సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పంపిణీపై ఏర్పా టైన కమల్‌నాథన్ కమిటీ రెండో రోజైన శనివారం కూడా ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయింది. విభజనకు అనుసరించాల్సిన మార్గదర్శకాల రూపకల్పనలో భాగంగా వారి అభిప్రాయాలను తెలుసుకుంది. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ సంఘాల ప్రతినిధులు మరోసారి స్పష్టం చేశారు. సర్వీస్ రిజిస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం స్థానికతను నిర్ధారించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కాకుండా జిల్లాల నిష్పత్తిలో ఉద్యోగుల పంపిణీ జరగాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆప్షన్స్ ఆధారంగానే విభజన జరగాలని, ఉద్యోగుల మనోభావాలకు విరుద్ధంగా మార్గదర్శకాలు ఉండకూడదని సీమాంధ్ర సంఘాల నేతలు వాదించారు.
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరిగితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, లేదంటే ప్రత్యేక రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉండిపోయే అవకాశముందని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం పేర్కొంది. తాము ఆప్షన్లకు వ్యతిరేకమని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర స్థాయి పోస్టే అయినప్పటికీ డిప్యూటీ కలెక్టర్లుగా నియమితులైన వారిని జోన్ల ఆధారంగా స్థానికతను నిర్ధారించి సొంత రాష్ట్రాలకే కేటాయించాలని తెలంగాణ తహశీల్దార్ల సంఘం పేర్కొంది.
హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాలకు తహశీల్దార్లను కాకుండా.. ఆ పోస్టులను అప్‌గ్రేడ్ చేసి డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం నియమించిందని, ఇప్పుడు ఈ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా పరిగణిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదించింది. ఈ వాదనతో కమల్‌నాథన్ ఏకీభవించారు. అవసరమైన కొందరికి మాత్రమే ఆప్షన్ ఇవ్వాలని, మిగతా వారిని స్థానికత ఆధారంగానే పంచాలని తెలంగాణ ఇంజనీర్ల జేఏసీ తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లనూ కమల్‌నాథన్ కమిటీ పరిధిలో చేర్చాలని, స్థానికతనే పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ గిరిజన ఉద్యోగుల సమాఖ్య కోరింది. స్థానికతనే పరిగణించాలంటూ తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నేతలు కమల్‌నాథన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 500 మంది స్థానికేతరులు డిప్యుటేషన్ వచ్చి 5, 6 జోన్లలో అక్రమంగా పనిచేస్తున్నారని తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. విద్యాభ్యాసం ఆధారంగా స్థానికతను నిర్ధారించి ఆయా ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు తరలించాలని, రాష్ర్ట స్థాయి పోస్టుల్లో ఉన్న ప్రిన్సిపాళ్లను కూడా వారి వారి జోన్లకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, రిజర్వేషన్ నిబంధనల మేరకు రెండు రాష్ట్రాల్లోని పోస్టుల సంఖ్యను స్పష్టంగా పేర్కొనాలని, అందుకు తగినట్లే ఎస్సీ, ఎస్టీల ప్రాధాన్యత కల్పించాలని సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఆప్షన్స్ మేరకే ఉద్యోగులను విభజించాలని సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల సంఘం విన్నవించింది. ఇక విద్యుత్ ఉద్యోగులందరికీ ఆప్షన్ ఇవ్వాలని, తెలంగాణ ఆప్షన్ ఇచ్చిన సీమాంధ్ర ఉద్యోగులకు హెచ్‌ఎండీఏ పరిధిలోనే పోస్టింగ్ ఇచ్చే విధంగా చట్టాన్ని సవరించాలని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అభిప్రాయపడింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని అయినందున ఆ తర్వాత ఆప్షన్ మార్చుకునే అవకాశాన్ని ఇరు రాష్ట్రాల్లో కల్పించాలని సూచించింది.