యూఎస్‌లో రెండు బిగ్‌ ‘డే’లు.. అందులో ఒకటి నేడే! | Joe Biden and Kamala Harris' Inauguration Day Today | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో రెండు బిగ్‌ ‘డే’లు.. అందులో ఒకటి నేడే!

Published Wed, Jan 20 2021 12:01 AM | Last Updated on Wed, Jan 20 2021 10:40 AM

Joe Biden and Kamala Harris' Inauguration Day Today - Sakshi

యూఎస్‌లో రెండు బిగ్‌ ‘డే’లు ఉంటాయి. యేటా వచ్చే ఇండిపెండెన్స్‌ డే ఒకటి. నాలుగేళ్లకొకసారి వచ్చే ఇనాగురేషన్‌ డే ఇంకొకటి. జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినం. జనవరి 20 అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ దినం. స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఆ దేశంలో స్వీకారానికి అంత ప్రాధాన్యం ఉంది. ఈరోజు ఆమెరికా ఇనాగురల్‌ డే. జో బైడెన్, కమలా హ్యారిస్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరున్నా లేకున్నా, ఎవరి పార్టీ ఏదైనా.. కొత్త అధ్యక్షుడి స్వీకారంలో పాత అధ్యక్షుడు ఉండటం సంప్రదాయం.

అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవాళ బైడెన్‌ వేడుకకు ‘స్కిప్‌’ కొడుతున్నారు. అంటే.. ఆయన హాజరు కావడం లేదు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. బైడెన్‌ గెలవక ముందు నుంచే ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ట్రంప్‌. బైడెన్‌ గెలిచాక ‘నీ గెలుపును గుర్తించను ఫో..’ అన్నట్లే ఉండిపోయారు. అలాగని అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి వీపు చూపించిన అధ్యక్షులలో ట్రంపే మొదటి వారు కాదు. ఇంకొకాయన కూడా ఉన్నారు. ఆ వివరాలతో పాటు.. గత ‘ప్రెసిడెన్షియల్‌ ఇనాగురేషన్‌’లలో సంభవించిన కొన్ని ఆసక్తికరమైన ఘటనలు ఏమిటో చూద్దాం. 

బైడెన్‌కి ఎంతుందో ట్రంప్‌కీ అంతుంది! ట్రంప్‌ అమెరికన్‌లందరి మనిషి. బైడెన్‌ అమెరికన్‌లతో పాటు, అమెరికాలోని అన్ని దేశాల వారి మనిషి. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు ట్రంప్‌. చివరి ఫలితాల్లో ఓడిపోయారు. అది ఉండిపోయింది ట్రంప్‌ మనసులో. ట్రంప్‌ మనసులోనే కాదు.. ట్రంప్‌ని అభిమానించే వారందరి మనసుల్లో, జాతీయ భావన ఉన్న అమెరికన్‌లు అందరిలో ఆ బాధ, కోపం అలా ఉండిపోయాయి. ఎవరి మనసులో ఎలా ఉన్నా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి పాత అధ్యకుడు హాజరవ్వాలి. పార్టీ వేరైనప్పటికీ హాజరు నుంచి మినహాయింపు ఉండదు. పద్ధతి అది. ట్రంప్‌ గురించి చెప్పేదేముంది. ‘ముందు అమెరికా. ఆ తర్వాతే పద్ధతి’ అనే మనిషి. అందుకే పద్ధతిని పక్కన పెట్టి, నికార్సయిన అమెరికన్‌గా వేడుకకు స్కిప్‌ కొడుతున్నారు. స్కిప్‌ కొట్టినందుకు రాజ్యాంగమేమీ తప్పు పట్టదు. ఒకవేళ రాజ్యంగంలో ఉన్నా ట్రంప్‌కు పట్టదు. ‘నాదే శాసనం. నేనే రాజ్యాంగం’ అన్నట్లు ఉన్నారు కదా ఈ నాలుగేళ్లూ! 

ఇప్పుడు ట్రంప్‌ స్కిప్‌ కొట్టినట్లు, శత్రుత్వ భావనతో కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఒకప్పుడు స్కిప్‌ కొట్టిన అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌. అమెరికా రెండవ అధ్యక్షుడు ఆయన. 1797 నుంచి 1801 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీ ‘ప్రో అడ్మినిస్ట్రేషన్‌’. యు.ఎస్‌.లో తొలి రాజకీయపార్టీ అది. దానికే ఇంకో పేరు ‘ఫెడరలిస్ట్‌’ పార్టీ. ఆయన తర్వాత అధ్యక్షులు అయినవారు థామస్‌ జెఫర్సన్‌. జెఫర్సన్‌ వరుసగా రెండు టర్మ్‌లు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనది డెమొక్రాటిక్‌ రిపబ్లికన్‌ పార్టీ. జాన్‌ ఆడమ్స్‌ నుంచి థామస్‌ జెఫర్సన్‌కు అధికారం చేతులు మారేటప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి జాన్‌ ఆడమ్స్‌ వెళ్లలేదు. ఆడమ్స్‌ వ్యక్తిగా జంటిల్మన్‌. రాజకీయవేత్తగా పగా ప్రతీకారాల మనిషి. జెఫర్సన్‌ కూడా అంతే. ఆడమ్స్‌ పవర్‌లో ఉన్నప్పుడు ఇద్దరికీ పడేది కాదు. ఒకర్నొకరు విమర్శించుకునేవారు. అసలు ఒకర్ని చూస్తే ఒకరికి మండిపోయేదని హ్యూస్టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నాన్సీ బెక్‌ యంగ్‌ చెబుతుంటారు. ఆడమ్స్‌ నుంచి ట్రంప్‌ వరకు ఈ మధ్యలో  పాత అధ్యక్షులు కొందరు కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి వెళ్లలేకపోయినా అందుకు కారణం శత్రుత్వమైతే కాదు. 

ఈ పగలు, పట్టింపులను అలా ఉంచితే, అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవంలోని ప్రతి నిముషం చరిత్రలో రికార్డు అవుతూ ఉంటుంది. ఆ కొద్ది గంటల్లో విశేషాలు ఏమైనా జరిగితే చరిత్రలో వాటికి ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఇప్పుడంటే అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వాషింగ్టన్‌ డీసీలోని ‘క్యాపిటల్‌’ బిల్డింగ్‌లో జరుగుతోంది. అమెరికా తొలి అధ్యక్షుడు (1789–1797) జార్జి వాషింగ్టన్‌ ప్రమాణం చేసే నాటికి వాషింగ్టన్‌లోని కాపిటల్‌ బిల్డింగ్‌ పూర్తవలేదు ఆ కార్యక్రమం కనుక న్యూయార్క్‌ సిటీలోని ఆనాటి (ఇప్పుడున్నది కాదు) ఫెడరల్‌ హాల్‌లో జరిగింది. ఆ తర్వాత నిర్మాణం పూర్తయిన కాపిటల్‌ బిల్డింగ్‌.. కాలక్రమంలో అధ్యక్షుల ప్రమాణ స్వీకార భవనం అయింది. మొన్న జనవరి 6 న విధ్వంసం జరిగింది ఈ పాలనా భవనంలోనే. 


వాషింగ్టన్‌ డీసీలో నేడు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ జరుగనున్న ‘క్యాపిటల్‌’ భవంతి

ఇప్పుడు బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయబోతున్న కాపిటల్‌ భవనానికి, ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు భద్రతగా ఆర్మీ రంగంలోకి దిగుతున్నట్లే.. అమెరికా అంతర్యుద్ధం ప్రారంభం అవుతున్న దశలో 1861లో అధ్యక్షుడిగా గెలిచిన అబ్రహాం లింకన్‌ ప్రమాణ స్వీకారానికి అంతే భారీగా సైన్యాన్ని దింపి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయవలసి వచ్చింది. అధ్యక్షుడిగా రెండోసారి 1865 మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఏప్రిల్‌ 15న లింకన్‌ హత్యకు గురయ్యారు. ఆయన మరణంతో అదే రోజు ఉపాధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్‌ ఒక హోటల్‌ రూమ్‌లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చింది. అప్పట్లో మార్చి నెలలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగేది. ప్రెసిడెంట్‌ విలియమ్‌ మెకిన్లే (1897–1901) 1901 సెప్టెంబర్‌ 14న హత్యకు గురైనప్పుడు కూడా ఆయన ఉపాధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ అదే రోజు తన న్యూయార్క్, బఫెలో ప్రాంతంలోని తన ఇంట్లో నుంచి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

థియోడర్‌ రూర్వెల్ట్‌కు ఫ్రాంక్లిన్‌ డెలనో రూజ్వెల్ట్‌ అనే కజిన్‌ ఉన్నారు. ఆయన నాలుగుసార్లు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. 1945లో చనిపోడానికి కొద్ది రోజుల ముందు ఆయన నాలుగో ప్రమాణ స్వీకారం జరిగింది. రెండు టెర్మ్‌లకు మించి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న ఏకైక అమెరికా అధ్యక్షుడు డెలనోనే. ఎలా సాధ్యం? ఎవరైనా రెండు టెర్మ్‌లే కదా అక్కడి రాజ్యాంగం ప్రకారం ఉండాలి! అప్పటికింకా.. ‘రెండుసార్లు మాత్రమే’ నిలబడాలి అనే 22వ రాజ్యాంగ సవరణ జరగలేదు. డెలనో నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచారు. కనుక నాలుగుసార్లు ప్రమాణ స్వీకారం చేయగలిగారు.

చరిత్రలో ప్రసిద్ధి చెందిన ప్రమాణ స్వీకారం మాత్రం లిండన్‌ బైన్స్‌ జాన్సన్‌దే. ఆయన 1963–69 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌.కెనడీకి బైన్స్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1963లో కెనడీ హత్య జరగడంతో బైన్స్‌ అధ్యక్షుడయ్యారు. కెనడీ హత్యతో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంలో బైన్స్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ప్రమాణ స్వీకారాలతో పాటు, వాటికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా చరిత్రలో నిలచినవి ఉన్నాయి. ఇటీవలి కాలానికి వస్తే, 2009లో బరాక్‌ ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అమెరికన్‌ సింగర్‌ అరెథా ఫ్రాంక్లిన్‌ ఇచ్చిన ప్రదర్శన వాషింగ్టన్‌ చరిత్రలోనే నిలిచిపోయేంతగా వెలిగిపోయింది. అసలు ఆమె రాక వల్లనే ఒబామా స్వీకారానికి నిండుదనం వచ్చిందని యూఎస్‌ పత్రికలు అరెథాను ఆకాశానికి ఎత్తేశాయి. ‘‘అదొక మానవాళి మూకుమ్మడి ఉత్సవం’’ అని నాన్సీ బెక్‌ రాశారు.

ఈరోజు జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం కూడా చరిత్రలో నిలిచిపోబోయే ఘట్టమే. తీవ్ర ఉద్రిక్తతల మధ్య, సైన్యం నీడలో  ‘ఐ డు సాలెమ్న్‌లీ స్వీయర్‌ దట్‌ ఐ విల్‌ ఫెయిత్‌ఫుల్లీ.. అని ప్రమాణం చేయబోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement