సియోల్: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారసుడు లీ సహా ప్రముఖ కార్పొరేట్లు తదితర 1,700 మందికి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విముక్తి దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రకటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన రోజును దక్షిణ కొరియా ఏటా ఆగస్ట్ 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటుంది. శామ్‌సంగ్ అనుబంధంగా ఉన్న రెండు సంస్థల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్‌కు ఆ సంస్థ వారసుడైన లీ జే యంగ్ భారీగా ముడుపులు అందజేశారు.
ఈయనతోపాటు లొట్టే గ్రూప్ చైర్మన్ షిన్ డాంగ్ బిన్ తదితరుల నుంచి కూడా అధ్యక్షురాలు భారీగా లంచాలు అందుకున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అధ్యక్షురాలు పార్క్ పదవి నుంచి వైదొలిగారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు గత ఏడాది అధ్యక్షుడు మూన్ క్షమాభిక్ష ప్రకటించారు. 30 నెలల జైలు శిక్ష పడిన శామ్‌సంగ్ వారసుడు లీకి కూడా గత ఏడాది పెరోల్ లభించింది. తాజాగా, అధ్యక్షుడి క్షమాభిక్షతో మిగిలిన జైలు జీవితం కూడా ముగియనుంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్తలకు క్షమాభిక్షలు ప్రకటించారని దక్షిణ కొరియా న్యాయశాఖ శుక్రవారం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment