తెలంగాణను మోసగించిన బాబు
భీమ్‌గల్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణ అంశంపై లేఖ ఇచ్చి, విమానంలో దేశమంతా తిరిగి అందరి కాళ్లు పట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి చివరి ప్రయత్నాలు చేశాడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం ఆమె మండలంలోని చేంగల్, బడాభీమ్‌గల్, భీమ్‌గల్, పురాణిపేట్, మెండోరాగ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా భీమ్‌గల్ బస్టాండులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. తొలుత పది నిమిషాల పాటు ఉర్దూలో అనర్గళంగా ప్రసంగించి అందరినీ అశ్చర్యంలో ముంచెత్తారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపేందుకు కావాల్సిన వనరులున్నాయన్నారు.
ఆలోచనలు అమలులో పెట్టాలంటే అధికారంలోకి రావాలని రాబోయే తెలంగాణలో ముస్లింలకు, గిరిజనలుకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. వృద్ధాప్య పింఛను 200 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు టీడీపీలు పాలించాయన్నారు. ఐదేళ్లు టీఆర్‌ఎస్‌కు అవకాశమిస్తే మన హక్కుల గురించి, మన ప్రాంతం గురించి ఆలోచిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి ప్రజలను మోసగించాడన్నారు.
బస్ డిపో తెరిపించకుంటే భీమ్‌గల్‌లో అడుగుపెట్టనని అన్నాడని అ న్నారు. కానీ ‘దున్నపోతుకు సున్నమేస్తే ఎద్దయినట్లు, బస్ స్టాండుకు సున్నమేసి ఇదే డిపో...’ అన్నాడన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్నప్పుడు సభలో చప్పట్లు కొట్టిండ్రన్నారు. ఈ స్థాయిలో ప్రజల్ని మోసం చేసే నాయకులు మరొకరు లేరన్నారు. ఇక ఎన్ని డబ్బులు మింగిండ్రో లెక్కలేదన్నారు. అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్‌రెడ్డిలు ఏం ముఖం పెట్టుకుని ఆంధ్ర పార్టీల్లో ఉంటారన్నారు.
బానిస సంకెళ్లు తెంపుకుని బయటకు వచ్చి జాతీయ పార్టీల్లో చేరాలని, టీఆర్‌ఎస్‌లోకి మాత్రం వారిని తీసుకోబోమన్నారు. చంద్రబాబు అడుగడుగునా తెలంగాణను మోసగించాడన్నారు. రోడ్‌షోలో పెద్ద ఎత్తున వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థిని లక్ష్మి, నాయకులు కొండ ప్రకాష్ గౌడ్, కొండ గోదావరి, దొన్కంటి నర్సయ్య, తుక్కాజీ నాయక్, మల్లెల లక్ష్మణ్, ప్రవీణ్‌రావు తదితరులున్నారు.