
ఆ దేశ స్వతంత్ర మీడియా కథనం
95,000 మంది సైనికుల వివరాలతో ప్రచురణ
లెక్కలపై నోరు విప్పని ప్రభుత్వం
మాస్కో: ఉక్రెయిన్‌తో పోరాడుతూ 165,000 సైనికులు మరణించారని రష్యన్ స్వతంత్ర వార్తా సైట్ మీడియాజోనా ప్రకటించింది. అందులో 95,000 మందికి పైగా సైనికుల వివరాలను పేర్లతో సహా వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లయిన సందర్భంగా సైనికుల మరణాలకు సంబంధించిన చిత్రాలు, అధికారిక సమాచారంతో కూడిన కథనాన్ని మీడియాజోనా సోమ వారం ప్రచురించింది. రష్యన్ కళాకారుడు వాసిలీ వెరెష్చాగిన్ 1,871లో ‘ది అపోథియోసిస్ ఆఫ్ వార్’చిత్రాన్ని వేలాది మంది సైనికుల ఫొటోల గ్రాఫిక్స్‌తో రూపొందించింది.
ప్రతి ఎంట్రీలో సైనికుడి వయస్సు, మరణించిన తేదీ, ప్రాంతం, యూనిట్, అందుబాటులో ఉంటే ఫొటోలను కూడా ప్రచురించింది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు రష్యన్ మరణాల సంఖ్యను 393గా పేర్కొంది.రష్యన్ల మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు రెట్టింపవుతూ వచ్చిందని వెల్లడించింది. తమ విశ్లేషణ ప్రకారం 2024 యుద్ధంలో అత్యంత రక్తసిక్త సంవత్సరమని పేర్కొంది. 2022లో సుమారు 20,000, 2023లో సుమారు 50,000 మంది మరణించగా.. ఒక్క 2024లో 1,00,000 మంది చనిపోయాడని వెల్లడించింది. బీబీసీ రష్యన్ సర్వీస్, వలంటీర్ల బృందం సహకారంతో జాబితాను రూపొందించామని తెలిపింది.
మౌనం వహించిన ప్రభుత్వం...
దీనిపై వ్యాఖ్యానించడానికి క్రెమ్లిన్ నిరాకరించింది. ఈ ప్రచురణ గురించి తనకు తెలియదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. మరణాల సంఖ్యను ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. ఇది నిజమో కాదో తనకు తెలియదని, మృతుల సంఖ్య సమాచారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక హక్కని ఆయన అన్నారు. యుద్ధానికి సంబంధించిన మరణాల గణాంకాలను రష్యా చాలా అరుదుగా ఇస్తోంది. 2022 సెపె్టంబర్లో జరిగిన యుద్ధంలో 5,937 మంది సైనికులు మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లో తెలిపింది. మీడియాజోనాను రష్యన్ ప్రతి పక్ష కార్యకర్త ప్యోటర్ వెర్జిలోవ్ స్థాపించారు. కాగా, రష్యా ప్రభుత్వం మీడియాజోనాను ‘విదేశీ ఏజెంట్’గా ప్రకటించింది. వెర్జిలోవ్‌ను తీవ్రవాదుల జాబితాలో చేర్చింది. సైన్యం గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని దోషిగా నిర్ధారించింది.
మా సైనికులు 46 వేల మంది మరణించారు: జెలెన్‌స్కీ
రష్యాతో యుద్ధంలో 46,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించారని, సుమారు 3,80,000 మంది గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. ఇతర అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాగా, 70,000 మంది చనిపోయారని, 35,000 మంది గల్లంతయ్యారని తమ సైనిక వర్గాలు అంచనా వేశాయని స్వతంత్ర ఉక్రేనియన్ వార్ కరస్పాండెంట్ యూరీ బుటు సోవ్ డిసెంబరులో చెప్పారు.