Amnesty
-
క్షమాభిక్షపై చిగురిస్తున్న ఆశలు
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైలకు క్షమాభిక్ష కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దుబాయ్ అధికారులతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసుని వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. 17 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల వాసులు 2006లో దుబాయ్‌లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్ రాయ్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా పది మంది కలిసి హత్య చేశారనేది ఆరోపణ. కాగా ఈ కేసు నిందితుల్లో నలుగురు పాకిస్తానీయులు కాగా మిగిలిన ఆరుగురు తెలంగాణకు చెందినవారు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించి పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. అయితే శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలు విడుదలయ్యారు. కానీ తెలంగాణకు చెందిన మిగతా ఐదుగురు..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లే‹Ù, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు మాత్రం 17 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నారు. అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష ఈ ఐదుగురు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడం శాపంగా మారింది. ఈ కేసులు విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (అరబ్బీ భాషలో ‘నజ్ల ఖజా యా) ఈ హత్యను క్రూరమైనది (జినయా)గా పరిగణించింది. కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ కారణంగానే వీరు మరో ఎనిమిదేళ్ల వరకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలంగా కేటీఆర్ ప్రయత్నాలు ఐదుగురు ఖైదీల విడుదల కోసం మంత్రి కేటీఆర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్‌లోని బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి దియ్య సొమ్ము పరిహారం (బ్లడ్ మనీ) అందించారు. ఆ కుటుంబం ఇచ్చిన క్షమాభిక్ష అంగీకార పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరారు. అయితే నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాభిక్షను ప్రసాదించలేదు. ఆరు నెలల కిందట మరోసారి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మంత్రి మరోసారి తనప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించి జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష లభించేలా చూడాలని అక్కడి అధికారులను కోరారు. అంతకుముందు జరిగిన బిజినెస్ భేటీల సందర్భంగా దుబాయ్ రాజ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే పలువురు వ్యాపారవేత్తల వద్ద కూడా మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించి మానవతా దృక్పథంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న తాజా ప్రయత్నాలు, స్థానిక వ్యాపారవేత్తల నుంచి లభించిన సానుకూల హామీ నేపథ్యంలో తెలంగాణ ఖైదీల విడుదలపై కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
షినవత్రకు థాయ్‌లాండ్ రాజు క్షమాభిక్ష
బ్యాంకాక్: థాయ్‌లాండ్ మాజీ ప్రధానమంత్రి థక్సిన్ షినవత్ర(74)కు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అవినీతి ఆరోపణలపై ఆయనకు కోర్టు విధించిన ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఒక్క ఏడాదికి తగ్గించారు. ఇందుకు సంబంధించి రాజు మహా వజ్రాలొంగ్కర్న్ నిర్ణయాన్ని రాయల్ గజెట్ శుక్రవారం ప్రచురించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అంతిమ అధికారం రాజుదే. 2001, 2005ల్లో జరిగిన ఎన్నికల్లో షినవత్ర ప్రధాని అయ్యారు. 2006లో జరిగిన సైనిక కుట్రలో ప్రధాని పదవి నుంచి షినవత్రను గద్దె దించారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2008లో ఆయన దేశం విడిచి వెళ్లిపోయి, అజ్ఞాతంలో గడిపారు. వారం క్రితం దేశంలోకి ప్రవేశించిన వెంటనే అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆరోగ్యం క్షీణిస్తున్నందున క్షమాభిక్ష కోరుతూ రాజుకు విజ్ఞాపన పంపారు. షినవత్ర రాకతో దేశంలో మూడు నెలలుగా నెలకొన్న రాజకీయ అస్థిరత సమసిపోయే పరిణామాలు సంభవించాయి. షినవత్ర స్థాపించిన ఫ్యూథాయ్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో మద్దతు పెరగడం విశేషం. -
వాగ్నర్ సేనకు రష్యా క్షమాభిక్ష
మాస్కో: వాగ్నర్ సైన్యం తిరుగుబాటును నిలిపేయడంతో ఆ సైన్యం చీఫ్ ప్రిగోజిన్, అతని బలగాలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వారిపై ఎలాంటి క్రిమినల్ విచారణ ఉండదని ప్రకటించింది. 24 గంటల్లోపే వారు తమ కార్యకలాపాలను ఆపేయడంతో ఈ కేసును నిలిపివేస్తున్నట్టు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో 16 నెలలుగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారానికి ముప్పుగా పరిణమించిన సంఘటనల వరుసలో ఇది తాజా మలుపు. ప్రస్తుత సంక్షోభాన్ని నివారించే లక్ష్యంతో ప్రిగోజిన్‌కు పుతిన్ కొన్ని వాగ్దానాలు చేశారని, మరికొన్ని హామీలు ఇచ్చారని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. వాగ్నర్ గ్రూప్‌కు ఏడాదిలో రూ.8 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఆ గ్రూపు బలగాలకు జీతాలు, అలవెన్సులను సమకూర్చామన్నారు. ఆ డబ్బును ఎలా ఖుర్చు చేశారన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తారని పుతిన్ చెప్పారు. ఇలా ఉండగా, ప్రిగోజిన్ తమ దేశంలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో ప్రకటించారు. అతని బలగాలు కూడా కొంతకాలం పాటు బెలారస్‌లోనే ఉంటాయని వెల్లడించారు. రష్యా మిలిటరీ ఆధీనంలో పనిచేయడానికి ఒప్పందాలపై సంతకం చేయడానికి జూలై 1 గడువు కంటే ముందే తన దళాలు తమ ఆయుధాలను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయని ప్రిగోజిన్ తెలిపారు. -
తెలుగు ఐఏఎస్ అధికారిని పొట్టనబెట్టుకున్న...గ్యాంగ్‌స్టర్‌ను వదిలేశారు!
పట్నా: అతనో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్. మాజీ ఎంపీ కూడా. పేరు ఆనంద్ మోహన్. దాదాపు 30 ఏళ్ల కింద బిహార్‌లో ఏకంగా ఐఏఎస్ అధికారిపైకే మూకను ఉసిగొల్పి అత్యంత పాశవికంగా రాళ్ల దాడి చేయించి పొట్టన పెట్టుకున్నాడు. ఆ కేసులో 15 ఏళ్లుగా జీవితఖైదు అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేస్తూ నితీశ్‌కుమార్ సర్కారు వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏకంగా జైలు నిబంధనలనే మార్చేసింది! ఆనంద్‌తో సహా పలు తీవ్ర నేరాలకు పాల్పడి జీవితఖైదు అనుభవిస్తున్న మరో 26 మంది దోషుల విడుదలకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం పెరోల్ మీద ఉన్న అతడు ఆ సమయంలో తన కుమారుడైన ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్ నిశ్చితార్థ వేడుకను ఆస్వాదిస్తున్నాడు! నితీశ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్‌లోని రాజకీయ తదితర రంగాల ప్రముఖులంతా అందులో పాల్గొన్నారు. తనకు విముక్తి ప్రసాదిస్తున్నందుకు నితీశ్‌కు ఆనంద్ మోహన్ కృతజ్ఞతలు తెలిపాడు. త్వరలో డెహ్రాడూన్‌లో జరిగే కొడుకు పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించుకుంటానంటూ హర్షం వెలిబుచ్చాడు. పెరోల్ ముగియడంతో మంగళవారం జైలుకు తిరిగి వెళ్లిన అతను బుధవారం రెమిషన్‌పై విడుదల కానున్నాడు. నితీశ్ సర్కారు నిర్ణయంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్పీ, బీజేపీతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా తప్పుబట్టగా అధికార జేడీ(యూ) మాత్రం సమర్థించుకుంది. క్షమాభిక్ష జాబితాలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషి ఆర్జేడీ మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్, పలు తీవ్ర క్రిమినల్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే అవధేశ్ మండల్ కూడా ఉన్నారు. ఏం జరిగింది? 1994లో లాలుప్రసాద్ యాదవ్ హయాంలో బిహార్‌లో చోటా శుక్లా అనే కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్ బ్రిజ్ బిహారీ ప్రసాద్ సానుభూతిపరులు దారుణంగా కాల్చి చంపారు. మండల్ రిజర్వేషన్లపై దేశమంతా అట్టుడుకున్న వేళ అగ్రవర్ణ భూమిహార్ అయిన శుక్లా హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డిసెంబర్ 5న శుక్లా అంతిమయాత్ర సందర్భంగా ఆనంద్ మోహన్ పిలుపు మేరకు వేలాది మంది రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గోపాల్‌గంజ్ కలెక్టర్ అయిన తెలంగాణకు చెందిన దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్యను కార్లోంచి బయటికి లాగి రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి పొట్టన పెట్టుకున్నారు. ఆనంద్ మోహన్ దగ్గరుండి మరీ వారిని ఈ దాడికి ప్రేరేపించినట్టు చెబుతారు. ఈ కేసులో జైల్లో ఉండగానే ఎంపీగా గెలిచాడు. 2007లో కింది కోర్టు మరణశిక్ష విధించింది. దాంతో స్వతంత్ర భారత చరిత్రలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నాయకునిగా రికార్డుకెక్కాడు. తర్వాత దాన్ని పట్నా హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. అప్పట్నుంచీ అతడు జైల్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల హత్యకు, అత్యాచారాలకు పాల్పడ్డవారికి రెమిషన్ మంజూరు చేయరాదన్న నిబంధనను నితీశ్ సర్కారు తాజాగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర జైలు మాన్యువల్‌ను సవరిస్తూ ఏప్రిల్ 10న నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఆనంద్ మోహన్ విడుదల కోసమేనని అప్పట్నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నితీశ్‌తో అతని బంధం ఇప్పటిది కాదు. వారిద్దరూ సమతా పార్టీ సహ వ్యవస్థాపకులు. కృష్ణయ్య...అట్టడుగు నుంచి ఎదిగిన తెలుగు తేజం మూక దాడికి బలైన ఐఏఎస్ జి.కృష్ణయ్య తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ఇల్లు గడిచేందుకు తండ్రితో పాటు కూలి పనికి వెళ్లారు. జర్నలిజం కోర్సు చేసిన అనంతరం కొంతకాలం క్లర్కుగా, లెక్చరర్‌గా పని చేశారు. 