ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ నుంచి దిగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముందు జాగ్రత్త చర్యగా మిలటరీ ఆస్పత్రికి తరలించారు. వాషింగ్టన్ శివారు ప్రాంతంలోని బెథెస్దాలోని వాల్టర్ రీడ్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో వెద్యులు ఆయనకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లతో చికిత్స అందిస్తున్నారు. వైట్ హౌస్ నుంచి ‘మెరైన్ వన్’ హెలికాప్టర్‌లో ట్రంప్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన మాస్క్ ధరించారు. ట్రంప్ చికిత్సకి బాగా స్పందిస్తున్నారని ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సీన్ కాన్లే వెల్లడించారు.
కరోనా ఇన్‌ఫెక్షన్‌కి రెమ్‌డెసివిర్ థెరపీ ఇవ్వాలని వైద్య నిపుణులు సూచించినట్టు కాన్లే తెలిపారు. ‘ట్రంప్‌కు కృత్రిమ ఆక్సిజన్ అవసరం రాలేదు. వైద్య నిపుణులతో సంప్రదించాక రెమ్‌డెసివిర్ థెరపీ మొదలు పెట్టాం.మొదటి డోసు ఇచ్చాం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగుంది’’అని కాన్లే చెప్పారు. కాగా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌కి స్వల్పంగా దగ్గు, తలనొప్పి మాత్రమే ఉండడంతో శ్వేతసౌధంలోనే ఉంచి చికిత్స ఇస్తున్నారు. ట్రంప్ కుటుం బంలో మిగిలిన వారందరికీ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో శ్వేత సౌధం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ట్రంప్‌కి రెజెనెరాన్
కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవ డానికి ట్రంప్‌కి ఇచ్చే చికిత్స వివరాలను డాక్టర్ సీన్ కాన్లే ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా సోకిన విషయం తెలిసిన తర్వాత మొదటి సారిగా రెజెనెరాన్–కోవ్2 పాలిక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ 8 గ్రాముల డోసు ఇచ్చారు. ఈ యాంటీబాడీ కాక్‌టెయిల్ ఇంకా ప్రయోగ దశలోనే ఉండడం గమనార్హం. శరీర భాగాలపై కరోనా వైరస్ మరింతగా దాడి చేయకుండా ఈ కాక్‌టెయిల్ రక్షిస్తుందని భావిస్తున్నారు. రెండు మోనోక్లానల్ యాంటీబాడీస్ కాంబినేషన్‌గా ఈ కాక్‌టెయిల్‌ను రూపొందించారు. ఈ కాక్‌టెయిల్ అమెరికాలో ఇంకా మూడో దశ ప్రయోగాల్లోనే ఉంది. దాంతో పాటు జింక్, విటమిన్ డి, ఫామొటైడైన్, మెలాటోనిన్, యాస్పిరిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తూనే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కూడా మొదలు పెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో రెమ్‌డెసివిర్‌తో పెద్దగా సత్ఫలితాలు లేవని ట్రంప్ పాలనా యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ ఇంజెక్షన్లు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే వైద్య నిపుణుల సూచనల మేరకే రెమ్‌డెసివిర్ థెరపీ ఇస్తున్నట్టుగా కాన్లే వివరించారు.
ట్రంప్ కోలుకోవాలన్న కిమ్
ట్రంప్, ఆయన భార్య మెలానియా కరోనా నుంచి కోలుకోవాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సందేశం పంపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. 2017లో అణుపరీక్షల విషయమై ట్రంప్, కిమ్ మాటల యుద్ధం చేశారు. అనంతరం ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ట్రంప్ దంపతులు తొందరగా కరోనా నుంచి రికవరీ కావాలని కోరుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెప్పారు.
బాగానే ఉన్నా..
తాను బాగానే ఉన్నానని ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు. వాల్టర్ రీడ్ ఆస్పత్రికి చేరగానే ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. మెలానియా బాగానే ఉందని తెలిపారు. ఆస్పత్రిలోని ప్రెసిడెన్షియల్ కార్యాలయం నుంచి ట్రంప్ కార్యకలాపాలు కొన్ని రోజులు నిర్వహిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.
వైట్ హౌస్‌కు కరోనా దడ
వైట్‌హౌస్‌లో పలువురు కరోనా బారిన పడగా, తాజాగా ముగ్గురు వైట్‌హౌస్ జర్నలిస్టులు, ట్రంప్ ప్రచార మేనేజర్, ఇద్దరు సెనేటర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. రిపబ్లిక్ పార్టీకి చెందిన సెనేటర్లు థామ్ టిల్లిస్, మైక్ లీకు కరోనా సోకినట్లు వారే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment