుడికైనా శిక్ష పడితే వెంటనే ఆ సభ్యుడిపై అనర్హత వేటు వేయడానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల కమిషన్ సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఏ న్యాయస్థానాలైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసుల్లో గానీ, ఇతర కేసుల్లో గానీ శిక్షలు విధిస్తే ఆ వివరాలను వెంటనే నోడల్ అధికారి అయిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి నమూనా పత్రాన్ని కూడా ఈ ఉత్తర్వులకు జత చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేరు.. ఏ న్యాయస్థానం శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద శిక్ష విధించారు.. శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు తేదీ.. శిక్ష వివరాలను వెల్లడించాలని నమూనా పత్రంలో పేర్కొన్నారు. న్యాయస్థానాలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఎవరికైనా శిక్ష విధిస్తే ఆ వివరాలను డీజీపీ 24 గంటల్లోగా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల నుంచి తెప్పించుకుని సీఈవోకు తెలియజేయాలని స్పష్టం చేశారు. కొన్ని కోర్టుల్లో సభ్యులకు శిక్ష పడినా పరిశీలనకు రావడం లేదని, ఈ నేపథ్యంలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నేరపూరిత కేసుల్లో సభ్యులు అరెస్ట్ అయితే ఆ వివరాలను వెంటనే పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్లకు, రాజ్యసభ, శాసనమండలి చైర్మన్లకు తెలియజేయాలని.. ఒకవేళ బెయిల్‌పై విడుదలైతే ఆ వివరాలను కూడా తెలియజేయాలని చెప్పారు. ఏదైనా కేసుల్లో సభ్యులకు శిక్ష పడితే ఆ వివరాలను న్యాయస్థానాల్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 24 గంటల్లోగా నోడల్ అధికారైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలియజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నోడల్ అధికారైన సీఈవో కేసుల వివరాలను ప్రతి నెల 15న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలనకు తీసుకెళ్లి, ఆయన ఆమోదం తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని చెప్పారు. -
సీఎస్ నివేదికతో సీఎంకు సంబంధం లేదు
హైదరాబాద్: కొత్త రాజధానికి లక్ష ఎకరాలు, అయిదులక్షల కోట్లు, హెచ్ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కేంద్రప్రభుత్వానికి పంపిన నివేదికతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని విప్ రుద్రరాజు పద్మరాజు పేర్కొన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోమ్ శాఖ పంపిన ప్రశ్నావళికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా మహంతిపై ఉందన్నారు. బాధ్యత కల అధికారిగా ఆ నివేదికను మహంతి కేంద్రానికి పంపి ఉంటారన్నారు. ఆయన చేసిన సూచనలు ప్రభుత్వ శాఖలు ఇచ్చిన నివేదికల మేరకే ఉంటాయి తప్ప అవాస్తవికత ఏమీ లేదన్నారు. దీనిపై కొందరు విమర్శలు చేయడం అర్థర హితమన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇటీవల చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన మతిస్థిమితం కోల్పోయారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్ జగన్ దత్తపుత్రుడని, కేసీఆర్ అద్దె పుత్రుడంటూ సీఎం కిరణ్‌పై బాబుచేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఆయన తీరుమారకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. -
హెల్త్ కార్డులపై కుదరని ఏకాభిప్రాయం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఉద్యోగులు గురువారం సమావేశం అయ్యారు. భేటీ అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ దీపావళిలోగా హెల్త్ కార్డుల అంశాన్ని తేల్చాలని సీఎస్‌ను కోరామన్నారు. ప్రభుత్వం విధించదలచుకున్న రూ. 2లక్షల సీలింగ్ ఎత్తివేయకపోతే ....హెల్త్ కార్డుల పథకంలో చేరేది లేదని తేల్చి చెప్పామన్నారు. ఉత్తర్వులు తమకు అనుకూలంగా లేకుంటే అంగీకరించేది లేదని అశోక్ బాబు స్పష్టం చేశారు. సీలింగ్ ఎత్తివేయాల్సిందేనని... ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత వచ్చాకే జీవో ఇవ్వాలన్నారు. యూనివర్శిటీ, ఎయిడెడ్, లైబ్రరీ ఉద్యోగులను కూడా హెల్త్ కార్డుల పథకంలో చేర్చాలని టీఎన్జీవో సంఘం నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు సీలింగ్‌తో తమకు సంబంధం లేదని... సీలింగ్ ఎత్తివేయకపోయినా తాము హెల్త్ పథకంలో చేరతామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు. -
‘సమాచారచట్టం’తోనే పారదర్శకత : పీకే మహంతి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తోందని, అటువంటి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, అధికారులందరూ ప్రజలకు జవాబుదారీలేనని, ప్రజలకు సమాచారం ఇవ్వడం వారి బాధ్యతని గుర్తుచేశారు. గురువారం జూబ్లీహాల్లో నిర్వహించిన సమాచారహక్కు చట్టం సెమినార్లో మహంతి పాల్గొన్నారు. సమాచార కమిషనర్లు, ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అథారిటీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఎస్.కే సిన్హా మాట్లాడుతూ... పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిర్మూలనకే ప్రభుత్వం సమాచార చట్టాన్ని తెచ్చిందని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేందుకు ప్రభుత్వం, సమాచార కమిషన్ మరింత శ్రమపడాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్ హుస్సేన్ హెచ్చరించారు. కార్యక్రమంలో సమాచార కమిషనర్లు సి. మధుకర్‌రాజ్, ఎస్. ప్రభాకర్ రెడ్డి, పి. విజయబాబు, ఎం. రతన్, వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతి యాజ్ అహ్మద్, విజయ నిర్మల సమాచారహక్కుచట్టం ఆవశ్యకతను వివరించారు. -
14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో ఒకవైపు సమైక్యాంధ్ర ఆందోళనలు తీవ్రస్థాయిలో ఉన్నా.. ఒకేసారి 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి... రఘునందన్ రావును కృష్ణా జిల్లా కలెక్టర్గాను, జె.మురళిని అదే జిల్లాకు జాయింట్ కలెక్టర్గాను పంపారు. స్మితా సబర్వాల్‌ను మెదక్ కలెక్టర్గాను, పి.ఉషాకుమారిని శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్గాను, వివేక్ యాదవ్‌ను గుంటూరు జాయింట్ కలెక్టర్గాను, వి.వినయ్‌చంద్‌ను పాడేరు ఐటీడీఏ పీవోగాను నియమించారు. అలాగే, పి.బసంత్‌కుమార్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్గాను, పి.భాస్కర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగాను, టి.వెంకట్రామిరెడ్డిని కాకినాడ డీసీటీవోగాను, పౌసమిబసును వరంగల్ జాయింట్ కలెక్టర్గాను, దినకర్‌బాబును మార్క్‌ఫెడ్ ఎండీగాను నియమించారు. కాడ్మియల్‌ను ఆగ్రోస్ వీసీ అండ్ ఎండీగాను, జ్యోతి బుద్ధప్రకాశ్‌ను రూరల్ హెల్త్ మిషన్ డెరెక్టర్గాను, మహ్మద్ ఇక్బాల్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.