1985లో సివిల్స్ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌గా బిహార్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రోజూ విధిగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. ఆయన దొరికిన తొలి పోస్టింగే బందిపోట్లకు, కిడ్నాపర్లకు స్వర్గధామంగా పిలిచే వెస్ట్ చంపారన్ జిల్లాలో! తన పనితీరుతో జిల్లాకున్న చెడ్డపేరుతో పాటు దాని రూపురేఖలనే సమూలంగా మార్చేశారని అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. తర్వాత నాటి సీఎం లాలు సొంత జిల్లా గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉండగా హత్యకు గురయ్యారు. అప్పుడాయనకు కేవలం 35 ఏళ్లు! ఈ దారుణంపై సీఎం హోదాలో లాలు పేలవ స్పందన తీవ్ర విమర్శలపాలైంది. కృష్ణయ్యకు నివాళులర్పించేందుకు వచ్చిన లాలును వెళ్లిపొమ్మని ఆయన భార్య ఉమా దేవి తెగేసి చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నేరగాళ్లను జైళ్లలోంచి విడుదల చేసి విచ్చలవిడిగా సమాజంపైకి ఉసిగొల్పే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఎక్కడుంటుందన్న ఆమె ప్రశ్న చాలాకాలం అందరి మనసులనూ తొలిచేసింది. ఇప్పటికీ మాఫియా రాజ్యమే కృష్ణయ్య భార్య ఉమ ఆవేదన ఆనంద్ మోహన్ విడుదల వార్తతో దివంగత ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమ షాకయ్యారు. తన గుండె పగిలిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం కొన్ని రాజ్‌పుత్ ఓట్ల కోసం ఒక దారుణమైన ఒరవడికి నితీశ్ సర్కారు శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. ‘‘ఆనంద్ మోహన్ మరణశిక్ష ఇతర నేరగాళ్లకు ఓ హెచ్చరికలా, నికార్సైన అధికారులకు భరోసాగా ఉంటుందని ఆశపడ్డా. కానీ దాన్ని జీవితఖైదుకు తగ్గించారు. దానికే నేను తల్లడిల్లిపోతే ఇప్పుడేమో ఆ శిక్షనూ రద్దు చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ బిహార్‌లో మాఫియా రాజ్యమే నడుస్తోందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాధికారులపై దాడులకు తెగబడేందుకు నేరగాళ్లకు ఇది మరింత ప్రోత్సాహమిస్తుంది. ఆనంద్ మోహన్ వంటి నేరగాళ్లు, వాళ్ల కుటుంబీకులే ఇంకా తమకు రాజకీయ ప్రాతినిధ్యం వహించాలా అన్నది రాజ్‌పుత్‌లు ఆలోచించుకోవాలి’’అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ఈ నిర్ణయం రద్దయ్యేలా చూడాలని కోరారు. ‘‘ఇలాంటి కేసుల్లో దోషులు జీవితాంతం జైల్లో గడపాల్సిందే. అందుకే నితీశ్ సర్కారు నిర్ణయంపై పట్నా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన ఉంది. దీనిపై నా భర్త బ్యాచ్ ఐఏఎస్ అధికారులతో చర్చిస్తున్నా’’అని వెల్లడించారు. కృష్ణయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తండ్రిని కోల్పోయేనాటికి వారికి పెద్ద కూతురు నిహారికకు ఏడేళ్లు, చిన్నమ్మాయి పద్మకు ఐదేళ్లు. వారిని తీసుకుని ఉమ హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా రిటైరయ్యారు. నిహారిక బ్యాంక్ మేనేజర్‌గా, పద్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్లో వేలాది నిరసనకారులకు క్షమాభిక్ష
దుబాయ్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన 22 వేల మందికి ఇరాన్ క్షమాభిక్ష ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ యువతి పోలీస్ కస్టడీలో మృతి చెందినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం, అణచివేత చర్యల్లో భాగంగా పోలీసుల కాల్పుల్లో వందల మంది చనిపోవడం తెలిసిందే. వేలాది మందిని ౖజñయ్పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే 22 వేల మందికి సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు ఇరాన్ న్యాయశాఖ అధిపతి జి.ఎం.ఎజెహి సోమవారం తెలిపారు. వీరితోపాటు వివిధ ఆరోపణలను ఎదుర్కొంటున్న మొత్తం 82 వేల మందికి సుప్రీం నేత క్షమాభిక్ష ప్రకటించారన్నారు. వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ నెల సందర్భంగా సుప్రీం నేత ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. తాజా చర్యతో ప్రభుత్వ విధానాలపట్ల దేశ ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తీవ్రతను పాలకులు గుర్తించినట్లయింది. -
విముక్తి దినోత్సవం.. ‘శామ్సంగ్’ వారసుడికి అధ్యక్షుడి క్షమాభిక్ష
సియోల్: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారసుడు లీ సహా ప్రముఖ కార్పొరేట్లు తదితర 1,700 మందికి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విముక్తి దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రకటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన రోజును దక్షిణ కొరియా ఏటా ఆగస్ట్ 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటుంది. శామ్సంగ్ అనుబంధంగా ఉన్న రెండు సంస్థల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్‌కు ఆ సంస్థ వారసుడైన లీ జే యంగ్ భారీగా ముడుపులు అందజేశారు. ఈయనతోపాటు లొట్టే గ్రూప్ చైర్మన్ షిన్ డాంగ్ బిన్ తదితరుల నుంచి కూడా అధ్యక్షురాలు భారీగా లంచాలు అందుకున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అధ్యక్షురాలు పార్క్ పదవి నుంచి వైదొలిగారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు గత ఏడాది అధ్యక్షుడు మూన్ క్షమాభిక్ష ప్రకటించారు. 30 నెలల జైలు శిక్ష పడిన శామ్సంగ్ వారసుడు లీకి కూడా గత ఏడాది పెరోల్ లభించింది. తాజాగా, అధ్యక్షుడి క్షమాభిక్షతో మిగిలిన జైలు జీవితం కూడా ముగియనుంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్తలకు క్షమాభిక్షలు ప్రకటించారని దక్షిణ కొరియా న్యాయశాఖ శుక్రవారం పేర్కొంది. -
పన్ను చెల్లింపుదారులకు షాక్ ! నిర్మలమ్మ బడ్జెట్ వరాల్లో మెలిక
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) తెలిసీ, తెలియకుండా వదిలేసిన వివరాలను అప్డేట్ చేసి, రెండేళ్లలోగా తిరిగి దాఖలు చేసేందుకు ఇచ్చిన వెసులుబాటును ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) స్కీముగా పరిగణించరాదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. గతంలో వెల్లడించని ఆదాయంపై అదనంగా 25% కట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సహేతుకమైన కారణాల వల్ల ఆదాయాన్ని చూపించలేకపోయిన వారు తమ రిటర్నులను సరిదిద్దుకునేందుకు దీన్ని ఉద్దేశించినట్లు బజాజ్ చెప్పారు. 12 నెలల్లోగా అప్డేటెడ్ ఐటీఆర్‌ను 12 నెలల్లోగా సమర్పిస్తే బాకీ ఉన్న పన్నుపై అదనంగా 25%, వడ్డీ కట్టాల్సి ఉంటుందని.. అదే 12 నెలల తర్వాత 24 నెలల్లోగా సమర్పిస్తే రేటు 50% దాకా పెరిగిపోతుందని ఆయన వివరించారు. ‘ఇదెలా పనిచేస్తుందంటే.. ఎవరైనా ట్యాక్స్పేయరు రూ.50,000 ఆదాయాన్ని చూపించడం మర్చిపోతే దానిపై రూ. 15,000 పన్ను వర్తిస్తుందనుకుందాం. అప్పుడు వారు ఆ రూ. 15,000పై అదనంగా మరో 25–50% వరకూ (అప్డేట్ చేసిన రిటర్నును దాఖలు చేసిన సమయాన్ని బట్టి) కట్టాల్సి ఉంటుంది‘ అని బజాజ్ వివరించారు. ‘ఇది..మీరు ఏడాది, రెండేళ్ల తర్వాతయినా ఐటీఆర్ వేయొచ్చని చెప్పడం కాదు. ఎందుకంటే, అలాగయితే నిఖార్సయిన ట్యాక్స్పేయరు కూడా తర్వాత వేయొచ్చులే అనుకోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకే అదనపు పన్ను విధిస్తున్నాం‘ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం డిసెంబర్ దాటితే, సవరించిన రిటర్నులను దాఖలు చేసే అవకాశం లేదు. చదవండి: ఓన్లీ ఫైలింగ్ అప్డేట్కి అవకాశం.. శ్లాబుల్లో నో ఛేంజ్.. -
జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలే లక్ష్యం
బోస్టన్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగసస్ స్పైవేర్ ప్రధాన లక్ష్యం జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలేనని అంతర్జాతీయ మీడియా పరిశోధనలో తేలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. స్పైవేర్‌తో సంపాదించిన 50వేలకు పైగా ఫోన్ నెంబర్ల జాబితా ఫొరిబిడెన్ స్టోరీస్ అనే ఎన్జీఓకు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు దొరికింది. ఈ జాబితాను ప్రముఖ మీడియా గ్రూపులు విశ్లేషించాయి. 50 దేశాల్లో వెయ్యికి పైగా కీలక వ్యక్తులు నెంబర్లను ఇందులో గుర్తించారు. వీరిలో 189 మంది జర్నలిస్టులు, 600మంది రాజకీయవేత్తలు, 65మంది వ్యాపారులు, 85మంది మానవహక్కుల కార్యకర్తల నెంబర్లు ఇందులో ఉన్నాయని వాషింగ్టన్ పోస్టు ప్రకటించింది. సీఎన్ఎన్, అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ తదితర దిగ్గజ సంస్థల జర్నలిస్టుల నెంబర్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. ప్రముఖ జర్నలిస్టు ఖషోగ్గి హత్యకు నాలుగు రోజుల ముందు ఆయనకు కాబోయే భార్య ఫోనులో ఈ స్పైవేర్ ఇన్‌స్టాలైందని అమ్నెస్టీ తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ ఎన్ఎస్ఓ కొట్టిపారేసింది. తాము ఎప్పుడూ ఎలాంటి టార్గెట్ల జాబితాను ఉంచుకోవమని తెలిపింది. తమపై వచ్చిన కథనాలు నిరాధారాలని నిందించింది. అయితే ఈ వివరణలను విమర్శకులు తోసిపుచ్చుతున్నారు. కాగా, తమకు లభించిన జాబితాలో 15వేలకు పైగా నంబర్లు మెక్సికోకు చెందినవని మీడియా వర్గాలు తెలిపాయి. తర్వాత అధిక సంఖ్యలో మధ్యప్రాచ్యానికి చెందిన ఫోన్లున్నట్లు తెలిపాయి. నిఘా స్పైవేర్‌కు సంబంధించి ఎన్ఎస్ఓ గ్రూప్‌పై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది ఇజ్రాయిల్ కోర్టులో దావా వేసింది. అయితే సరైన ఆధారాలు లేవని కోర్టు ఈ పిటిషన్ కొట్టేసింది. ఆటంకవాదుల నివేదిక: షా పెగసస్ స్పైవేర్ అంశంపై కాంగ్రెస్, అంతర్జాతీయ సంస్థలపై హోంమంత్రి అమిత్‌షా ఎదురుదాడి చేశారు. ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టారన్న నివేదికను భారత ప్రగతిని అడ్డుకునేందుకు కుట్రతో ఆటంకవాదులు రూపొందించిన అవాంతరాల నివేదికగా అభివర్ణించారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలోనే ఎంపిక చేసినట్లు లీకేజీలు బయటకు రావడాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి ఇలాంటి దాడులు ఊహించినవేనని షా విమర్శించారు. వారి పార్టీని వారు సరిదిద్దుకోలేని వారు పార్లమెంట్లో అభివృద్ధికర అంశాలను అడ్డుకునే యత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి ఇలాంటి అసత్య నివేదికలతో సభా సమయం వృధా చేయడం మంచిది కాదని హితవు చెప్పారు. జాబితాలో రాహుల్, ప్రశాంత్ నంబర్లు! కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ మంత్రులు అశ్విన్ వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు పెగసస్ హ్యాకింగ్ జాబితాలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పెగసస్‌తో లక్ష్యంగా చేసుకున్నవారి జాబితాలో 300 మందికిపైగా భారతీయులున్నట్లు ‘ది వైర్’ వార్తా సంస్థ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు ఉద్యోగి, ఆమె చుట్టాల నంబర్లు ..ప్రముఖ వైరాలజిస్టు గగన్‌దీప్ కాంగ్, వసుంధరరాజే పర్సనల్ సెక్రటరీ తదితరులున్నారు. భారత్‌పై బురద జల్లేందుకే...! పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పలువురు ప్రముఖులపై నిఘా పెట్టారన్న వార్తలను కేంద్రం ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కొట్టిపారేశారు. పార్లమెంట్ సమావేశాలు ఆరంభమవుతున్నవేళ దేశ ప్రజాస్వామ్యానికి అపత్రిçష్ట అంటించేందుకే ఈ కథనాలను వండివారుస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎంతో పటిçష్టమైన వ్యవస్థలున్నాయని, అందువల్ల భారత్‌లో అక్రమ, అనైతిక నిఘా అసాధ్యమని చెప్పారు. ఈఅంశాన్ని పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తడంతో మంత్రి లోక్‌సభలో ఈ వివరణ ఇచ్చారు. మీడియా జాబితాలో ఫోన్ నెంబరున్నంతమాత్రాన హ్యాకింగ్ జరిగినట్లు కాదని ఐటీ మంత్రి వ్యాఖ్యానించారు. పెగాసస్‌ను ప్రభుత్వం వాడుతున్నదీ లేనిదీ తెలపలేదు. అమిత్‌షా తొలగింపునకు కాంగ్రెస్ డిమాండ్ జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టిన పెగసస్ స్పైవేర్ అంశంలో హోంమంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ప్రధాని మోదీ పాత్రపై లోతైన విచారణ జరపాలని కోరింది. పెగసస్ అంశానికి షానే బాధ్యత వహించాలని, ఆయన్ను తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఇతర పార్టీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ విషయంపై న్యాయ లేదా పార్లమెంటరీ విచారణ కోరే అంశమై అన్ని పార్టీలతో కాంగ్రెస్ చర్చిస్తుందన్నారు. హోంమంత్రి పదవికి షా అనర్హుడని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. డిజిటల్ ఇండియా అని మోదీ చెబుతుంటారని, కానీ నిజానికి ఇది నిఘా ఇండియా అని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ దుయ్యబట్టారు. షాను వెంటనే ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ఈ నిఘా వ్యవహారం మొత్తం మోదీ ప్రభుత్వ కన్నుసన్నులోనే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్‌షా స్పందించాలి పెగసస్‌తో ప్రముఖుల సమాచారం హ్యాక్ అయిందన్న వార్తలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్పందించాలని శివసేన డిమాండ్ చేసింది. దేశంలో ప్రభుత్వం, యంత్రాంగం బలహీనంగా ఉన్నాయని ఈ ఘటన చెబుతోందని సేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ప్రజలకు ప్రధాని, హోంమంత్రి ఈ అంశంపై స్పష్టతనివ్వాలని ఆయన కోరారు. -
ఉపశమనం ఇంతటితో సరి
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీని మాఫీ చేశామని, ఇంతకుమించిన ఉపశమనం ఇవ్వబోమని కేంద్రం స్పష్టంచేసింది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పునరాలోచించే ప్రసక్తే లేదని తేల్చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, తదనంతర పరిస్థితుల వల్ల ఆదాయం పడిపోయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మారటోరియంతో ఎంతో ఉపశమనం కలిగించామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి చక్రవడ్డీ(వడ్డీపై వడ్డీ)ని మాఫీ చేశామని, ఇంతకంటే ఎక్కువ ఊరట కలిగించలేమని పేర్కొంది. ఒకవేళ అలా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉందని, బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్నవారికి ఆరు నెలల మారటోరియం కాలానికి ఈ వెసులుబాటు లభిస్తుందని వెల్లడించింది. మారటోరియం గడువును ఆరు నెలల కంటే పొడిగించడం కుదరదని తెలిపింది. రుణాల చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ జైన్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. రుణ గ్రహీతలకు చక్రవడ్డీని మాఫీ చేయడం కాకుండా ఇంకా ఇతర ఏ ఉపశమనాలూ కలిగించలేమని కేంద్రం తెలిపింది. ఆరు నెలల మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేస్తామని, అంతకంటే ఇంకేం చేయలేమని కేంద్రం ప్రకటించడం తెల్సిందే. ఈ అంశంపై కేంద్రం తన వాదనను వినిపిస్తూ అక్టోబర్ 5న న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలతో మరో అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పంకజ్ జైన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. మారటోరియం గడువును పొడిగిస్తే రుణగ్రహీతలపై మరింత భారం పడుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అక్టోబర్ 13న తదుపరి విచారణ జరపనుంది. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్చి 1 నుంచి మే 31వ తేదీ వరకు మారటోరియం విధించింది. రుణాలు, వడ్డీలపై ఇన్స్టాల్మెంట్ల చెల్లింపులను వాయిదా వేసుకోవచ్చని సూచిస్తూ ఆర్బీఐ మార్చి 27న తెలిపింది. తర్వాత కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మారటోరియం గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. కేంద్ర సర్కారు నిర్ణయం వల్ల తమపై భారం తగ్గదని, వడ్డీపై వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటూ పలువురు రుణగ్రహీతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ.2 కోట్ల లోపు రుణాలు తీసుకున్న వారికి ఆరు నెలల మారటోరియం కాలానికి చక్రవడ్డీని మాఫీ చేస్తామని కేంద్రం సమాధానమిచ్చింది. -
రుణపడి ఉంటాం.. థాంక్యూ జగనన్న
సాక్షి, విజయవాడ: కువైట్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను ప్రభుత్వం వెనక్కి రప్పించిందని ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక విమానం కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. గత నెలలుగా కువైట్‌లో ఉపాధి లేక ఏపీ వలస కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కువైట్‌లో చిక్కుకున్న బాధితుల్ని వెనక్కి తీసుకురావాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారని తెలిపారు. (రాజకీయ కార్యక్రమాలొద్దు: సజ్జల) సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.. అమ్నెస్టీ సాయంతో 152 మంది బాధితులు ఏపీకి చేరుకున్నారని వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అనంతరం 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తామని వెంకట్ పేర్కొన్నారు. చొరవ తీసుకుని ఏపీకి రప్పించిన సీఎం వైస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. (విపత్తు సమయంలోనూ సంక్షేమం: సుచరిత) సీఎం వైఎస్ జగన్ కృషి ఫలితంగా.. గురువారం ప్రత్యేక విమానంలో కువైట్‌లోని 145 మంది వలస కార్మికులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే.. వారిలో 126 మంది మహిళలు, 18 మంది పురుషులు, ఓ బాలుడు ఉన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని నూజివీడు త్రిబుల్ ఐటీలో ఉన్న ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా వలస కార్మికులు దశల వారీగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్నారు. -
టేకాఫ్
వలసల కష్టాలు కథలుగా వినే ఉన్నాం.. వాటిని ‘కరోనా’ ఇప్పుడు నిజాలుగా చూపిస్తోంది.. పరాయి రాష్ట్రాల నుంచి కూలీనాలీ కోసం మన దగ్గరకు వచ్చినవాళ్ల కన్నీళ్లనే కాదు.. పని వెదుక్కుంటూ పరాయి దేశం పోయిన మన వాళ్ల వ్యథలనూ! కువైట్‌లోని మన మహిళా డొమెస్టిక్ హెల్పర్స్ (ఇళ్లలో పని చేసే వాళ్లు) పడుతున్న ఇబ్బందుల గురించిన కథనం ఇది.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆమ్నెస్టీ ప్రకటించింది కువైట్. వీసా గడువు అయిపోయాక కూడా ఆ దేశంలో ఉంటున్న వారికి, జరిమానా శిక్షలు పడ్డవారికి క్షమాభిక్ష పెట్టి వాళ్ల వాళ్ల దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ అవకాశం అక్కడున్న మన మహిళా డొమెస్టిక్ హెల్పర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ముఖ్యంగా అరబ్బీ మాట్లాడలేక, నిరవధికంగా పన్నెండు గంటలు, ఒక్కోసారి 20 గంటలు పనిచేయలేక, తిండి, నిద్రలేక అనారోగ్యం పాలై.. యజమానుల చేతుల్లో హింసకు గురవుతున్న వారికి ఈ ఆమ్నెస్టీ ఓ వరంలా కనిపించింది. దాంతో యజమానుల కళ్లు గప్పి, రెండంతస్తుల మేడ మీద నుంచి చీర సహాయంతో కిందకు దూకి .. ఇలా రకరకాల ప్రయత్నాలతో బయటపడ్డారు. కొందరైతే ఆమ్నెస్టీ పెట్టకముందే బయటకు వచ్చేశారు... పాస్‌పార్టుల సంగతి అటుంచి చేతిలో చిల్లిగవ్వ, కాళ్లకు చెప్పుల్లేక కట్టుబట్టలతో. ఎటు వెళ్లాలి? ఎవరిని కలవాలి? ఎక్కుడుండాలి? ఏమీ తెలియదు. స్నానం లేదు, తిండి లేదు. పైగా కరోనా లాక్డౌన్. బయట కనిపిస్తే జరిమానా, జైలు. వీటన్నిటి నుంచీ తప్పించుకుంటూ తిరుగుతుండగా అక్కడ వలస కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తెలుగు స్వచ్ఛందసేవా కార్యకర్తల సాయంతో షెల్టర్ హోమ్‌కి చేరారు. వాళ్లలో కొంతమంది నేపథ్యాలు.. కూలోనాలో చేసుకుంటా... అంటోంది ఈడిపల్లి లక్ష్మి. ఆమె స్వస్థలం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం మండలంలోని రామారావుపేట. కువైట్‌కు వెళ్లి మూడేళ్ల అవుతోంది. ‘నా తాగుబోతు భర్తతో పడలేక విడాకులు తీసుకున్నా. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల చదువు, పెళ్లిళ్లకు అప్పు చేయాల్సి వచ్చింది. ఇల్లు, పొలం లేవు. అప్పలు తీరాలి, పూట గడవాలి. అందుకే కువైట్‌కు వచ్చా. ఇక్కడి భాష రాక బాధలు పడ్డా. ఇంక నావల్ల కాక ఓరోజు షేక్ ఇంట్లోంచి పారిపోయా. తిండిలేక కడుపు మాడ్చుకుంటాను కాని అద్దె కట్టకపోతే గదిలో ఉండనివ్వరు కదా! నయా పైసా లేక నానా తిప్పలు. చివరికిలా క్యాంపులోకొచ్చి పడ్డా. మా సొంతూరెళ్లిపోయి కూలోనాలో చేస్కోని బతుకుతాను’’ అంటూ చేతులు జోడిస్తోంది లక్ష్మి. ఇంట్లోంచి గెంటేశారు.. అని జరిగింది తలుచుకుంటూ ఏడుస్తోంది కోన కృష్ణవేణి. ఆమె స్వస్థలమూ తూర్పు గోదావరి జిల్లానే. యేడాది కిందట భర్త చనిపోయాడు. అమ్మానాన్నా, అత్తమామల అండ లేదు. జీవనాధారమూ లేదు. దాంతో పొరుగుదేశంలో పనిమనిషిగానైనా నాలుగు డబ్బులు వెనకేసుకుందామని కువైట్ చేరింది. ఇంతలో కరోనా వల్ల కష్టమొచ్చిపడింది. ‘‘పనివాళ్ల వల్ల కరోనా వస్తుందని భయపడ్డారో ఏమో ఉన్నట్టుండి ఓ రోజు ఇంట్లోంచి బయటకు గెంటేశారు నన్ను. ఎక్కడికెళ్లాలో తెలియదు. భాష రాదు. తిండి, నీళ్లు లేక తిరుగుతుంటే తెలుగు వాళ్లే చూసి క్యాంప్‌కు తీసుకొచ్చారు’ అంటూ ఏడుస్తోంది కృష్ణవేణి. అకామా బ్లాక్ అయిందని.. భయపెడ్తున్నారు అని బాధపడుతోంది పశ్చిమగోదావరి జిల్లా, నిడుదవోలు మండలం, ఆట్లపాడుకు చెందిన సత్యభారతి. 2019, నవంబరులో కువైట్‌కు వచ్చింది భారతి. అయితే గల్ఫ్ ఆమెకు కొత్త కాదు. ఇదివరకు ఖతర్, దుబాయ్, బహరెయిన్లలో డొమెస్టిక్ హెల్పర్‌గా పనిచేసింది. కాని ఇప్పుడు కువైట్‌లో ఎదురైన సమస్యే భయపెడుతోంది ఆమెను. ‘ఖతర్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం పాడైంది. ఇండియాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈలోపు మా నాన్న చనిపోవడం, నా భర్తతో గొడవలు.. మానసికంగానూ దెబ్బతిన్నా. కూర్చుంటే రోజు గడిచే దారి లేదు. అందుకే మళ్లీ గల్ఫ్‌కు ట్రై చేసుకొని కువైట్కొచ్చా. నాలుగు నెలలుగా జీతం ఆపేశారు. నా పరిస్థితి గురించి మా చుట్టాలకు ఫోన్ చేద్దామన్నా డబ్బుల్లేవు. కొంచెం టెన్షన్ పడ్డా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. ఇండియా వెళ్లిపోతాను సహాయం చేయండని తెలిసిన వాళ్లను అడిగితే నీ అకామా (రెసిడెంట్ స్టాంప్)బ్లాక్‌లో ఉంది, రెండు లక్షల రూపాయలవుతాయి అని చెప్పారు. బ్లాక్‌లో ఎందుకు ఉంటుందని భయపడి ఏజెంట్‌కు ఫోన్ చేస్తుంటే అతణ్ణించి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆమ్నెస్టీ నాకోసమే వచ్చినట్టయింది’ చెప్పుకొచ్చింది సత్యభారతి. వీళ్లంతా కువైట్ నుంచి టేకాఫ్ అయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లందరికీ అక్కడున్న మన రాయబార కార్యాలయం ద్వారా వైట్‌పాస్ (లేదా అవుట్పాస్ అంటే ఆపద్ధర్మ పాస్‌పార్ట్)లు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛందసేవా కార్యకర్తలు. -
మలేషియాలో క్షమాభిక్ష
పర్యాటకుల స్వర్గధామమైన మలేషియాలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష(ఆమ్నెస్టీ)ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులు జరిమానా, శిక్ష లేకుండా వారి దేశాలకు వెళ్లిపోవడానికి క్షమాభిక్ష అమలు చేస్తుంటాయి. ఇదే విధానాన్ని మలేషియా దేశం అమలు చేస్తోంది. ఈనెల ఒకటో తేదిన క్షమాభిక్ష అమలులోకి వచ్చింది. డిసెంబర్ 31 వరకు ఇది అమలులో ఉంటుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన ఎంతో మంది ఆ దేశంలో అక్రమంగా ఉంటున్నారని అంచనా. గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, గతంలో మాదిరిగా జీతాలు లేకపోవడంతో అనేక మంది మలేషియా బాట పట్టారు. ఎక్కువ మంది వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఏజెంట్లు మాత్రం విజిట్ వీసాలతో మలేషియాకు పంపించారు. వారికి సరైన అవగాహన లేక అవస్థలు పడుతున్నారు. మలేషియా ప్రభు త్వం అమలు చేస్తున్న క్షమాభిక్షను వినియోగించుకుని వారంతా స్వగ్రామాలకు చేరుకునే అవకాశం ఉంది. -
దుబాయ్ యువరాణి ఏమైంది ?
పేరుకే రాజు కుమార్తె. కానీ అడుగడుగునా ఆంక్షలు, బయట ప్రపంచం ఏమిటో తెలీదు. స్వేచ్ఛ అన్న మాటకి అర్థం తెలీదు. అండగా ఉండాల్సిన కన్నతండ్రే వేధిస్తూ ఉంటే, తనకున్న అధికార దర్పంతో గాలి వెలుతురు లేని చీకటి గదిలో మూడేళ్ల పాటు బం«ధించి చిత్రహింసలు పెడితే ఏం చేయాలి ? ఎవరికి చెప్పుకోవాలి ? ఆ ఆంక్షల చట్రాలను ఛేదించుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని, అమెరికాలో ఆశ్రయం పొందాలని అనుకున్న ఆ యువరాణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమె ఇప్పుడేమైందో, ఎక్కడుందో ఎవరికీ తెలీడం లేదు. ఇది దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ కుమార్తె షికా లతీఫా దీనగాథ. షికా లతీఫా కనిపించకుండా పోవడం వెనుక భారత్ ప్రమేయం ఉందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ తీరప్రాంత రక్షణ దళం మానవ హక్కుల్ని తీవ్రంగా ఉల్లంఘించి ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి దుబాయ్‌కి పంపించారంటూ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత్ ప్రమేయం ఎంత ? ఆమ్నెస్టీ హక్కుల సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం తండ్రి నుంచి గత కొన్నేళ్లుగా తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్న షికా లతీఫా ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు.. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన తన ప్రాణస్నేహితురాలు తినా జౌహానియన్, ఫ్రాన్స్‌కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ , మరోముగ్గురు సిబ్బందితో కలిసి ఒక మరపడవలో గత ఫిబ్రవరిలో దుబాయ్ అధికారుల కళ్లుగప్పి పారిపోయారు. వారు ప్రయాణిస్తున్న పడవ మార్చి 14న భారత్‌లోని గోవా జలాల్లో ప్రవేశించింది. అప్పడు గోవాలోని భారత్ తీర ప్రాంత రక్షక దళం బలవంతంగా ఆ పడవలోకి ఎక్కి తుపాకులు చూపించి అందరినీ బెదిరించారు. కెప్టెన్ జౌబెర్ట్ని రక్తం కారేలా కొట్టడంతో అతను స్పృహ తప్పిపోయాడు. ఇతర సిబ్బందిని కూడా బాగా కొట్టారు. పడవని ధ్వంసం చేశారు. యువరాణి షికా లతీఫా తాను ఆశ్రయం కోరి వచ్చానని అరుస్తున్నా వినిపించుకోకుండా ఆమెని బంధించి, అప్పుడే హెలికాప్టర్లో వచ్చిన యూఏఈ అధికారులకు వాళ్లందరినీ అప్పగించారట. మార్చి 20న జౌబెర్ట్, మిగిలినవారిని దుబాయ్ అధికారులు విడిచిపెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే యువరాణి స్నేహితురాల్ని కూడా విడిచిపెట్టడంతో ఆమె ఫిన్లాండ్కు వెళ్లిపోయింది. భారత్ తీర ప్రాంత రక్షణ దళం దయా దాక్షిణ్యాలు లేకుండా తాము ప్రతిఘటించకపోయినా తీవ్రంగా కొట్టి దుబాయ్ అధికారులకు అప్పగించారని వాళ్లంతా ఆరోపించారు. దుబాయ్‌లో ఎలాంటి న్యాయవిచారణ లేకుండానే గుర్తు తెలియని ప్రదేశంలో ఒక జైలులో తమను బంధించి ఉంచారని వారు వెల్లడించారు. అప్పట్నుంచి యువరాణి షికా లతీఫా ఆచూకీ కనిపించడం లేదు. ఆమె క్షేమ సమాచారాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమ్నెస్టీ ఈ మొత్తం వ్యవహారంలో భారత్ తీర ప్రాంత రక్షక దళం వ్యవహార శైలిని తప్పు పడుతోంది. ఆశ్రయంకోరి వచ్చిన వారిని ఏకపక్షంగా బంధించి, శారీరకంగా హింసించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు షికా లతీఫా ఎక్కడుందో బయట పెట్టి, ఆమె స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకోవాలంటూ యూఏఈని డిమాండ్ చేసింది. లతీఫా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ షికా లతీఫా దేశం విడిచి పారిపోవడానికి ముందు ఇదంతా ఊహించిందో ఏమో ఒక వీడియోని రికార్డు చేసి పెట్టారు. తన తండ్రి వేధింపులు భరించలేక పారిపోతున్నానని ఆమె ఆ వీడియోలో చెప్పారు. ‘నాకు స్వేచ్ఛ లేదు. సంకెళ్ల మధ్య జీవితాన్ని గడుపుతున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా నా వెంట ఒకరు ఉంటారు. నా కదలికల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటారు. 2002లో కూడా ఒకసారి పారిపోవడానికి ప్రయత్నించా. సరిహద్దుల్లోనే నన్ను పట్టుకున్నారు. మూడేళ్ల పాటు నన్ను గాలి వెలుతురు కూడా రాని జైలులో పడేశారు. నా తండ్రికి కీర్తి ప్రతిష్టలంటే ఎనలేని మోజు. దాని కోసం దేనికైనా తెగిస్తాడు. మీరు ఈ వీడియో చూసే సమయానికి అయితే నేను చనిపోయి ఉంటాను. లేదంటే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాను. బహుశా ఇదే నా ఆఖరి వీడియో‘ అంటూ ఒక వీడియో రికార్డు చేశారు. ఆరు నెలల క్రితం లతీఫా కిడ్నాప్ అయిందన్న వార్తల నేపథ్యంలో ఈ వీడియోని బ్రిటన్‌లో ఒక మీడియా సంస్థ బయటపెట్టింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఆరుగురు భార్యలున్న దుబాయ్ రాజుకి 30 మంది సంతానంలో లతీఫా ఒకరు. -
ఖల్లివెల్లి కార్మికుడి నుంచి..కంపెనీ యజమానిగా..
సిద్దిపేట రూరల్ : బతుకుదెరువు కోసం దుబాయికి వెళ్లిన ఆ యువకుడికి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ఏజెంట్ విజిట్ వీసా అంటగట్టడంతో కొద్ది రోజులకే గడువు ముగిసింది. స్వదేశం రాలేక అక్కడే తలదాచుకున్నాడు. ఖల్లివెల్లిగా (అక్రమ నివాసి) మారి చిన్నచిన్న కంపెనీల్లో పనిచేశాడు. ఆ తర్వాత స్వశక్తితో కంపెనీ ఏర్పాటు చేసి ఎందరో వలస కార్మికులకు ఉపాధి చూపుతున్నాడు. అంతేకాకుండా ఖల్లివెల్లి కార్మికులకు అండగా నిలిచి సేవలు అందిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా తోర్నాల గ్రామానికి చెందిన గుండెల్లి నర్సింలు కుటుంబం అతని బాల్యంలో నిజామాబాద్‌కు వలస వెళ్లింది. నర్సింలు తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే వారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకున్న నర్సింలు కొన్ని రోజులు తాపీ మేస్త్రీగా పనిచేశాడు. ఒక రోజు అతని తండ్రి కట్టెకోత మిషన్‌లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మొద్దు అతని భుజంపై పడడంతో గాయపడ్డాడు. ఇదే సమయంలో నర్సింలు తల్లి కూడా అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో నర్సింలు గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రూ.70 వేలు అప్పుచేసి 2004 సంవత్సరంలో దుబాయికి వెళ్లాడు. అయితే, అతనిని దుబాయికి పంపిన ఏజెంట్ కంపెనీ వీసా ఇప్పిస్తానని మోసం చేశాడు. దుబాయికి వెళ్లిన తర్వాత నర్సింలు ఆ ఏజెంట్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో నర్సింలు సరైన గూడు లేక చెట్ల కింద, లారీల కింద, పాడుబడ్డ భవంతుల వద్ద తలదాచుకుని దొరికిన పని చేసుకుంటూ రోజులు గడిపాడు. సంవత్సరం తర్వాత ఒక కంపెనీలో నెలకు 700 దిర్హమ్స్ జీతానికి పనికి కుదిరాడు. అప్పడు భారత కరెన్సీలో నెలకు రూ.10 వేలు. ఇలా పనిచేసి సంపాదించి అప్పు తీర్చాడు. నర్సింలు నాలుగు సంవత్సరాలకు పైగా ఖల్లివెల్లిగా (అక్రమ నివాసిగా) పనిచేశాడు. సాయంత్రం వరకు కంపెనీలో పనిచేసి సాయంత్రం సమయంలో పార్కింగ్‌లో కార్లును కూడా కడిగేవాడు. ఈ క్రమంలో అక్కడ ఓ కారు ఓనర్ అయిన సీఐడీ విభాగంలో పనిచేసే అధికారితో నర్సింలుకు పరిచయం ఏర్పడింది. ఆ అధికారిని అక్కడి వారు అర్బాబ్ (అరబ్బీలో యజమాని, ప్రభువు అనే బిరుదు) అని పిలిచేవారు. ఆయన సహాయంతో నర్సింలు 2008లో దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. మళ్లీ దుబాయికి ప్రయాణం.. తోర్నాలకు చేరుకున్న నర్సింలు పెళ్లి చేసుకుని ఎనిమిది నెలలు సొంత ఊరిలోనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత.. దుబాయిలో పరిచయ మైన సీఐడీ అధికారి తన సొంత కారు డ్రైవర్‌గా పనిచేయడానికి వీసా పంపగా నర్సింలు తిరిగి మళ్లీ దుబాయికి వెళ్లాడు. అక్కడే కారు డ్రైవింగ్ నేర్చుకొని ఆయన సహాయంతో లైసెన్సు పొందాడు. ఆ అధికారి కారు నడుపు తూనే సొంతంగా కారును కొనుగోలు చేసి నడుపుకున్నాడు. దీంతో పాటు అక్కడే ఇంటర్నెట్ పెట్టాడు. అందులో మొబైల్ రీచార్జ్ కార్డులు కూడా విక్రయించాడు. 2013లో సొంతంగా కంపెనీ ఏర్పాటు.. అందరితో పరిచయాలు పెంచుకున్న నర్సింలు అక్కడి వారి భాగస్వామ్యంతో 2013 సంవత్సరంలో ‘ఎస్‌ఆర్‌జి టెక్నికల్ సర్వీసెస్ అండ్ బిల్డింగ్ క్లీనింగ్ ఎల్ఎల్సీ’ అనే కంపెనీని స్థాపించాడు. పెద్ద ఎత్తున కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. తన కంపెనీ నుంచి మంచి వేతనం, వసతులు కల్పిస్తున్నాడు. దీనితో పాటు ఆయనకు మరో కంపెనీలో భాగస్వామ్యం లభించింది. ఇమ్మిగ్రేషన్‌కు ఉచితంగా బస్సు సౌకర్యం యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్షమాభిక్షను ఖల్లివెల్లి కార్మికులు ఉపయోగించుకునేందుకు నర్సింలు సహాయపడుతున్నాడు. ఇమ్మిగ్రేషన్ పనుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాడు. ఖల్లివెల్లిలకు ఈ ఖర్చు లేకుండా నర్సింలు ఉచితంగా టాక్సీలు, మినీ బస్సుల సౌకర్యం కల్పిస్తున్నాడు. అదేవిధంగా సుమారు 100 మందికి పైగా భారత వలస కూలీలకు ఔట్ పాస్‌లు రావడంతో ఈ నెల 22 నుంచి వారిని స్వదేశానికి పంపిస్తున్నానని చెప్పాడు. సహాయం కావాల్సిన వారు తన సెల్ నంబర్ +97155 9346999 కు ఫోన్ చేయవచ్చని, తక్షణ సహాయం చేస్తామని నర్సింలు చెబుతున్నాడు. ఆమ్నెస్టీకి తెలంగాణ ప్రభుత్వ హెల్ప్‌లైన్ యూఏఈ దేశం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఆమ్నెస్టీ కాలంలో ఎవరికైనా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయం కావాలంటే హెల్ప్‌లైన్ నెంబర్ +9194408 54433 లేదా ఇ–మెయిల్ so_nri@telangana.gov.in ను సంప్రదించాలని కోరారు. తిరిగి వచ్చే వారి కోసం ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ యూఏఈ రాయబార కార్యాలయం నుంచి తెలంగాణ ప్రవాసీయుల సమాచారాన్ని సేకరిస్తున్నదని మంత్రి తెలిపారు. దుబాయి ఇండియన్ కాన్సులేటులోని హెల్ప్ డెస్క్ నంబర్ +97156 5463903 లేదా Indiaindubai.amnesty@gmail.com ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఏడు రాజ్యాలలో వేర్వేరు నిబంధనలు యూఏఈలోని ఏడు రాజ్యాలలో (ఎమిరేట్స్) వేర్వేరు నిబంధనలు ఉండటం వలన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ఉపయోగించుకునేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుబాయిలో నిబంధనలు కొంతవరకు ఈజీగా ఉన్నాయి. కేటీఆర్ దుబాయికి రావాలి, ఖల్లివెల్లీలను ఆదుకోవాలి. వాపస్ వచ్చినవారికి తెలంగాణ ప్రభుత్వం డబుడ్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి. ఉపాధి కల్పించాలి. – దొనకంటి శ్రీనివాస్, అబుదాబి రూ.50 కోట్లు కేటాయించాలి యూఏఈ క్షమాభిక్ష పథకంలో వలస కార్మి కులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలి. తెలంగాణ ప్రభుత్వం అధికారుల బృందాన్ని యూఏఈకి పంపి ప్రవాసుల సమస్యలను అధ్యయనం చేయాలి. ఆమ్నెస్టీ పొందేవారిని ఆదుకోవాలి. భారత రాయబార కార్యాలయాల్లో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలి. ప్రస్తుతం దుబాయి లోని లేబర్ క్యాంపుల్లో కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాను. – ఎన్. దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు యూఏఈ ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటించడం హర్షించదగిన విషయం. క్షమాభిక్షకు అర్హులైన వారు ఇండియన్ ఎంబసీ నుంచి సహాయం పొందవచ్చు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకు సహాయం చేస్తామని ప్రకటించడం మంచి పరిణామం. అలాగే ఏవైనా సమస్యలుంటే యూఏఈలోని తెలంగాణ జాగృతి వలంటీర్లు అవసరమైన సహాయం చేస్తారు. – నవీన్ ఆచారి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి విమాన టికెట్లకు దాతల సాయం ఆమ్నెస్టీ పథకంలో దుబాయి నుంచి స్వస్థలాలకు వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికులకు కొందరు దాతలు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు సమకూర్చారు. అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసి యశ్ బొద్దులూరి రెండు టికెట్లు, ఆయన సోదరులు మరో మూడు టికెట్లు ఉచితంగా ఇచ్చారు. మరికొందరు దాతల సహకారంతో కయిలోతు రాజం, కెలోప్త్ మోహన్ (ఎల్లారెడ్డిపేట), భూక్యా గోవర్దన్, మలావత్ మహిపాల్ (సిరికొండ), అంబుగోత్ రతన్ (మాచారెడ్డి), మంగళపల్లి భారత్ కుమార్ (దోమకొండ), సబావత్ మోహన్ (పాకాల, సిరికొండ), భూక్యా అశోక్ (తూముపల్లె, సిరికొండ), బానోత్ జగన్ (మహ్మదాబాద్, మెదక్), బక్కోల్ల లక్ష్మినారాయణగౌడ్, సంపంగి శ్రీకాంత్, రంగబోయిన నవీన్‌లకు ఉచిత టికెట్లు పంపిణీ చేశారు. డాక్టర్ గోపాలకృష్ణ రూ.2లక్షలు, డాక్టర్ పవిత్ర మరికొన్ని టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్‌కు యూఏఈ ప్రభుత్వ ఆహ్వానం తెలంగాణ ఎన్నారై మంత్రి కె.