అక్రమ వలసదారులు ఎలాంటి జరిమానా, జైలుశిక్షలేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోవడానికి వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం 1 ఆగష్టు నుండి 31 అక్టోబర్ వరకు మూడు నెలలపాటు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. క్షమాభిక్ష ఉపయోగించుకోవాలనుకునే ప్రవాసీలకు ఉపయోగపడే విధంగా గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న: యూఏఈ క్షమాభిక్ష-2018 పథకాన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి
జవాబు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని ఏడు రాజ్యాలయిన అబుదాబి, దుబాయి, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఉమ్మల్ కోయిన్, ఫుజీరా లలో గల ఇమ్మిగ్రేషన్ (వలస) కేంద్రాలలో సంప్రదించాలి. ఏ ఎమిరేట్ (రాజ్యం) వీసా ఉన్నవారు అక్కడి ఇమ్మిగ్రేషన్ కేంద్రాలకు మాత్రమే వెళ్ళాలి.
ప్రశ్న: జరిమానా పూర్తిగా మాఫీ చేస్తారా? నామమాత్రంగా చెల్లించాలా?
జవాబు: గడువుమీరి ఎక్కువరోజులు ఉన్నoదుకు జరిమానా పడదు. కానీ, యూఏఈ ప్రభుత్వం కొంత ఫీజు వసూలు చేస్తుంది.
ప్రశ్న: దేశంనుంచి బయిటకు వెళ్ళడానికి ఇచ్చే 'ఎగ్జిట్ పర్మిట్' పొందాలంటే ఎంత డబ్బు చెల్లించాలి ?
జవాబు: 221 దిర్హములు (రూ.4 వేలు), వీసా రెగ్యులరైజ్ (క్రమబద్దీకరణ) చేసుకోవడానికి 521 దిర్హములు(రూ.9,400) చెల్లించాలి.
ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందడానికి ఏ డాక్యుమెంట్లు (దస్తావేజులు) సమర్పించాలి
జవాబు: ఒరిజినల్ పాస్ పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (అవుట్ పాస్ అనబడే తెల్లరంగు తాత్కాలిక పాస్ పోర్టు), విమాన ప్రయాణ టికెట్టు దాఖలు చేయాలి.
ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందిన తర్వాత ఎన్నిరోజులలోగా దేశం వదిలి పోవాలి
జవాబు: 21 రోజులలోగా
ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందడానికి ఎన్నిరోజులు అవుతుంది
జవాబు: బయోమెట్రిక్ స్కానింగ్ అయిన వెంటనే ఇస్తారు
ప్రశ్న: పాస్ పోర్ట్ పోగొట్టుకున్నసందర్భాలలో పోలీస్ క్లియరెన్స్ రిపోర్ట్ అవసరమా
జవాబు: అవును. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఒకలెటర్ పొంది, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయానికి వెళితే వారు వీసా స్టేటస్ (స్థితి) ని తెలుపుతూ ఒక ప్రింట్ అవుట్ ఇస్తారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్, కోర్టుల నుండి స్టాంప్ వేయించుకోవాలి. చివరగా పోలీస్ స్టేషన్ లో "లాస్ట్ పాస్ పోర్ట్" (పాస్ పోర్ట్ పోయినది) అనే సర్టిఫికెట్ అరబిక్ భాషలో ఇస్తారు. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించుకొని ఇండియన్ ఎంబసీలో దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ ఎంబసీ వారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (అవుట్ పాస్ అనబడే తెల్లరంగు తాత్కాలిక పాస్ పోర్టు) ఇవ్వాలన్నా, యూఏఈ ప్రభుత్వం 'ఎగ్జిట్ పర్మిట్' ఇవ్వాలన్నా పోలీస్ క్లియరెన్స్ రిపోర్ట్ అవసరం. క్షమాభిక్ష సందర్బంగా ఈ ప్రక్రియను కొంత సరళతరం చేశారు.
ప్రశ్న: యూఏఈ దేశంలోకి మళ్ళీ ప్రవేశించకుండా నిషేధం (నో ఎంట్రీ బ్యాన్) ఎన్నేళ్లు ఉంటుంది? ఈ బ్యాన్ కు ఎవరు గురవుతారు?
జవాబు: సరైన పత్రాలు లేకుండా యూఏఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశిచిన వారికి రెండేళ్ల బ్యాన్ విధిస్తారు. అత్యవసర పరిస్థితులలో దేశంవిడిచి వెళ్లేవారికి ఈ బ్యాన్ వర్తించదు.
ప్రశ్న: కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నవారు 'క్షమాభిక్ష' పథకాన్ని ఉపయోగించుకోవచ్చా?
జవాబు: లేదు. న్యాయస్థానం నుండి అనుమతి పొందిన తర్వాతనే 'క్షమాభిక్ష' పథకానికి అర్హులు. నిర్ణీత కాలానికంటే మించి ఉన్నవారి (ఓవర్ స్టేయర్స్) సమస్యలను మాత్రమే ఇమ్మిగ్రేషన్ వారు పరిగణలోకి తీసుకుంటారు.
ప్రశ్న: యజమాని నుండి పరారీ (అబ్ స్కాండింగ్) అయినట్లు ఫిర్యాదు నమోదుకాబడ్డవారు అమ్నెస్టీ కోసం దరఖాస్తు చేయవచ్చా?
జవాబు: కేసు వాస్తవాలను బట్టి, ఇమ్మిగ్రేషన్ అధికారులు 'అబ్ స్కాండింగ్' (పరారీ) రిపోర్ట్ ను తొలగించి, ఎలాంటి బ్యాన్ (నిషేధం) లేకుండా ఎగ్జిట్ పర్మిట్ (వెళ్లిపోవడానికి అనుమతి) జారీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్థలు 'అబ్ స్కాండింగ్' ఫిర్యాదు దాఖలు చేసినట్లయితే 71 దిర్హములు, వ్యక్తులయితే 121 దిర్హములు, కంపెనీ అయితే 521 దిర్హముల ఫీజు చెల్లించాలి.
ప్రశ్న: 'అబ్ స్కాండింగ్' (పరారీ) గా నమోదుకాబడ్డవారు దాని తొలగింపు (క్లియరింగ్)కు ఎవరిని సంప్రదించాలి?
జవాబు: ఏ ఎమిరేట్ (రాజ్యం)లో వీసా పొందారో అక్కడే ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో సంప్రదించాలి.
ప్రశ్న: స్పాన్సర్ (యజమాని) జాడలేని సందర్భాలలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లేముందు ఏం చేయాలి?
జవాబు: 'లేబర్ కార్డు'ను రద్దు చేసుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళాలి.
ప్రశ్న: ఉద్యోగి పాస్ పోర్ట్ ను స్పాన్సర్ (యజమాని) ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో జమచేసిన సందర్భాలలో పాస్ పోర్ట్ ను పొందడం ఎలా?
జవాబు: ఇలాంటి కేసులలో, కంప్యూటర్ డేటాబేస్ లో వెతికిన తర్వాత ఆ ఉద్యోగిని సంబందిత ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళమని సూచిస్తారు. అక్కడ పాస్ పోర్టు ఇవ్వబడుతుంది.
మరింత సమాచారం కోసం 'ప్రవాసి మిత్ర' హెల్ప్ లైన్ వాట్సప్ నెంబర్ +91 98494 22622 లేదా mbreddy.hyd@gmail.com కు సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment