రోజుకు 1,180 మంది సైనికుల మరణాలు
గత ఏడాది ఏకంగా 4,30,000 మంది రష్యన్ సైనికుల దుర్మరణం
గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’తాజాగా వెల్లడించింది.
యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్‌లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్‌లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్ కమాండర్ ఇన్ చీఫ్ ఒలెస్కాండర్ సిరిస్కీ చెప్పారు.
కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం
గత ఏడాది తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్‌తోపాటు అవ్‌దీవ్కా, సెలిడోవ్, వులేదార్‌లు రష్యా వశమయ్యాయి. అవ్‌దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్‌దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్‌ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్‌స్క్ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్‌పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి.
రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ
గత ఏడాది నవంబర్‌లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్‌లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్‌కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్‌లో ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ పేర్కొంది. డిసెంబర్ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్ చెప్పారు.
వేల సైనిక వాహనాలు ధ్వంసం
రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్‌లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్ రీజియన్‌లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల ప్రకటించారు.
సైన్యంలోకి మరింతగా జనం
ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా పంపేస్తానని పుతిన్ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment