అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ఉదయం వైట్‌హౌజ్‌ను, వాషింగ్టన్‌ను వీడనున్నారు. అదే రోజు దేశ నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా చివరి రోజైన మంగళవారం ట్రంప్ బిజీబిజీగా గడపనున్నారు. దాదాపు వంద మందికి క్షమాభిక్ష ప్రకటించే, లేదా శిక్షా కాలాన్ని తగ్గించే ఫైల్స్‌పై సంతకాలు చేయనున్నారు. వారిలో హెల్త్ కేర్ కుంభకోణానికి పాల్పడిన నేత్ర వైద్యుడు డాక్టర్ సోలమన్ మెల్గన్, పలువురు వైట్‌కాలర్ క్రిమినల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మేరీలాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో బుధవారం ట్రంప్‌కు వీడ్కోలు పలికే కార్యక్రమం జరపనున్నారు. ఆ తరువాత, ట్రంప్ తన అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్‌కు వెళ్తారు.
కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం కన్నా ముందే వీడ్కోలు కార్యక్రమం ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి 7.15 గంటల మధ్య అది ఉండొచ్చని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. కలర్ గార్డ్, 21 గన్ సెల్యూట్‌తో అధ్యక్షుడికి వీడ్కోలు పలికే అవకాశముందన్నాయి. సీఎన్‌ఎన్ వార్తాసంస్థ కథనం ప్రకారం.. అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ స్వీయ క్షమాభిక్ష ప్రకటించుకోవాలనుకోవడం లేదు. తనకు, తన పిల్లలకు క్షమాభిక్ష ప్రకటించే దిశగా ట్రంప్ ఆలోచించడం లేదు. జనవరి 6 నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. స్వీయ క్షమాభిక్ష నిర్ణయం తీసుకుంటే.. నేరం చేశానని అంగీకరించినట్లుగా తేలుతుందని ట్రంప్‌కు సన్నిహితులు సలహా ఇచ్చారు. అయితే, చివరి నిమిషంలో ట్రంప్ మనసు మార్చుకుని, స్వీయ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఎన్‌ఎన్ పేర్కొంది. క్షమాభిక్ష ప్రకటించాల్సిన, శిక్షాకాలం తగ్గించాల్సిన వారి జాబితాను ఇప్పటికే రూపొందించారని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment