అక్టోబర్‌లో రష్యా కోల్పోయిన సైనికుల సంఖ్య
ఇప్పటిదాకా 7 లక్షల మంది మరణం!
బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వెల్లడి
లండన్: ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా యుద్ధక్షేత్రంలో భారీగా రక్తమోడుతోందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. సంబంధిత వివరాలను బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ ర్యాడకిన్ ఆదివారం వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ నుంచి భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది రష్యా సైనికులు చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని టోనీ చెప్పారు.
‘‘ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా మొదట్లో పలు ఉక్రెయిన్ ప్రాంతాలను వేగంగా ఆక్రమించుకుంది. కానీ తర్వాత యూరప్ దేశాల దన్నుతో, అధునాతన ఆయుధాల సాయంతో ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ప్రతిఘటనను పెంచింది. దీంతో ఇటీవలి కాలంలో సమరంలో సమిధలవుతున్న రష్యా సైనికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా అక్టోబర్‌లో ప్రతి రోజూ 1,500 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడమో, శరీరభాగాలు కోల్పోవడమో జరిగింది. యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే ఒక్క నెలలో ఇంతటి నష్టం ఇదే తొలిసారి.
పుతిన్ రాజ్యవిస్తరణ కాంక్షకు ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధంలో 7,00,000 మంది రష్యా సైనికులు బలయ్యారు. ఆక్రమణతో రష్యా భూభాగం పెరుగుతోంది. జాతీయభావనను పెంచి పుతిన్ రష్యాలో మరింత పాపులర్ అయ్యారు. కానీ ప్రభుత్వ ఖజానా, సైన్యంపరంగా దేశానికి అపార నష్టం వాటిల్లుతోంది. రష్యా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 40 శాతాన్ని కేవలం ఈ యుద్ధం కోసమే పుతిన్ కేటాయిస్తున్నారు. ఇది దేశార్థికంపై పెను దుష్ప్రభావం చూపుతుంది. పుతిన్ యుద్ధోన్మాదం లక్షలాది మంది రష్యన్లను కష్టాలపాలుచేస్తోంది. యువతను బలవంతంగా సైన్యంలోకి తీసుకుంటున్నారు. ఎంతో మంది తమ ఆప్తులను యుద్ధభూమిలో కోల్పోతున్నారు’’ అని టోనీ అన్నారు. దీనిపై రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
రష్యా 145, ఉక్రెయిన్ 70 డ్రోన్లతో దాడులు
మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. రష్యా శనివారం రాత్రి 145 షహీద్ డ్రోన్లను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించింది. యుద్ధం మొదలయ్యాక ఒకే రాత్రిలో ఇంత భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు 62 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నాయంది. మరో 67 డ్రోన్లు వివిధ ప్రాంతాల్లో పడ్డాయని, 10 వరకు డ్రోన్లు గురితప్పి మాల్డోవా, బెలారస్, రష్యా ప్రాంతాలవైపు దూసుకెళ్లాయని ఉక్రెయిన్ పేర్కొంది. ఆదివారం ఉదయం మాస్కో దిశగా ఉక్రెయిన్ ఆర్మీ అత్యధికంగా 34 డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది. ఆరు ప్రాంతాలపైకి మొత్త 70 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపింది. ఈ సంఖ్యలో ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. వీటన్నిటినీ కూల్చేశామని వివరించింది. డ్రోన్ శకలాలు పడి రెండో చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
Comments
Please login to add a commentAdd a comment