హైదరాబాద్: కొత్త రాజధానికి లక్ష ఎకరాలు, అయిదులక్షల కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి కేంద్రప్రభుత్వానికి పంపిన నివేదికతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని విప్ రుద్రరాజు పద్మరాజు పేర్కొన్నారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోమ్ శాఖ పంపిన ప్రశ్నావళికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా మహంతిపై ఉందన్నారు. బాధ్యత కల అధికారిగా ఆ నివేదికను మహంతి కేంద్రానికి పంపి ఉంటారన్నారు.
ఆయన చేసిన సూచనలు ప్రభుత్వ శాఖలు ఇచ్చిన నివేదికల మేరకే ఉంటాయి తప్ప అవాస్తవికత ఏమీ లేదన్నారు. దీనిపై కొందరు విమర్శలు చేయడం అర్థర హితమన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇటీవల చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆయన మతిస్థిమితం కోల్పోయారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్ జగన్ దత్తపుత్రుడని, కేసీఆర్ అద్దె పుత్రుడంటూ సీఎం కిరణ్‌పై బాబుచేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఆయన తీరుమారకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు.