pardon
-
కిరాతకుడికి రష్యా అధ్యక్షుడి క్షమాభిక్ష! సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు..
ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన హంతకుడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. అంతేకాదు అతన్ని సైనికుడిగా ఉక్రెయిన్ సరిహద్దుకు పంపారు. వ్లాదిస్లావ్ కాన్యుస్ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలు వెరా పెక్తెలేవాను అత్యంత కిరాతకంగా చంపాడు. ఇందుకుగానూ అతనికి 17 ఏళ్ల శిక్ష పడగా ఇంకా సంవత్సరం కూడా పూర్తవకముందే అధ్యక్షుడు పుతిన్ అతనికి క్షమాభిక్ష పెట్టి వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు బ్రేకప్ చెప్పిందన్న కక్షతో పెక్తెలేవాను కాన్యుస్ అత్యాచారం చేసి, 111 సార్లు కత్తితో పొడిచి, మూడున్నర గంటల పాటు చిత్రవధ చేశాడు. ఆ తర్వాత ఆమె మెడకు కేబుల్ వైర్ బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చాడని ‘ది సన్’ కథనం ద్వారా తెలిసింది. హతాశయురాలైన మృతురాలి తల్లి మృతురాలి తల్లి ఒక్సానా.. సైనిక దుస్తులలో ఆయుధం చేతపట్టి ఉన్న హంతకుడు కాన్యుస్ ఫొటోలను చూసి హతాశయురాలయ్యారు. తన కుమార్తెను అత్యంత పాశవికంగా హత్య చేసిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి వదిలేయడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. అంతటి కిరాతకుడికి ఆయుధం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, తన కూతురు ఆత్మకు శాంతి చేకూరదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆ హంతకుడు బయట ఉంటే తమను కూడా చంపేస్తాడని ఆందళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌కు కాన్యుస్‌ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధ్రువీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా తెలిపారు. ఆమె నవంబర్ 3 నాటి రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక లేఖను బయటపెట్టారు. కాన్యుస్‌కు క్షమాభిక్ష లభించిందని, ఏప్రిల్ 27న అధ్యక్షుడి ఆదేశాలతో అతని శిక్షను రద్దు చేసినట్లు ఆ లేఖలో ఉంది. కాగా క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ చర్యను సమర్థించారు. ఉక్రెయిన్‌లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు వారి నేరాలకు "రక్తంతో" ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నట్లు ‘ఏఎఫ్‌పీ’ నివేదించింది. -
అంగ్ సాన్ సూకీ జైలు శిక్ష తగ్గింపు
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి. -
ఒక తిరుగుబాటు.. కొన్ని ప్రశ్నలు!
ఎస్. రాజమహేంద్రారెడ్డి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు దెబ్బతిన్న పులా? అలసిపోయిన పులా? దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఎదురులేని, తిరుగులేని నేతగా రష్యాను పరిపాలిస్తున్న పుతిన్‌ను ఉవ్వెత్తున ఎగసి అంతేవేగంగా నేలకరిచిన ఓ సాయుధ తిరుగుబాటు ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మక ద్రోహాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసే రికార్డు ఉన్న పుతిన్ ఈసారి ఎందుకో క్షమాభిక్షతో పేజీ తిప్పేశారు. రష్యాపై పుతిన్ పట్టు సడలుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎన్నో రహస్య యుద్ధాల్లో తన కనుసన్నల్లో కాలుదువి్వన వాగ్నర్ గ్రూప్సేనలు మడమతిప్పి తన మీదే తుపాకీ ఎక్కుపెట్టడం పుతిన్‌కు మింగుడు పడడం లేదు. వండివార్చే చెఫ్ నుంచి కిరాయి సేన చీఫ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన యెవ్గెనీ ప్రిగోజిన్ తిరుగుబాటుకు తెగిస్తాడని పుతిన్ కలలో కూడా ఊహించలేదు. ఆయన తేరుకునేలోపే ప్రిగోజిన్ సేనలు రష్యాలో ఓ పట్టణాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడమే కాకుండా రాజధాని మాస్కో ముట్టడికి కదం తొక్కాయ అపారమైన సైనిక శక్తి, సాయుధ సంపత్తి కలిగి ఉన్న రష్యా ఈ కిరాయి సేనలను ఎందుకు నిలువరించలేకపోయిందో ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న! తిరుగుబాటును ముందస్తుగా పసిగట్టలేనంత దుస్థితిలో రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయా? అన్న అనుమానం రాక మానదు. పుతిన్‌లో మునుపటి దూకుడు లేదనడానికి ఇది నిదర్శనం కాదా? అనవసరమైన రాజ్యకాంక్షకు దాసోహమని అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ ఉక్రెయిన్‌పై మోహరించడం తిరుగుబాటుకు కారణం కాదా? ఇంతకీ పుతిన్‌కు ఏమైంది? రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కాని ప్రశ్న ఇదే. ఆయుధాలు ఇవ్వనందుకేనా? వంటవాడు గరిటె విసిరేసి తుపాకీ పడితే.. అతడే యెవ్గెనీ ప్రిగోజిన్ అవుతాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇష్టమైన వంటకాలను రుచికరంగా వండి వడ్డించి ఆయనకు కుడిభుజంగా రూపాంతరం చెందిన ప్రిగోజిన్ హఠాత్తుగా పక్కల్లో బల్లెంలా తయారై 24 గంటలపాటు తన బాస్‌ను భయపెట్టేశాడు. పుతిన్‌కు ఇంతకాలం విధేయుడిగా మసలిన ప్రిగోజిన్‌కు ఎందుకు అంత కోపమొచి్చంది? ఉక్రెయిన్‌లో తన సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ సేనలు సాధించిన విజయాలను రష్యా సైన్యం వారి ఖాతాలో వేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యుద్ధం గడుస్తున్న కొద్దీ కరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రిని భర్తీ చేయకపోవడం ప్రిగోజిన్‌ను అసహనానికి గురిచేసింది. నిజానికి అతడి కోపమంతా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమో పైనే. బఖ్ముత్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో జరిగిన యుద్ధంతో తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసేందుకు రష్యా ససేమిరా అనడమే తిరుగుబాటు అసలు కారణమని విశ్లేషకుల అంచనా. రష్యాకు ఆయువు పట్టయిన కీలక మిలటరీ స్థావరం రోస్తోవ్‌ను చేజిక్కించుకొని, అదే ఊపులో ప్రిగోజిన్ సేనలు మాస్కో వైపు కదలడంతో తిరుగుబాటు బహిర్గతమైంది. అయితే రష్యా వైమానిక దళం కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్కు ఈ తిరుగుబాటు వ్యూహం గురించి ముందే తెలుసని, అంతర్లీనంగా ఆయన మద్దతు ప్రిగోజిన్‌కు ఉందని భోగట్టా. అందుకే ఆయన మౌనంగా ఉండిపోయారని రష్యా నిఘా వర్గాల సమాచారం. రష్యా సైన్యంలో కీలక స్థానాల్లో ఉన్న మరికొందరు జనరల్స్ సైతం పుతిన్ వ్యవహార శైలి రుచించక ప్రిగోజిన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వాగ్నర్ గ్రూప్ కిరాయి సేనల పరిస్థితేమిటి? సిరియా అంతర్యుద్ధంలో, 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకొనే క్రమంలో జరిగిన పోరాటంలో క్రెమ్లిన్ తరపున ప్రిగోజిన్ పనిచేశాడు. అంతటి వీరవిధేయుడు తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్‌కు బద్ధశత్రువుగా మారిపోయాడు. అయినప్పటికీ బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ క్షేమంగా రష్యా పొలిమేరలు దాటి వెళ్లిపోయాడు. ఏ షరతులకు లోబడి క్రెమ్లిన్‌కు, ప్రిగోజిన్‌కు మధ్య సంధి కుదిరిందో ఇంకా బయటపడలేదు. సంధి కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో కూడా దీనిపై ఏ ప్రకటనా చేయలేదు. పుతిన్ కూడా ఈ అంశంపై పెదవి విప్పలేదు. క్షమాభిక్ష పెడుతున్నానని మాత్రమే ప్రకటించాడు. పుతిన్ మునుపటి బలవంతుడు కాదు, బలహీనుడు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ప్రిగోజిన్ క్షమాభిక్షతో బయటపడినప్పటికీ అతడి సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికుల భవిష్యత్తు ఏమిటన్నది ఇంకా తేలలేదు. చెల్లాచెదురైపోతారా? లేక రష్యా సైన్యంలో విలీనమై ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఈ క్షమాభిక్ష తాత్కాలికమే! తిరుగుబాటును వెన్నుపోటుగా, దేశ ద్రోహంగా అభివరి్ణంచిన పుతిన్ అందుకు కారణమైన వాళ్ల అంతు చూస్తానంటూ బాహాటంగా ప్రకటించకపోవడం సామాన్య పౌరులకు సైతం విడ్డూరంగా అనిపించింది. బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటు తిరుగుబాట పట్టినప్పటికీ, ప్రిగోజిన్‌కు, అతడి కిరాయి సేనలకు పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించడం ఈ మొత్తం ఉదంతానికి యాంటీ క్లయిమాక్స్గానే చెప్పుకోవాలి. ఈ క్షమాభిక్ష తాత్కాలికమేనని, తిరుగుబాటుదారుల్లో ఏ ఒక్కరినీ పుతిన్ వదిలిపెట్టరనేది మరికొందరి వాదన. ఏది ఏమైనప్పటికీ పుతిన్ అధికార ప్రస్థానంలో ఇది మాయని మచ్చగానే మిగిలిపోతుంది. తిరుగుబాటు చల్లారిన తర్వాత పుతిన్ రెండుసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ రెండూ రికార్డు చేసి, ప్రసారం చేసినవే కావడం గమనార్హం. రష్యా ప్రజలను అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంత జరిగినా రష్యా ప్రజల్లో అధిక శాతం ఆయనకు మద్దతుగానే నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో పుతిన్ ఉన్నట్టుండి బుధవారం జనం మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వారితో కరచాలనాలు చేసి తానేమీ బెదిరిపోలేదనే సంకేతాలు పంపించారు. కొసమెరుపు.. తిరుగుబాటు జరిగి(జూన్ 23) వారం రోజులవుతోంది. 24 గంటల్లోనే ఈ తిరుగుబాటు చల్లారడం, బాధ్యుడైన ప్రిగోజిన్ స్వేచ్ఛగా రష్యా విడిచి వెళ్లడం జరిగిపోయింది. అయితే ప్రిగోజిన్ ఎక్కడ తలదాచుకున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు తిరుగుబాటు సమాచారం ముందే తెలిసినా మౌనంగా ఉండిపోయిన రష్యా వైమానిక దళం కమాండర్ సెర్గెయ్ సురోవికిన్ కూడా మాయమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడో ఇటు రష్యా నిఘా సంస్థకు గానీ, అటు ఆయన కుటుంబ సభ్యులకు గానీ సమాచారం లేదు. అవిధేయతను అణచివేయడంలో సిద్ధహస్తుడైన పుతిన్ వేట మొదలుపెట్టారా? ఏమో! ఏమైనా కావొచ్చు!! -
విముక్తి దినోత్సవం.. ‘శామ్సంగ్’ వారసుడికి అధ్యక్షుడి క్షమాభిక్ష
సియోల్: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారసుడు లీ సహా ప్రముఖ కార్పొరేట్లు తదితర 1,700 మందికి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విముక్తి దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రకటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన రోజును దక్షిణ కొరియా ఏటా ఆగస్ట్ 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటుంది. శామ్సంగ్ అనుబంధంగా ఉన్న రెండు సంస్థల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్‌కు ఆ సంస్థ వారసుడైన లీ జే యంగ్ భారీగా ముడుపులు అందజేశారు. ఈయనతోపాటు లొట్టే గ్రూప్ చైర్మన్ షిన్ డాంగ్ బిన్ తదితరుల నుంచి కూడా అధ్యక్షురాలు భారీగా లంచాలు అందుకున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అధ్యక్షురాలు పార్క్ పదవి నుంచి వైదొలిగారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు గత ఏడాది అధ్యక్షుడు మూన్ క్షమాభిక్ష ప్రకటించారు. 30 నెలల జైలు శిక్ష పడిన శామ్సంగ్ వారసుడు లీకి కూడా గత ఏడాది పెరోల్ లభించింది. తాజాగా, అధ్యక్షుడి క్షమాభిక్షతో మిగిలిన జైలు జీవితం కూడా ముగియనుంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్తలకు క్షమాభిక్షలు ప్రకటించారని దక్షిణ కొరియా న్యాయశాఖ శుక్రవారం పేర్కొంది. -
బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..
ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. రోల్ఫ్ కయెస్టెల్(70).. అర్కన్సస్ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్‌గా పదిహేను వేల ఫైన్ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్ చేసుకున్నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అసా హచిన్సన్ చేసిన ‘రోల్ఫ్ కయెస్టెల్ రిలీజ్’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు. -
73 మందికి ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా పదవి వీడడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనులన్నీ పూర్తి చేశారు. అందరూ ఊహిస్తున్నట్టుగానే భారీగా కసరత్తు చేసి వైట్‌హౌస్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానెన్తో పాటు 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. మరో 70 మందికి శిక్షల్ని తగ్గించారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వారిలో స్టీవ్ బ్యానెన్ అత్యంత ముఖ్యుడు. అయితే తాను మాత్రం స్వీయ క్షమాభిక్షకి దూరంగా ఉన్నారు. తనని తాను క్షమించుకుంటే తప్పుల్ని ఒప్పుకున్నట్టవుతుందని భావించిన ట్రంప్ ఆ సాహసం చేయలేదని సమాచారం. కానీ కాంగ్రెస్ మాజీ సభ్యులు, రాప్ సింగర్లు, ఇతర సన్నిహితులు, తన కుటుంబానికి సన్నిహితులైన ఎందరికో క్షమాభిక్ష పెట్టారు. రష్యాతో గూఢచర్యం కేసులో దోషులుగా తేలిన వారిని కూడా ట్రంప్ క్షమించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటూ ఇంకా ఎక్కువ కాలం కాకుండానే స్టీవ్ బ్యానెన్కు విముక్తి కల్పించారు. సాధారణంగా అమెరికా అధ్యక్షులు సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష ఇస్తుంటారు. కానీ దానికి భిన్నంగా ట్రంప్ ఈ క్షమాభిక్షలపై ప్రత్యేకంగా కసరత్తు చేశారు. బ్యానెన్తో పాటు మలేషియా వెల్త్ ఫండ్ కేసు నుంచి విముక్తి కల్పించడానికి ట్రంప్ ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన ఎల్లియట్ బ్రాయిడా, తన అల్లుడు జేర్డ్ కుష్నర్ స్నేహితుడు, సైబర్ వేధింపుల కేసులో దోషి అయిన కెన్ కుర్సన్లను క్షమించారు. ఇలా ట్రంప్ అధ్యక్షుడిగా చివరి రోజు రికార్డు స్థాయిలో క్షమాభిక్షలు, శిక్ష తగ్గించడం వంటివి చేశారు. వెనెజులా వలసదారుల అప్పగింత నిలిపివేత ట్రంప్ ఆఖరినిమిషంలో వెనెజులా వలసదారులకి అండగా నిలిచారు. వేలాదిమంది వలసదారుల్ని వారి దేశానికి పంపకుండా అడ్డుకున్నారు. ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయులుగా ఉన్న వారి అప్పగింతను మరో 18 నెలల పాటు పొడిగిస్తూ కార్యనిర్వాహక ఉత్వర్వులపై సంతకం చేశారు. దీంతో లక్షా 45 వేల మందికి పైగా వెనెజులా వలసదారులు అమెరికాలో ఉండే అవకాశం లభించింది. వెనెజులా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నందున వారిని పంపడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. -
అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ కీలక నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇక చివరి రోజున ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. అయితే గతంలో ప్రకటించినట్లు ట్రంప్ తనకు స్వీయ క్షమాభిక్ష పెట్టుకోలేదు. అలానే తన కుటుంబ సభ్యులు, లాయర్ రూడీ గియులియాని క్షమాభిక్ష పొందిన వారి జాబితాలో లేరు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ట్రంప్ తన మాజీ సలహాదారుడు స్టీవ్ బ్యానన్‌కు క్షమాభిక్ష పెట్టారు. ప్రజలను మోసం చేయడమే కాక దాతల నుంచి ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను బ్యానన్ సేకరించారని, వీటిలో చాలా మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఆయన ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ బ్యానన్ వీటిని ఖండించారు. (చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) బ్యానన్ చాలా ముఖ్యమైన నాయకుడని, ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్న ట్రంప్ అతడికి క్షమాభిక్ష పెట్టారు. మరోవైపు లిల్ వెయిన్, కోడక్ బ్లాక్ అక్రమ ఆయుధాలు కలిగివున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. క్విల్‌పాట్రిక్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీరందరికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికాలో అధ్యక్షులు చాలా మందికి క్షమాభిక్ష పెడుతుంటారు. కొన్ని నెలలుగా ట్రంప్ కూడా చాలా మందికి వరుసగా క్షమాభిక్ష పెడుతూ వచ్చారు. సన్నిహితులతోపాటు తనతో కలిసి పనిచేసిన పాల్ మెనాఫోర్ట్ లాంటి వారు కూడా క్షమాభిక్ష పొందినవారిలో ఉన్నారు. ర్యాపర్ లిల్ వెయిన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనకు ట్రంప్ ఆమోదం తెలిపారు. మరో ర్యాపర్ కోడక్ బ్లాక్, డెట్రాయిట్ మాజీ మేయర్ క్వేమ్ కిల్పాట్రిక్ల శిక్షలను కూడా తగ్గించారు. (చదవండి: బైడెన్ కర్తవ్యాలు) మొత్తంగా 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారని, మరో 70 మందికి శిక్షలు తగ్గించారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు సలహాదారుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖుల్లో బ్యానన్ కూడా ఒకరు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ గత ఏడాది ఆగస్టులో బ్యానన్‌పై ఆరోపణలు వచ్చాయి. -
రేపు ఉదయం ట్రంప్ టాటా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ఉదయం వైట్‌హౌజ్‌ను, వాషింగ్టన్‌ను వీడనున్నారు. అదే రోజు దేశ నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా చివరి రోజైన మంగళవారం ట్రంప్ బిజీబిజీగా గడపనున్నారు. దాదాపు వంద మందికి క్షమాభిక్ష ప్రకటించే, లేదా శిక్షా కాలాన్ని తగ్గించే ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు. వారిలో హెల్త్ కేర్ కుంభకోణానికి పాల్పడిన నేత్ర వైద్యుడు డాక్టర్ సోలమన్ మెల్గన్, పలువురు వైట్‌కాలర్ క్రిమినల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మేరీలాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో బుధవారం ట్రంప్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమం జరపనున్నారు. ఆ తరువాత, ట్రంప్ తన అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌కు వెళ్తారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కన్నా ముందే వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి 7.15 గంటల మధ్య అది ఉండొచ్చని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. కలర్ గార్డ్, 21 గన్ సెల్యూట్‌తో అధ్యక్షుడికి వీడ్కోలు పలికే అవకాశముందన్నాయి. సీఎన్ఎన్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకోవాలనుకోవడం లేదు. తనకు, తన పిల్లలకు క్షమాభిక్ష ప్రకటించే దిశగా ట్రంప్ ఆలోచించడం లేదు. జనవరి 6 నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. స్వీయ క్షమాభిక్ష నిర్ణయం తీసుకుంటే.. నేరం చేశానని అంగీకరించినట్లుగా తేలుతుందని ట్రంప్‌కు సన్నిహితులు సలహా ఇచ్చారు. అయితే, చివరి నిమిషంలో ట్రంప్ మనసు మార్చుకుని, స్వీయ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎన్ఎన్ పేర్కొంది. క్షమాభిక్ష ప్రకటించాల్సిన, శిక్షాకాలం తగ్గించాల్సిన వారి జాబితాను ఇప్పటికే రూపొందించారని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. -
ట్రంప్ స్వీయ క్షమాభిక్ష..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడే ముందు మరో అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యాపిటల్ భవనంపై దాడికి మద్దతుదారులను ప్రోత్సహించి ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రంప్ తనని తాను క్షమించుకునే అవకాశాల గురించి యోచిస్తున్నారు. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపేయాలని కాంగ్రెస్ సభ్యుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ క్షమాభిక్షకి గల సాధ్యా«సాధ్యాలపై సలహాదారులతో సంప్రదిస్తున్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. క్షమాభిక్షతో ఎదురయ్యే పర్యవసానాల గురించి నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి క్షమాభిక్షకు వ్యూహరచన క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్‌కి చట్టపరంగా కూడా ముప్పును ఎదుర్కొనే అవకాశముంది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ట్రంప్ తన ముందున్న ఏకైక మార్గం స్వీయ క్షమాభిక్ష అని యోచిస్తున్నారు. కేవలం తనొక్కడినే కాకుండా కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ ట్రంప్ సహా కుటుంబ సభ్యులందరికీ క్షమాభిక్ష పెట్టడానికి వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేవారంలో ట్రంప్ అధ్యక్షుడి హోదాలో కొందరికి క్షమాభిక్ష పెట్టనున్నారు. అదే సమయంలో తనని తాను క్షమించుకున్నట్టు ప్రకటించుకుంటే పదవి వీడాకా ఎలాంటి సమస్యలు ఎదురుకావన్న భావనలో ట్రంప్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చట్టపరంగా వీలవుతుందా ? అమెరికా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు కూడా ఇలా తనని తాను క్షమించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ విషయంలో అమెరికా చట్టాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు మాత్రం స్వీయ క్షమాభిక్షకు అవకాశం లేదంటున్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారి వాదన. చట్టాల్లో స్వీయ క్షమాభిక్షపై స్పష్టత లేకపోవడంతో ట్రంప్ ఏదైనా చేయవచ్చునని డ్యూక్ లా ప్రొఫెసర్ జెఫ్ పావెల్ అన్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ జొనాథన్ టర్లీ కూడా ట్రంప్ స్వీయ క్షమాభిక్షను ఎవరూ ఆపలేరన్నారు. మూడేళ్ల క్రితం నుంచి.. అధ్యక్షుడికి తనని తాను క్షమించుకునే హక్కు ఉంటుందంటూ మూడేళ్ల క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ దుమారాన్నే రేపింది. రాజ్యాంగ నిపుణులు అధ్యక్షుడికి స్వీయ క్షమాభిక్ష హక్కు ఉందని తనతో చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. -
మైఖెల్ ఫ్లిన్కు ట్రంప్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖెల్ ఫ్లిన్కు క్షమాభిక్షకు ప్రసాదించారు. 2016 ఎన్నికల్లో రష్యా ప్రమేయానికి సంబంధించి ఎఫ్‌బీఐ ముందు తప్పుడు వివరాలిచ్చారని ఫ్లిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లిన్కు క్షమాభిక్ష ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫ్లిన్‌ను ఎప్పుడూ ప్రాసిక్యూట్ చేయలేదని, అలాగే ఫ్లిన్ కేసుపై న్యాయశాఖ జరిపిన స్వతంత్ర దర్యాప్తు సైతం క్షమాభిక్షను సమర్ధించిందని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రమైన అవినీతికి నిదర్శనమని డెమొక్రాట్ నేతలు దుయ్యబట్టారు. తన పదవీ అధికారాలను ట్రంప్ అసంబద్దంగా ఉపయోగిస్తున్నారన్నారు. ఫ్లిన్ చర్యలు జాతీయ భద్రతకు ముప్పని, క్షమాభిక్ష తగదని విమర్శించారు. -
వాయిదాల ఉరి.. న్యాయమేదరి?
న్యూఢిల్లీ: యావత్ దేశాన్నీ కుదిపేసిన నిర్భయ పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు శతవిధాలా యత్నిస్తున్నారు. న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రతిసారీ నిర్భయ తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. మృత్యువు తరుముకొస్తున్న ప్రతి సందర్భంలోనూ దోషుల తరఫు న్యాయవాదులు చట్టపరిధిలో శిక్ష అమలును అడ్డుకుంటూనే ఉన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి. న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకునే హక్కు దోషులకుందన్న న్యాయ నిబంధనల నేపథ్యంలో మరణశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. మరణశిక్ష పడిన దోషులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా, లేదా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవడం ద్వారా శిక్ష అమలు కొంతకాలం వాయిదా పడేలా చేసుకోవచ్చు. ఒకసారి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినట్టయితే, తిరస్కరణను సవాల్ చేస్తూ కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇలాంటి అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటూ మరణశిక్షని వాయిదా వేస్తూ వచ్చారు దోషులు. చివరకు తలగోడకేసి కొట్టుకొని కూడా అనారోగ్యం, గాయాలు అయ్యాయన్న నెపంతో ఉరిశిక్షని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► జనవరి 22, 2020: ఈ కేసులో జనవరి 7న ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు దోషులు నలుగురినీ జనవరి 22న ఉరితీయాలని తీర్పునిచ్చింది. ► ఫిబ్రవరి 1, 2020: అయితే ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష తిరస్కరణ అనంతరం ఉరిశిక్షకు 14 రోజుల గడువివ్వాలన్న నిబంధనల మేరకు జనవరి 17న ఢిల్లీ కోర్టు నిర్భయ దోషుల ఉరిశిక్షను తిరిగి వాయిదా వేసి, ఫిబ్రవరి 1న దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంది. ► పవన్ గుప్తా 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌నంటూ జనవరి 17న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దీంతో రెండోసారి ఉరి ఆగిపోయింది. ► మార్చి 3, 2020: తిరిగి ఫిబ్రవరి 17న కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసింది. దీనిప్రకారం మార్చి 3న నలుగురికీ ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉంది. సోమవారం తాజాగా మూడోసారి మరణశిక్ష వాయిదా పడింది. -
నటి విజ్ఞప్తి.. కనికరించిన ట్రంప్!
వాషింగ్టన్ : హాలీవుడ్ నటి, రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ అభ్యర్థనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన్నించారు. కర్దాషియన్ గ్రాండ్ మదర్ అలైస్ మేరీ జాన్సన్ (63)కు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీనిపై స్పందించిన నటి కిమ్.. బెస్ట్ న్యూస్ ఎవర్ అని బుధవారం రాత్రి ట్వీట్ చేశారు. డ్రగ్సరాకెట్ కేసులో అరెస్టయిన అలైస్ మేరీ జాన్సన్ రెండు దశాబ్దాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు. కాగా, తన గ్రాండ్ మదర్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ను ఆమె కోరారు. మే 30న నిందితురాలు మేరీ జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె మనవరాలు కర్దాషియన్ అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. ఇటీవల ట్రంప్ ఓ బాక్సర్‌కు క్షమాబిక్ష ప్రసాదించగా.. తన గ్రాండ్ మదర్‌పై కూడా కనికరం చూపాలని నటి కర్దాషియన్ ట్రంప్‌ను కోరారు. నటి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్.. నిందితురాలు అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ పలు పర్యాయాలు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ నటి కర్దాషియన్‌తో మేరీ జాన్సన్ కేసు గురించి చర్చించారు. చివరగా నటి కర్దాషియన్ పోరాటం ఫలించడంతో వారి కుటుంబసభ్యులు ట్రంప్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, డ్రగ్స్ రాకెట్ కేసులో 1996లో అరెస్టయిన అలైస్ జాన్సన్‌కు ఎలాంటి పెరోల్ అవకాశం ఇవ్వకుండానే జీవితఖైదు విధించారు. అలైస్ మేరీ జాన్సన్ -
నేనే తప్పూ చేయలేదు : ట్రంప్
వాషింగ్టన్ : 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పూ చేయనందున తనకున్న హక్కును ఉపయోగించుకునే అవసరం తలెత్తబోదన్నారు. న్యాయనిపుణులు చెబుతున్న మేరకు తనకు క్షమాబిక్ష ప్రసాదించే హక్కు తనకుందని..తానెలాంటి తప్పూ చేయనప్పుడు తానలా ఎందుకు చేయాలని ట్రంప్ సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు. ట్రంప్‌కు తనకు క్షమాభిక్ష ప్రసాదించుకునే అధికారం ఉందని ఆయన న్యాయవాది రూడీ గిలియానీ ప్రకటన చేసిన నేపథ్యంలో ట్రంప్ ఇలా ట్వీట్ చేయడం గమనార్హం. అయితే అధ్యక్షుడికి క్షమాభిక్ష ప్రసాదించుకునే ఉద్దేశం లేదని గిలియానీ చెప్పారు. అమెరికా రాజ్యాంగం క్షమాభిక్షలను ప్రసాదించే అధికారం అధ్యక్షుడికి కట్టబెట్టిందని..ఆయనకు క్షమాభిక్ష ఇచ్చుకోరాదని ఎక్కడా పేర్కొనలేదని గిలియానీ పేర్కొనడం గమనార్హం. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ విచారణ చేపట్టారు. ట్రంప్ ప్రచారంలో భాగంగా రష్యాతో కుమ్మక్కయ్యారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ట్రంప్ ప్రచార సహాయకులతో పాటు మాజీ ప్రచార కమిటీ ఛైర్మన్ పౌల్ మనఫోర్ట్పై ఈ విచారణ నేపథ్యంలో నేరారోపణలు నమోదయ్యాయి. రష్యా విచారణను చట్టవిరుద్ధంగా తొక్కిపెట్టేందుకు ట్రంప్ వ్యవహరిస్తున్నారా అనే అంశంపైనా విచారణ జరుగుతోంది. కాగా ముల్లర్‌కు ట్రంప్ న్యాయవాదులు రాసిన లేఖ అధ్యక్షుడు స్వయంగా క్షమాభిక్ష ప్రసాదించుకుంటారనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అధ్యక్షుడు తలచుకుంటే ప్రధాన న్యాయ అధికారిగా విచారణను రద్దు చేయడం లేదా తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అధికారాన్ని వినియోగించుకునే హక్కు ఆయనకు ఉంటాయని ఈ లేఖలో పేర్కొనడం గమనార్హం. -
కనికరించి వదిలేయండి ట్రంప్.. కిమ్ విజ్ఞప్తి!
వాషింగ్టన్ : హాలీవుడ్ రియాలిటీ టీవీ స్టార్, నటి కిమ్ కర్దాషియన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకున్నారు. తన గ్రాండ్ మదర్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ను ఆమె కోరారు. అలైస్ మేరీ జాన్సన్ (63)ను అమెరికా పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల ట్రంప్ ఓ బాక్సర్‌కు క్షమాబిక్ష ప్రసాదించగా.. తన గ్రాండ్ మదర్‌పై కూడా కనికరం చూపాలని నటి కర్దాషియన్ ట్రంప్‌ను కోరారు. గతేడాది నుంచి ఇప్పటివరకూ పలు పర్యాయాలు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్ నటి కర్దాషియన్‌తో మేరీ జాన్సన్ కేసు గురించి చర్చించారు. తాజాగా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి డ్రగ్స్ కేసుపై మరోసారి విచారణ జరిపి మేరీ జాన్సన్‌కు విముక్తి కల్పించాలని కర్దాషియన్ విజ్ఞప్తి చేశారు. కర్దాషియన్‌తో సమావేశం గొప్పగా జరిగిందని, జైలు శిక్ష, సంస్కరణలు మార్పులపై చర్చించినట్లు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. బుధవారం (మే 30న) నిందితురాలు మేరీ జాన్సన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె మనవరాలు కిమ్ కర్దాషియన్ శుభాకాంక్షలు తెలిపారు. 1996లో డ్రగ్స్ కేసు ఆరోపణలతో మోడల్ అయిన జాన్సన్‌కు పెరోల్ కూడా ఇవ్వకుండా జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రెండు దశాబ్దాలుగా జాన్సన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారని, ఆమె విషయంలో ఇప్పుడైనా ఓ మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్‌ను కలుసుకున్న నటి కిమ్ కర్దాషియన్ అభిప్రాయపడ్డారు. Great meeting with @KimKardashian today, talked about prison reform and sentencing. pic.twitter.com/uOy4UJ41JF — Donald J. Trump (@realDonaldTrump) 30 May 2018 -
క్షమాభిక్ష నేను కోరలేదు..
ముంబైః తన క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నరు తోసిపుచ్చారన్న వార్తలపై బాలీవుడ్ హీరో సంజయ్ దత్ స్పందించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషనే పెట్టుకోలేదని స్పష్టం చేశాడు. తానుగానీ, తన కుటుంబసభ్యులు కానీ మహారాష్ట్ర గవర్నరు, ప్రభుత్వానికి అలాంటి అర్జీ పెట్టుకోలేదని సంజుభాయ్ స్పష్టం చేశాడు. దీనికి సంబంధించి సంజయ్ దత్ తరఫు న్యాయవాదులు హితేష్ జైన్, సుభాష్ జాదవ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంజయ దత్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఎవరూ క్షమాభక్ష పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ఈ పిటిషను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. సంజయ్‌తోపాటు, ఈ కేసులో మిగిలిన దోషులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఖట్జూ ఈ పిటిషన్ వేశారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆయన శిక్షాకాలం పూర్తి కావస్తుండగా, ఇక క్షమాభిక్ష పిటిషన్ ప్రశ్నే ఉత్పన్నం కాదని వారు స్పష్టం చేశారు. ఇటీవల ఫిబ్రవరిలో సంజయ్ పెరోల్ పై బయటకు వచ్చాడు. కాగా 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అతడికి 2013లో సుప్రీంకోర్టు అయిదేళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి విదితమే. అయితే అప్పటికే దత్ 18 నెలలపాటు కారాగారంలో గడపడంతో ఆ కాలాన్ని మినహాయించింది. 2013 మే లో కారాగారానికి వెళ్లిన సంజయ్ దత్ 30 నెలల పాటు శిక్ష అనుభవించాడు. 2016, ఫిబ్రవరిలో అతడు విడుదల కావాల్సి ఉంది. కాగా 1993లో ముంబైలో 13 వరుస బాంబు పేళ్లులు సంభవించాయి. ఈ ఘటనల్లో 257మంది చనిపోగా, మరో 713మంది గాయపడ్డారు.