రష్యా దాడుల్లో 200 మంది పౌరులు మృతి!
సిరియాలో వైమానిక దాడులు జరుపుతున్న రష్యా.. సామాన్య పౌరుల మృతికి కారణమౌతోందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన నివేదికలో తెలిపింది. ఇప్పటి వరకు 200 మంది సిరియా పౌరులు రష్యా దాడుల్లో మరణించినట్లు ఈ నివేదిక వెల్లడించింది. సిరియాలోని హమా, లటాకియా, ఇడ్లిబ్, అలెప్పో ప్రాంతాల్లో రష్యా జరిపిన దాడుల్లో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. నవంబర్ 29 న ఇడ్లిబ్ ప్రాంతంలోని పబ్లిక్ మార్కెట్పై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లోనే 49 మంది పౌరులు మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది.
అల్ బషర్ ఆహ్వనం మేరకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ సెప్టెంబర్ 30న రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదులకు బదులుగా బషర్ వ్యతిరేక వర్గాలపై రష్యా దాడులు జరుపుతోందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక అవాస్తవం అని, యుద్ద సమాచారాన్ని తప్పుగా అందిస్తూ కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రష్యా ఆరోపించింది.