టి.రామారావును తమ దేశంలో పర్యటించాలని ఆహ్వానిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈనెల 5న ఒక లేఖ రాశారు. విద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో యూఏఈతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి రావాలని కోరారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా తనకు లభించిన ఆతిథ్యానికి షేక్ అబ్దుల్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ తన పర్యటన సందర్భంగా యూఏఈలోని తెలంగాణ ప్రవాస కార్మికుల సమస్యలతో పాటు, ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకునేవారికి సహాయం చేస్తారని అక్కడి తెలంగాణ వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఆమ్నెస్టీకి నమోదు చేసుకోండిలా..
దుబాయ్ : యూఏఈ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకోదలచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్నార్టీ) వారి వెబ్ సైటు www.apnrt.com/uae లో నమోదు చేసుకోవాలని ఏపీ ఎన్నార్టీ దుబాయ్ కోఆర్డినేటర్ వాసు పొడిపిరెడ్డి కోరారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం పొందడం సులువు అవుతుందని ఆయన అన్నారు. క్షమాభిక్ష పథకంలో సహాయం పొందగోరు వారు యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రాసల్ ఖైమా తదితర ప్రాంతాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు. వారి వివరాలు : 1. వాసు పొడిపిరెడ్డి (దుబాయ్) +97152 6653567 2. జివివి సత్యనారాయణ (రాసల్ ఖైమా) + 97156 4270960 3. జెకెఎం షరీఫ్ షేక్ (అబుదాబి) +97152 2127786 4. రాజేష్ కుమార్ కొండెపు (దుబాయ్) +97158 2181785 5. అనురాధ వొబ్బిలిసెట్టి (దుబాయ్) +97150 4293402 6. జాఫర్ అలీ (దుబాయ్) +97150 5640923 7. ఖాదర్ బాషా షేక్ (దుబాయ్) +97150 4227865 8. మోత్కూరి విశ్వేశ్వర్ రావు (దుబాయ్) +97150 1815383 9. ముక్కు తులసి కుమార్ (దుబాయ్) +97158 2435489 10. రాజా రవికిరణ్ కోడి (దుబాయ్) +97150 7778599 11. శివ సుందర్ పట్నం (దుబాయ్) +97156 2275840 12. శ్రీకాంత్ చిత్తర్వు (దుబాయ్) +97155 6939320 13. సుధాకర్ సింగిరి (దుబాయ్) +97152 3825328 14. వంశీ కృష్ణ కొల్లి (దుబాయ్) + 97156 2622562 15. వేణు గుంటుపల్లి (దుబాయ్) +97156 5771796 16. నిరంజన్ కంచర్ల (దుబాయ్) +97150 9577411, 17. గుడాల భాగ్యనందం (షార్జా) +97150 3959677 మరిన్ని వివరాలకై ఏపీ ఎన్నార్టీ వారి ఇండియా హెల్ప్ లైన్ +91 86323 40678 లేదా వాట్సప్ +91 85000 27678 ను సంప్రదించవచ్చని ప్రవాసీ మిత్ర అధ్యక్షులు మందభీంరెడ్డి తెలిపారు. -
యూఏఈ క్షమాభిక్ష: సందేహాలు - సమాధానాలు
అక్రమ వలసదారులు ఎలాంటి జరిమానా, జైలుశిక్షలేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోవడానికి వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం 1 ఆగష్టు నుండి 31 అక్టోబర్ వరకు మూడు నెలలపాటు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. క్షమాభిక్ష ఉపయోగించుకోవాలనుకునే ప్రవాసీలకు ఉపయోగపడే విధంగా గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న: యూఏఈ క్షమాభిక్ష-2018 పథకాన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి జవాబు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని ఏడు రాజ్యాలయిన అబుదాబి, దుబాయి, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఉమ్మల్ కోయిన్, ఫుజీరా లలో గల ఇమ్మిగ్రేషన్ (వలస) కేంద్రాలలో సంప్రదించాలి. ఏ ఎమిరేట్ (రాజ్యం) వీసా ఉన్నవారు అక్కడి ఇమ్మిగ్రేషన్ కేంద్రాలకు మాత్రమే వెళ్ళాలి. ప్రశ్న: జరిమానా పూర్తిగా మాఫీ చేస్తారా? నామమాత్రంగా చెల్లించాలా? జవాబు: గడువుమీరి ఎక్కువరోజులు ఉన్నoదుకు జరిమానా పడదు. కానీ, యూఏఈ ప్రభుత్వం కొంత ఫీజు వసూలు చేస్తుంది. ప్రశ్న: దేశంనుంచి బయిటకు వెళ్ళడానికి ఇచ్చే 'ఎగ్జిట్ పర్మిట్' పొందాలంటే ఎంత డబ్బు చెల్లించాలి ? జవాబు: 221 దిర్హములు (రూ.4 వేలు), వీసా రెగ్యులరైజ్ (క్రమబద్దీకరణ) చేసుకోవడానికి 521 దిర్హములు(రూ.9,400) చెల్లించాలి. ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందడానికి ఏ డాక్యుమెంట్లు (దస్తావేజులు) సమర్పించాలి జవాబు: ఒరిజినల్ పాస్ పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (అవుట్ పాస్ అనబడే తెల్లరంగు తాత్కాలిక పాస్ పోర్టు), విమాన ప్రయాణ టికెట్టు దాఖలు చేయాలి. ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందిన తర్వాత ఎన్నిరోజులలోగా దేశం వదిలి పోవాలి జవాబు: 21 రోజులలోగా ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందడానికి ఎన్నిరోజులు అవుతుంది జవాబు: బయోమెట్రిక్ స్కానింగ్ అయిన వెంటనే ఇస్తారు ప్రశ్న: పాస్ పోర్ట్ పోగొట్టుకున్నసందర్భాలలో పోలీస్ క్లియరెన్స్ రిపోర్ట్ అవసరమా జవాబు: అవును. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఒకలెటర్ పొంది, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయానికి వెళితే వారు వీసా స్టేటస్ (స్థితి) ని తెలుపుతూ ఒక ప్రింట్ అవుట్ ఇస్తారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్, కోర్టుల నుండి స్టాంప్ వేయించుకోవాలి. చివరగా పోలీస్ స్టేషన్ లో "లాస్ట్ పాస్ పోర్ట్" (పాస్ పోర్ట్ పోయినది) అనే సర్టిఫికెట్ అరబిక్ భాషలో ఇస్తారు. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించుకొని ఇండియన్ ఎంబసీలో దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ ఎంబసీ వారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (అవుట్ పాస్ అనబడే తెల్లరంగు తాత్కాలిక పాస్ పోర్టు) ఇవ్వాలన్నా, యూఏఈ ప్రభుత్వం 'ఎగ్జిట్ పర్మిట్' ఇవ్వాలన్నా పోలీస్ క్లియరెన్స్ రిపోర్ట్ అవసరం. క్షమాభిక్ష సందర్బంగా ఈ ప్రక్రియను కొంత సరళతరం చేశారు. ప్రశ్న: యూఏఈ దేశంలోకి మళ్ళీ ప్రవేశించకుండా నిషేధం (నో ఎంట్రీ బ్యాన్) ఎన్నేళ్లు ఉంటుంది? ఈ బ్యాన్ కు ఎవరు గురవుతారు? జవాబు: సరైన పత్రాలు లేకుండా యూఏఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశిచిన వారికి రెండేళ్ల బ్యాన్ విధిస్తారు. అత్యవసర పరిస్థితులలో దేశంవిడిచి వెళ్లేవారికి ఈ బ్యాన్ వర్తించదు. ప్రశ్న: కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నవారు 'క్షమాభిక్ష' పథకాన్ని ఉపయోగించుకోవచ్చా? జవాబు: లేదు. న్యాయస్థానం నుండి అనుమతి పొందిన తర్వాతనే 'క్షమాభిక్ష' పథకానికి అర్హులు. నిర్ణీత కాలానికంటే మించి ఉన్నవారి (ఓవర్ స్టేయర్స్) సమస్యలను మాత్రమే ఇమ్మిగ్రేషన్ వారు పరిగణలోకి తీసుకుంటారు. ప్రశ్న: యజమాని నుండి పరారీ (అబ్ స్కాండింగ్) అయినట్లు ఫిర్యాదు నమోదుకాబడ్డవారు అమ్నెస్టీ కోసం దరఖాస్తు చేయవచ్చా? జవాబు: కేసు వాస్తవాలను బట్టి, ఇమ్మిగ్రేషన్ అధికారులు 'అబ్ స్కాండింగ్' (పరారీ) రిపోర్ట్ ను తొలగించి, ఎలాంటి బ్యాన్ (నిషేధం) లేకుండా ఎగ్జిట్ పర్మిట్ (వెళ్లిపోవడానికి అనుమతి) జారీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్థలు 'అబ్ స్కాండింగ్' ఫిర్యాదు దాఖలు చేసినట్లయితే 71 దిర్హములు, వ్యక్తులయితే 121 దిర్హములు, కంపెనీ అయితే 521 దిర్హముల ఫీజు చెల్లించాలి. ప్రశ్న: 'అబ్ స్కాండింగ్' (పరారీ) గా నమోదుకాబడ్డవారు దాని తొలగింపు (క్లియరింగ్)కు ఎవరిని సంప్రదించాలి? జవాబు: ఏ ఎమిరేట్ (రాజ్యం)లో వీసా పొందారో అక్కడే ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో సంప్రదించాలి. ప్రశ్న: స్పాన్సర్ (యజమాని) జాడలేని సందర్భాలలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లేముందు ఏం చేయాలి? జవాబు: 'లేబర్ కార్డు'ను రద్దు చేసుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళాలి. ప్రశ్న: ఉద్యోగి పాస్ పోర్ట్ ను స్పాన్సర్ (యజమాని) ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో జమచేసిన సందర్భాలలో పాస్ పోర్ట్ ను పొందడం ఎలా? జవాబు: ఇలాంటి కేసులలో, కంప్యూటర్ డేటాబేస్ లో వెతికిన తర్వాత ఆ ఉద్యోగిని సంబందిత ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళమని సూచిస్తారు. అక్కడ పాస్ పోర్టు ఇవ్వబడుతుంది. మరింత సమాచారం కోసం 'ప్రవాసి మిత్ర' హెల్ప్ లైన్ వాట్సప్ నెంబర్ +91 98494 22622 లేదా mbreddy.hyd@gmail.com కు సంప్రదించవచ్చు. -
మలేషియాలో క్షమాభిక్ష
మోర్తాడ్(బాల్కొండ) : పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధిగాంచిన మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీ కార్మికులు సొంత గడ్డకు వెళ్లిపోవడానికి అక్కడి ప్రభుత్వం ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)ను అమలు చేస్తోంది. పది నెలల క్రితం ఆమ్నెస్టీని అమలులోకి తీసుకురాగా ఈనెలాఖరుతో ముగిసిపోనుంది. మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ గత మే 31తోనే ముగిసింది. అయితే మలేషియా ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడగించడంతో ఈనెలాఖరు వరకు క్షమాభిక్ష కొనసాగనుంది. పర్యాటకుల పాలిట స్వర్గధామమైన మలేషియాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు ఏజెంట్లు తెలంగాణ జిల్లాలకు చెందిన నిరుద్యోగులను తరలిస్తున్నారు. మలేషియాలో వర్క్ వీసాలకు బదులు విజిట్ వీసాలనే ఏజెంట్లు చేతిలో పెట్టి పంపిస్తున్నారు. మలేషియాలో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుండటంతో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు భయంతో దాక్కునాల్సి వస్తోంది. విజిట్ వీసాలపై మలేషియాలో అడుగు పెట్టిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, సూపర్మార్కెట్లు, ఇతర వాణిజ్య సంస్థలలో పని కల్పించడం లేదు. దీంతో వారు పామోలిన్ తోటలలోనే రహస్యంగా పని చేయాల్సి వస్తోంది. పామోలిన్ తోటలలో పని చేసే వారికి పాములు, తేళ్ల బెడద తీవ్రంగా ఉంటుంది. మలేషియాలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికుల సంఖ్య దాదాపు రెండువేల వరకు ఉంటుందని భారత హైకమిషన్ అధికారులు అంచనా వేసి వెల్లడించారు. క్షమాభిక్షను వినియోగించుకుని సొంత గడ్డకు వచ్చేవారు రూ.8 వేల జరిమానా చెల్లించి, సొంతంగా టిక్కెట్‌ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. క్షమాభిక్ష అమలు లేని సమయంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న వారు ఇంటికి రావాలంటే భారీ మొత్తంలో జరిమానా చెల్లించడమే కాకుండా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అందువల్ల క్షమాభిక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛంద సంఘాల నాయకులు కోరుతున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం.. మలేషియాలో ఆమ్నెస్టీ అమలు నేపథ్యంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం మలేషియాలో పర్యటిస్తుంది. టీపీసీసీ గల్ఫ్ కో ఆర్డినేటర్ నంగి దేవెందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సభ్యులు మూడు రోజుల నుంచి మలేషి యాలో తెలంగాణ కార్మికులు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంగి దేవెందర్‌రెడ్డి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. మలేషియాలో క్షమాభిక్ష అమలు విషయంపై ఎవరికీ అవగాహన లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కార్మికుల పట్ల చిత్త శుద్ది లేదని ఆరోపించారు. మలేషియాలో ప్రధానంగా నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువ మంది ఉన్నారని వీరంతా విజిట్ వీసాలపై వచ్చి కష్టాలు పడుతున్నవారే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మి కులను సొంతూర్లకు రప్పించే చర్యలను చేపట్టా లని డిమాండ్ చేశారు. చేతిలో డబ్బు లేక జరిమానా చెల్లించి, టిక్కెట్ కొనుక్కొనే పరిస్థితి కార్మికులకు లేదని తెలిపారు. ప్రభుత్వమే టిక్కెట్లను ఇప్పించి జరిమానాకు సంబంధించిన సొమ్మును జమ చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్షమాభిక్షకు ఎక్కువ సమయం లేదని అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించి తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
యూఏఈలో క్షమాభిక్ష
మెరుగైన ఉపాధి కోసం వెళ్లి.. అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని ఇంటికి రాలేక మగ్గుతున్న అక్రమ వలసదారులకు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ప్రభుత్వం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31లోగా జైలు శిక్షలు లేకుండా వారి స్వదేశాలకు వెళ్లిపోవచ్చని వెల్లడించింది. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమైన వలస జీవులు ఆమ్నెస్టీపై ఆశలు పెట్టుకున్నారు. వారు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్.చంద్రశేఖర్, వూరడి మల్లికార్జున్ స్వగ్రామాల్లో ఉపాధి లేక.. వేలాది మంది యువకులు గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి వారిలో 90శాతం మంది కూలీలే. నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో ఆ దేశాల్లో కూలి పనిచేయాల్సిందే. వీసాలు, పాస్‌పోర్టుల కోసం అప్పులు చేసి మరీ గల్ఫ్‌కు వెళ్తున్నారు. విజిట్ వీసాలతో కొందరు మోసపోగా మరికొందరు ఒప్పందం ప్రకారం కంపెనీలు వేతనాలు ఇవ్వకపోవడంతో ఆ కంపెనీలను వదలి ఖల్లివెల్లి (అక్రమ నివాసులు)గా మారుతున్నారు. యూఏఈ పరిధిలోని దుబాయి, అబుదాబి, షార్జా, అజ్మాన్, పుజీరా, రాసల్ ఖైమా, ఉమ్మల్ క్వైన్ రాజ్యాలలో (ఎమిరేట్లలో) దాదాపు 3 లక్షల మంది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కొంత మంది కంపెనీలో చేరిన తర్వాత పనిలో ఇబ్బందులతో బయటకు వస్తున్నారు. మరికొంత మంది అనారోగ్యానికి గురై అక్కడే ఉంటున్నారు. కంపెనీ యజమానుల మోసం.. జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక ఖల్లివెల్లి అవుతున్నవారు అక్కడి అధికారుల, పోలీసుల కళ్లుగప్పి దొంగచాటుగా పనులు చేసుకుంటూ బతుకుతున్న వారూ ఉన్నారు. అనారోగ్యానికి గురైన వారు ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. వైద్యానికి డబ్బులు లేక, పనిచేసే సత్తువ లేక జీవచ్ఛవాల్లా బతికేవారికి ఆమ్నెస్టీ మంచి అవకాశం. యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికుల సంఖ్య 20వేల వరకు ఉంటుందని ప్రవాసీ కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఆ దేశంలో 2007లో ఒకసారి, 2013లో మరోసారి ఆమ్నెస్టీ అమలు చేశారు. ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం మళ్లీ ఆమ్నెస్టీ అమలు చేస్తోంది .పునరావాసం.. పునరేకీకరణ అవసరం ఆమ్నెస్టీ వల్ల ఇంటికి చేరుకునే కార్మికులకు పునరావాసం కల్పించడంతో పాటు, సమాజంలో కలిసిపోయే విధంగా పునరేకీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 2007లో యూఏఈ ప్రభు త్వం ఆమ్నెస్టీని అమలు చేయగా వేలాది మంది తెలుగు కార్మికులు స్వదేశానికి తిరిగివచ్చారు. ఎంతో మంది కార్మికులు గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పులు తీరక ముందే ఇంటికి చేరుకోవడంతో మానసికంగా కంగిపోయారు. సుమారు 150 మంది కార్మికులు యూఏఈ నుంచి ఇంటికి చేరుకున్న తరువాత మానసి కక్షోభతో అనారోగ్యానికి గురై మరణించారు. మరికొంత మంది కార్మికులు ఆత్మహత్మకు పాల్పడ్డారు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తుపై భరోసా లేకపోవడమేనని కార్మిక సం ఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూఏఈ నుంచి తిరిగివచ్చే కార్మికులకు స్థానికంగా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించాలి లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.రెండు విధానాల్లో ఆమ్నెస్టీ...యూఏఈలో ఆమ్నెస్టీ అమలు రెండు విధానాల్లో సాగనుంది. ఖల్లివెల్లి కార్మికులు స్వదేశానికి రాకుండా వీసాను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. ఇందుకు 500 దిర్హమ్స్ (ఇండియన్ కరెన్సీలో రూ.9వేలు) చెల్లించాల్సి ఉంది. అలాగే ఇంటికి వెళ్లిపోవడానికి దరఖాస్తు రుసుం కింద 250 దిర్హమ్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంది. గల్ఫ్‌లోని ఇతర దేశాల నుంచి యూఏఈకి సరిహద్దులు దాటి వచ్చిన కార్మికులైతే 500 దిర్హమ్స్ను ఫీజుగా చెల్లించాలి. అలాంటి కార్మికులు రెండేళ్ల పాటు యూఏఈ వీసాలు పొందడానికి అనర్హులు. రెండేళ్ల నిషేధం ముగిసిన తరువాత యూఏఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకోవాల్సిన వారు సొంతంగానే టిక్కెటు కొనుగోలు చేసుకోవాలి. లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహాయాన్ని అభ్యర్థించాల్సి ఉంటుంది. ఆమ్నెస్టీ వల్ల జైలు శిక్ష, జరిమానాల బారిన పడకుండా నామమాత్రం ఫీజుతో స్వదేశానికి రావడం లేదా వీసాల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమ్నెస్టీపై ఖల్లివెల్లి కార్మికులు, వారి కుటుంబాల వారికి అవగాహన కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అండగా నిలిచిన వైఎస్సార్ ప్రభుత్వంయూఏఈ, ఇతర గల్ఫ్ దేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న కార్మికులకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. 2007లో ఆమ్నెస్టీ వల్ల స్వదేశానికి వచ్చి మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడిన వారి కుటుంబాలకు వైఎస్ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం అందించింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఆత్మహత్యకు పాల్పడిన 29 మంది కార్మికుల కుటుంబాలకు వైఎస్ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇచ్చింది. అప్పట్లో నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ సానుకూలంగా స్పందించారు. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన కార్మికులు, గల్ఫ్‌లో సరైన ఉపాధి లేక ఇంటికి చేరిన కార్మికులకు వైఎస్ ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించింది. వైఎస్ కంటే ముందుగానీ ఆ తరువాతగానీ ఏ ముఖ్యమంత్రీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషిచేయలేదు. ఆమ్నెస్టీ మార్గదర్శకాలు ఇవీ.. కోర్టు కేసులుంటే ఆమ్నెస్టీకి (క్షమాభిక్షకు) అనర్హులే యజమానుల నుంచి పారిపోయి, బ్లాక్ లిస్టులో ఉన్నవారు 500 దిర్హమ్ల జరిమానా చెల్లించాలి. ఒమన్ సరిహద్దు నుంచి అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించిన వారు కేవలం స్వదేశానికి తిరిగి వెళ్లడానికి మాత్రమే అర్హులు. 9 సహాయ కేంద్రాలు గురువారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. దుబాయి వీసా ఉన్న వారు అల్ అవీర్‌లో, అబుదాబి వీసా ఉన్న వారు అల్ షహామాలో సంప్రదించాల్సి ఉంటుంది. మిగిలిన ఎమిరేట్లలోని వారు అక్కడి ప్రధాన ఎమ్మిగ్రేషన్ కార్యాలయాల్లో సంప్రదించాలి. గడువు ముగిసిన వారి పాస్‌పోర్టులను రెన్యూవల్ చేయడానికి, పాస్‌పోర్టు లేనివారికి ‘అవుట్ పాస్’ అని పిలుచుకునే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (భారత్‌కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగించే తెల్లరంగు పాస్‌పోర్టు) జారీచేయడానికి భారత దౌత్య కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న భారతీయుల సౌకర్యార్థం దుబాయిలోని భారత కాన్సులేటు, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్షపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. లేబర్ క్యాంపుల్లో పర్యటించి చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఆమ్నెస్టీని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నాం. ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులకు అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఏముల రమేష్, ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక, దుబాయి శాఖ అధ్యక్షుడు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి ఆమ్నెస్టీ అమలుపై ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. కార్మికులకు మేము ఉన్నామనే భరోసా కల్పించాలి. కార్మికుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు స్వదేశానికి చేరుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు ఆమ్నెస్టీపై సరైన అవగాహన లేదు. – సుందర ఉపాసన, తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్, కల్చరల్ అసోషియేషన్ ఎనిమిదేళ్లకు ఇంటికి వస్తున్నా నేను దుబాయికి వచ్చి ఎనిమిది ఏళ్లు అవుతుంది. ఆమ్నెస్టీలో ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు బయట పనిచేశాను. ఏదైనా పనిచేసుకుని ఇంటి వద్దనే ఉండాలే. గల్ఫ్ దేశాలకు రావడం చాలా ఇబ్బంది. క్షమాభిక్షతో ఇంటికి వస్తున్నా. – గంగాధర్, చందుర్తి, సిరిసిల్ల జిల్లా 2013లో హైకోర్టు ఆదేశంతో దుబాయికి ప్రతినిధి బృందం 2007, 2013లలో యూఏఈలో ప్రకటించిన ఆమ్నెస్టీ సందర్భంగా కేరళ వాసులకు అవసరమైన సహా యం అందించడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను యూఏఈకి పంపింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసీ కార్మికులను ఆదుకో వాలని మైగ్రంట్స్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు పి.నారాయణస్వామి, పాలమూరు మైగ్రంట్ లేబర్ యూనియన్ కార్యదర్శి ఎస్.అబ్రహంలు 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోనందున వారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రవాసీ కార్మికులకు సహాయం చేయాల్సిందింగా హైకోర్టు ఆదేశించినా నిర్లక్ష్యం చేయడంతో నారాయణస్వామి, అబ్రహంలు కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అప్పటి మంత్రి శ్రీధర్‌బాబుతో కూడిన ఒక అధికార బృందాన్ని దుబాయికి పంపించింది. ప్రస్తుత ఆమ్నెస్టీ సందర్భంగా యూఏఈలోని తెలంగాణ కార్మికులకు సహాయం చేయడానికి ఎన్నారై మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో ఒక అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపాలని గల్ఫ్ వలసదారుల సంఘాలు కోరుతున్నాయి. -
ఆమ్నెస్టీపై కార్మికులకు అవగాహన
మోర్తాడ్: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ(క్షమాభిక్ష)పై కార్మికులకు ప్రధానంగా తెలంగాణ జిల్లాల వారికి అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది. యూఏఈ పరిధిలోని వివిధ పట్టణాల్లోని కార్మికుల క్యాంపుల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఆమ్నెస్టీని సద్వినియోగం చేసుకుని స్వదేశానికి రావడం లేదా వీసా, వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకుని ఉపాధి పొందాలనే సూచనలతో ఎన్ఆర్ఐ సెల్ ప్రతినిధుల అవగాహన శిబిరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ కార్మికుల కోసం నిర్వహిస్తున్న అవగాహన శిబిరాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి ‘సాక్షి’తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన, ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ సలహా మేరకు తాను దుబాయ్‌లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. షార్జాలోని సోనాపూర్ శిబిరానికి దుబాయ్‌లోని తమ ప్రతినిధి ముత్యాల మారుతి ఆధ్వర్యంలో ఈరోజు వెళ్లి కార్మికులకు ఆమ్నెస్టీ విధి విధానాలపై అవగాహన కల్పించామన్నారు. దుబాయ్, అబుదాబి, షార్జా తదితర పట్టణాల్లో ఉంటున్న తెలంగాణ జిల్లాలకు చెందిన కల్లిబిల్లి కార్మికులు యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించినట్లు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు మేనిఫెస్టోలో పేర్కొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై కార్మికులకు వివరిస్తున్నామని వెల్లడించారు. యూఏఈలో ఐదేళ్ల విరామం తరువాత అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ఆగష్టు ఒకటో తేదీ నుంచి మూడు నెలల పాటు అమలు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆమ్నెస్టీపై ఇటీవలే యూఏఈ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ప్రొటెæక్ట్ యువర్ సెల్ఫ్ వయా రెక్టిఫై యువర్ స్టేటస్’ అనే కార్యక్రమం ద్వారా యూఏఈ ప్రభుత్వం చట్ట విరుద్దంగా ఉన్న విదేశీ కార్మికుల కోసం ఆమ్నెస్టీని ప్రకటించింది. ఈ ఆమ్నెస్టీతో ఎక్కువగా ప్రయోజనం పొందే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు ఉండటం విశేషం. -
గడువు పెరిగింది
కోరుట్ల : వలస జీవుల వెతలు గమనిం చిన కువైట్ ప్రభుత్వం ఎట్టకేలకు ఫిబ్రవరి 22తో ముగియనున్న ఆమ్నెస్టీ గ డువును ఏప్రిల్ 22 వరకు పొడిగించిం ది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచి వెళ్లి కువైట్‌లో కలివెల్లి అయి ఇబ్బందులు పడుతున్న వలస జీవులకు ఊరట లభించింది. మరో రెండు నెలల గడువు ఉండడంతో అడ్డగోలు గా విమాన ఛార్జీలు పెట్టుకుని స్వదేశానికి రావాల్సిన అవస్థలు తప్పాయి. అప్పులు తీరక.. ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, సిరి సిల్ల ప్రాంతాల నుంచి సుమారు 5వేల మంది, పెద్దపల్లి, కరీంనగర్ పరిసరా ల నుంచి మరో 1500 మంది వరకు ఉపాధికోసం కువైట్‌కు వెళ్లారు. కంపె నీ వీసాలతో కువైట్ వెళ్లి అక్కడ కంపె నీల్లో వేతనాలు సరిగ్గా లేక స్వదేశంలో చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదురైన క్రమంలో చాలామంది ఎక్కు వ వేతనాల కోసం ఇతర కంపెనీలకు మారి కలివెల్లి అయిన వారి సంఖ్య సుమారు 2500 వరకు ఉంటుందని అంచనా. వీరిలో చాలా మంది కువైట్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నేస్టీని వినియోగించుకుని స్వదేశం చేరేందుకు ఇష్టపడడం లేదని సమాచారం. కువైట్ రావడానికి చేసిన అప్పులు తీర్చి ఎంతో కొంత డబ్బు కూడబెట్టకుండా ఇంటికి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో కువైట్‌లో కలివెల్లి అయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారిలో సుమారు 980 మంది మాత్రమే స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాసుల్లేక..చార్జీలు పెరిగి కువైట్ మొదట ప్రకటించిన అమ్నేస్టీ గడువు వినియోగించుకోవడంపై అవగాహన లేని వలసజీవులు చివరి రోజు ల్లో హడావుడి పడడం సమస్యాత్మకంగా మారింది. చాలామంది వలస జీవులు విమాన చార్జీలు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని ఆశించి ఎదురుచూసినట్లు సమాచారం. ఫిబ్రవరి 22 దగ్గర పడడంతో తప్పనిసరై తమకు తాముగా స్వదేశాలకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో రద్దీ పెరిగిం ది. పదిరోజులుగా కువైట్ విమాన కంపెనీలు అకస్మాత్తుగా చార్జీలు పెం చేశాయి. ఒక్కో టికెట్‌కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు చేరింది. చేతిలో డబ్బులు లేక చేయడానికి పనులు లేక స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చాలా మంది వలస జీవులు అవస్థలు పడ్డా రు. ఓ దశలో ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఊరట దక్కింది.. ఈ పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు జేఎన్. వెంకట్, తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారీలు కువైట్ నుంచి తిరిగి వచ్చేవారికి విమాన చార్జీలు భరించడానికి ముందుకు రావడం బాధితులకు కొంత ఊరట నిచ్చింది. సుమారు 100–150 మంది వరకు కువైట్ నుం చి తిరిగి వచ్చినట్లు సమాచారం. కొం తమంది స్వయంగా డబ్బులు పెట్టుకుని వాపస్ వచ్చారు. ఇప్పటి వరకు వాపస్ వచ్చిన వారి సంఖ్యను మినహాయించినా మరో 800 మంది వరకు కువైట్‌లోనే ఉన్నట్లుగా సమాచారం. కువైట్ ప్రభుత్వం మళ్లీ అమ్నెస్టీ గడువును ఏప్రిల్ 22 వరకు పెంచడంతో వీరందరికి ఊరట కలిగింది. -
కువైట్ నుంచి స్వదేశం వస్తున్న వారికి ఉచిత టికెట్స్
కువైట్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష ద్వారా స్వదేశం వెళుతున్న కోడూరు వాసులకు ఉచిత టికెట్స్ ఇప్పించారు. భారత రాయబార కార్యాలయం వద్ద కమిటీ సభ్యుల సహాకారంతో పోలి బుజ్జమ్మ (వెంకటరెడ్డి పల్లి, అరుంధతి వాడ), పెంచల సురేష్ (వెంకటరెడ్డి పల్లె, గిరిజన కాలనీ), గంపల నారాయణ (బైనపల్లి, ఎస్పీ కాలనీ) భారత కార్యాలయ అధికారి సెకండ్ సెక్రెటరీ నారాయణ స్వామి వీరికి టికెట్స్ ఇప్పించారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ , కువైట్ కన్వీనర్లు ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ గత నెల 29 నుంచి అకామా ( రెసిడెన్సీ) లేని వారు స్వస్ధలాలకు వెళ్లిపోవచ్చని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి రోజు భారత కార్యాలయము వద్దకు వచ్చే తెలుగు వారికి సహాకారం అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ ముగ్గురికి కూడా అవుట్ పాస్‌లు ఇప్పించామని చెప్పారు. కమిటీ సభ్యులు, దాతల సహాకారంతో ఈ ముగ్గురికి ఉచిత టికెట్స్ ఇప్పించిన ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అందక పోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారులు కువైట్ వచ్చి తెలంగాణ వారికి సహాకారం అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసా రెడ్డి, గవర్ణింగ్ కౌన్సిల్ సభ్యుడు పీ రెహమాన్ ఖాన్, మీడియా ఇంచార్జ్ ఆకుల ప్రభాకర్ రెడ్డి, బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, లలితారాజ్, యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, మైనారిటీ సభ్యుడు షేక్ రహామతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ కార్మికులకు అండగా ఉంటాం
కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భరోసా, నైతిక మద్దతు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం కువైట్‌లో పర్యటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా వెంట మాజీ దౌత్యవేత్త, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జె.ఎన్.వెంకట్, ప్రవాసీ కార్మిక నాయకులు కె. ఎస్.రాం, ఎమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (ప్రవాసీ సంక్షేమ వేదిక) అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఉన్నారు. కువైట్ క్షమాబిక్ష పథకంలో స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న పేద ప్రవాసీ కార్మికుల్లో వంద మందికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విమాన టికెట్లు ఇస్తున్నామని కుంతియా తెలిపారు. టికెట్లు ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రవాసీలను మోసగించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కార్మికుల తిరుగు ప్రయాణానికి మానవతా దృక్పథంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్లు ఇవ్వడానికి ముందుకువచ్చిన డాక్టర్ జేఎన్ వెంకట్ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), కేఆర్ సురేష్‌రెడ్డి (ఆర్మూర్), సుదర్శన్‌రెడ్డి (బోధన్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్)లను కుంతియా అభినందించారు. -
రోహింగ్యాలను హింసిస్తున్న సైన్యం : అమ్నెస్టీ
ఢాకా: రోహింగ్యాలపై ఒక క్రమపద్దతిలో మయన్యార్ సైన్యం హింసిస్తోందని అమ్నెస్టీ సంస్థ ప్రకటించింది. అమ్నెస్టీ ప్రకటనతో మయన్మార్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమ్నెస్టీ నివేదికపై ఐక్యరాజ్యసమితి కార్యదర్శి రెక్స్ టెలిర్సన్ మాట్లాడుతూ రోహింగ్యాలపై దాడులు చేయడాన్ని, వారు నివసిస్తున్న గ్రామాలపై సైన్యం దాడి చేస్తూ వారిని ఒక క్రమపద్ధతిలో హింసించడాన్ని ఎవరూ సమర్ధించరని అన్నారు. మయన్మార్‌లో బౌద్ధులు-రోహింగ్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. 3 లక్షల 91 వేలమంది వలస వెళ్లినట్లు ఆయన ప్రకటించారు. ఇంత భారీ సంఖ్యలో ఒక జాతికి చెందిన వ్యక్తులు వలస వెళ్లడం ఇదే తొలిసారి కావచ్చని రెక్స్ టెలిర్సన్ చెప్పారు. మయన్మార్‌లో గ్రామాలకు గ్రామాలను వదలి రోహింగ్యాలు ప్రాణరక్షణ కోసం వెళుతున్నారని చెప్పారు. ప్రస్తుత దారుణ పరిస్థితులను చక్కదిద్దేందుకు సహకరించాలని ఆంగ్‌సాన్ సూకీని కోరినట్లు రెక్స్ తెలిపారు. -
జరిమానా, జైలుశిక్ష లేకుండా స్వదేశానికి..
- సౌదీ క్షమాబిక్ష (ఆమ్నేస్టీ) పథకంతో వెసులుబాటు - జులై 25న ముగియనున్న గడువు - 'మత్లూబ్' కేసులతో పలువురి నరకయాతన - అప్పుల బాధతో వెనక్కి వచ్చేందుకు జంకుతున్న కార్మికులు - ఆమ్నేస్టీతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 వేలమంది ఊరట లభిస్తుందని అంచనా సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియా స్థానిక చట్టాలను అతిక్రమించి దేశంలో ఉంటున్న వారిని తిరిగి వారి స్వదేశాలకు వెళ్లడానికి వీలుగా అక్కడి ప్రభుత్వం కల్పించిన ఆమ్నేస్టీ (క్షమాబిక్ష) కి ఈ నెల 25 వ తేదీతో ముగుస్తోంది. జీవనోపాధిని వెతుక్కుంటూ ఏడాది దేశం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాస భారతీయులకు ఇదొక మంచి అవకాశం. అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే సౌదీలో అక్రమంగా వెళ్లినవారంతా తిరిగి స్వదేశం చేరుకోవడానికి ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ తెలిసీ తెలియక చేసిన చిన్నచిన్న పొరపాట్ల కారణంగా ఈ అవకాశం కూడా వినియోగించుకోలేక అక్కడే మగ్గుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని పట్టించుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. (గల్ఫ్ జిందగీ : సౌదీలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ) సౌదీ ప్రభుత్వం తొలుత మార్చి 29 నుంచి 90 రోజుల పాటు క్షమాబిక్ష (ఆమ్నేస్టీ) ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆ గడువును మరో 30 రోజులు పొడగించింది. ఆ గడువు ఈనెల 25 తో ముగుస్తోంది. ఈ ఆమ్నేస్టీలో కనీసంగా 30 వేల మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటారని అంచనా. ఇందులో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే 10 వేల మంది ఉంటారని తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి రావాలంటే చేసిన అప్పులు వారిని భయపెడుతున్నాయి. తిరిగి స్వదేశానికి వెళితే ఏం చేయాలి? భవిష్యత్తు ఎలా ఉంటుందో? అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వాల ఏదైనా భరోసా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో పలువురున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే ... చిన్నచిన్న పొరపాట్లు చేసి అక్కడి చట్టాలను అతిక్రమించిన వందలాది భారతీయ కార్మికులకు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నేస్టీ వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. సద్వినియోగం చేసుకోవాలి నివాస మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన సౌదీలో ఉన్న విదేశీయులందరికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోక సౌదీలో అక్రమానివాసులుగా ఉండిపోయేవారికి లక్ష రియాళ్ల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ఈ పథకాన్ని వినియోగించుకున్నవారి వేలిముద్రలు తీసుకోరు, మళ్లీ సౌదీకి వెళ్లొచ్చు. వారిపై ట్రావెల్ బ్యాన్ ఉండదు. అధికారుల అంచనా ప్రకారం సౌదీలో ఎక్కువగా ఉద్యోగాల వీసాతో పోయిన అక్రమనివాసులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. హజ్, ఉమ్రా వీసాల అక్రమనివాసులు తక్కువ. యాజమానుల నుండి పారిపోయిన సుమారు వేలాది మంది ఉద్యోగుల పాస్ పోర్టులు భారత రాయబార కార్యాలయాలకు సౌదీ అధికారులు అందజేశారు. సౌదీలో 'హురూబ్' గా ప్రకటించబడ్డ ప్రవాస భారతీయులు 8,837మంది ఉన్నట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెబ్ సైట్ లో ప్రకటించారు. గతనెలలో ప్రకటించిన సమాచారం ప్రకారం భారత రాయబార కార్యాలయాలు ఇప్పటివరకు 26 వేల అవుట్ పాస్ లను జారీ చేశాయి. అవుట్ పాస్ ల కోసం జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి 26,713 మంది (వీరిలో తెలంగాణ వారు 2,733 మంది, ఆంధ్రప్రదేశ్ వారు 1,120 మంది ఉన్నారు) భారతీయులు దరఖాస్తులు దాఖలు చేశారు. రియాద్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి 20,131 మంది దరఖాస్తు చేశారు. సహాయం కోసం ప్రవాస భారతీయులు సంప్రదించాల్సిన హెల్ప్ డెస్క్ నెంబర్లు ఇవే -
యువరాజుకు మరణశిక్ష
అమలు చేసిన సౌదీ సర్కారు మిత్రుడిని కాల్చిచంపిన కేసులో.. సౌదీ మరణశిక్షలపై ‘ఆమ్నెస్టీ’ ఆందోళన రియాద్: వడ్డించేవాడు మనవాడైతే.. పంక్తిలో ఎక్కడ కూర్చుంటే ఏంటనే సామెత మనకు తెలుసు. రాజకీయ, అధికార అండదండలు అడ్డంపెట్టుకుని.. నేరాలనుంచి తప్పించుకున్న వాళ్లు చాలామందిని చూశాం. కానీ సౌదీ అరేబియాలో మాత్రం ఓ హత్యకేసులో దోషి అని తేలటంతో ఏకంగా యువరాజుకే (రాజ కుటుంబానికి చెందిన వ్యక్తికి) మరణశిక్ష విధించి అమలుచేశారు. అసలేం జరిగింది?.. రాజ కుటుంబీకులు, కాస్త డబ్బు పలుకుబడి ఉన్నవారు సౌదీలో ఎడారిలో ఏర్పాటుచేసే క్యాంపుల్లో కలుసుకుంటారు. ఇలాగే.. 2012లో యువరాజు తుర్కి బిన్ సౌద్ అల్ కబీర్ కూడా ఇక్కడికి వచ్చారు. మిత్రులంతా కలసి మాట్లాడుతుండగా.. మాటా మాటా పెరిగి గొడవకు దారితీయటంతో.. కబీర్ తన తుపాకీతో మిత్రుడు ఆదిల్ అల్ మహెమీద్ను కాల్చి చంపాడు. ఈ కేసులో విచారణలన్నీ ముగిసిన తర్వాత కోర్టు కబీర్‌ను దోషిగా తేల్చటంతో మరణశిక్ష విధించి మంగళవారం రాత్రి అమలుచేశారు. ఈ విషయాన్ని సౌదీ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఏడాది మరణదండన పడిన వారిలో కబీర్ 134వ వ్యక్తి. రెండేళ్లలో ఈ శిక్షపడ్డ రెండో యువరాజు ఇతడు. కబీర్ వయసు, ఇతర వివరాలను వివరించేందుకు సౌదీ అధికారులు నిరాకరించారు. ఇతను సౌదీరాజు అబ్దుల్ అజీజ్ వంశానికి చెందిన వాడని తెలిసింది. అయితే రాజకుటుంబంలో తరతరాలను వెతికితే వందలమంది యువరాజులుంటారు. ఇది రాచరిక న్యాయం.. కబీర్‌కు మరణశిక్ష విధించటంపై సౌదీలో హర్షం వ్యక్తమైంది. రాజ కుటుంబం పాలనలో దేశంలో సమన్యాయం అమలవుతుందని బాధితుడి కుటుంబీకులు తెలిపారు. సౌదీలో మరణశిక్ష అమలుచేయాలంటే శిరచ్ఛేదం చేస్తారు. ఇస్లామిక్ న్యాయసూత్రాల ప్రకారం హత్య, మత్తుపదార్థాల స్మగ్లింగ్, ఆయుధాల చోరీ, అత్యాచారం, మతం మారిన వారికి మరణశిక్ష విధిస్తారు. 158 మందిని చంపేశారు!: సౌదీలో రాజ కుటుంబం మరణశిక్షలను అమలుచేస్తూ మానవహక్కులను కాలరాస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆవేదన వ్యక్తం చేసింది. 2015 నుంచి తాజాగా కబీర్ వరకు 158 మందికి మరణశిక్ష పడిందని తెలిపింది. ఇరాన్, పాకిస్తాన్ తర్వాత ఎక్కువగా మరణశిక్షను అమలుచేస్తున్న మూడో దేశం సౌదీనే అని పేర్కొంది. కాగా, గతంలో సౌదీలో డ్రగ్స్ రవాణా, హత్యకేసుల్లో దోషిగా తేలిన వారికే ఎక్కువగా మరణశిక్ష పడింది. జనవరిలో ఉగ్రవాదులకు సాయం చేశారన్న కారణంతో 47 మందికి ఒకేరోజు మరణదండన అమలుచేశారు. చైనాలో రహస్యంగా చాలా మందికి మరణశిక్ష విధిస్తున్నా ఆ లెక్కలు బాహ్యప్రపంచానికి చేరటం లేదు.