సీఎస్ పదవి పొడిగింపుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పదవి పొడిగింపును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయింది. రాజిరెడ్డి దీన్ని దాఖలు చేశారు. కేబినెట్ అనుమతి లేకుండా ఆపద్ధర్మ ప్రభుత్వం సీఎస్ పదవి పొడిగింపుపై ఎలా నిర్ణయం తీసుకుంటుందని పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం లేకుండా సీఎస్ పదవి పొడిగించడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న కుమార్ మహంతి కొనసాగింపును తక్షణమే ఉపసంహరించుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ కుమార్ సేథ్‌కు ఇంతకుముందు లేఖ రాశారు.