
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా క్రమంగా పైచేయి సాధిస్తోంది. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతుండగానే, మరోవైపు ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. రష్యా సరిహద్దు అయిన కర్క్స్ ప్రాంతంలోని అతిపెద్ద పట్టణం సుడ్జా మళ్లీ రష్యా సేనల చేతుల్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఉక్రెయిన్ సైన్యాన్ని తమ బలగాలు తరిమికొట్టినట్లు రష్యా ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
కర్క్స్‌లోని తమ సైనిక కమాండర్లను రష్యా అధినేత పుతిన్ బుధవారం కలిశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలో సుడ్జా టౌన్ రష్యా వశం కావడం గమనార్హం. సుడ్జా పట్టణం ఉక్రెయిన్–రష్యా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. రష్యా పరిధిలోకి వచ్చే ఈ పట్టణాన్ని గతంలో ఉక్రెయిన్ సేనలు ఆక్రమించాయి. ఇక్కడ 5,000 మంది నివసించేవారు. యుద్ధం మొదలైన తర్వాత చాలామంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. యుద్ధంలో తాము కోల్పోయిన భూభాగాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవడం అతిపెద్ద విజయంగా రష్యా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అయితే, దీనిపై ఉక్రెయిన్ అధికార వర్గాలు ఇంకా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment