manda bhim reddy
-
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
మోర్తాడ్: గల్ఫ్ వలస కార్మికులకోసం తెలంగాణలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్వో), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ప్రతినిధులు ముందుకొచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ఐఎల్వో దక్షిణాసియా దేశాల ఇన్చార్జి, వలస కార్మికుల వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి ఈనెల 22న హైదరాబాద్‌లో సీఎస్ సోమేష్‌కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డితో సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల నుంచి సొంత గడ్డకు చేరుకునే వారికి పునరావాసంతో పాటు, కుటుంబం, సమాజంతో వారు మమేకం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తాము కొన్ని కార్య క్రమాలను చేపట్టనున్నామని, దీనికి తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ వలసల వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఐఎల్వో ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా ధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే వలస కార్మికుల కుటుంబాలు బాగుపడే అవకా శాలు న్నాయి. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయా లన్న ఐఎల్వో ప్రతిపాదనలపై గల్ఫ్ వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎల్వో ప్రా జెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలి.. ఐఎల్వో ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలపాలి. ఇక్కడ అమలు చేయకపోతే పైలట్ ప్రాజెక్టు మరో రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నాయకులు -
ప్రవాసీల కోసం జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు
హైదరాబాద్: అంతర్గత, అంతర్జాతీయ వలసదారుల హక్కులు, సంక్షేమం కోసం ప్రవాసీ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమవారం (సెప్టెంబర్ 13) ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీలో పలు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపామని, లాక్ డౌన్ సమయంలో 45 కోట్ల మంది వలస కార్మికులు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లారని, ఒక కోటి యాభై లక్షల మంది భారతీయులు విదేశాలలో నివసిస్తుండగా వారిలో 88 లక్షల మంది గల్ఫ్ దేశాలలో ఉన్నారని ఆయన అన్నారు. స్వదేశంలో, విదేశంలో పనిచేస్తూ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రవాసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని దేవేందర్ రెడ్డి అన్నారు. వివిధ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి వలస కార్మికుల జాతీయ వేదికల నిర్మాణం కోసం 'నేషనల్ నెట్ వర్క్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్', 'నేషనల్ ఫెడరేషన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్' ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా నంగి దేవేందర్ రెడ్డి బిజెపికి, మంద భీంరెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రవాసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ పార్టీలకు సోమవారం రాజీనామా చేసినట్లు వారు వివరించారు. -
ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి
ఫిలిప్పీన్స్ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆగస్టు 3-4 తేదీలలో ప్రవాసి కార్మికుల కోసం వివిధ దేశాలలో అందుబాటులో ఉన్నసహాయక వ్యవస్థలపై ఆసియా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తున్నారు. మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా (ఎంఎఫ్ఎ) నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసి విభాగం అధికారి చిట్టిబాబు హాజరవుతున్నారు. ప్రవాసి కార్మికులకు ఆయాదేశాలలో ప్రస్తుతం అందుబాటులోఉన్న సహాయక వ్యవస్థలు, ఉత్తమ పద్ధతుల గురించి ఇందులో పాల్గొనే ప్రభుత్వ ప్రతినిధులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకునే వీలు కలుగుతుంది. ఈ సమావేశం ద్వారా ఆసియా దేశాలలోని వలసకార్మికులకు అందుతున్న వివిధ సహాయక వ్యవస్థల గురించి తెలుసుకొని, అర్థం చేసుకోవడం, అమలులో ఉన్న మంచి పద్దతులను అధ్యయనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. వేరే దేశంలో విజయవంతంగా అమలవుతున్న మద్దతు వ్యవస్థలను మనం స్వీకరించడానికి, అమలులో ఎదురవుతున్న సవాళ్లు, అడ్డంకులను ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రవాసికార్మికులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రవాసి విభాగం అధికారి చిట్టిబాబు హాజరుకావడం పట్ల మైగ్రంట్ ఫోరం ఇన్ ఏసియా భారతదేశ సభ్యులు పి. నారాయణ స్వామి, మంద భీంరెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. -
అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం
సాక్షి, హైదరాబాద్ : అప్పుడు రాత్రి 10 గంటలు.. తెల్లవారు జామున 5 గంటలకు దుబాయి నుండి ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రవాసి కార్మికుడి మృతదేహం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి స్వగ్రామానికి శవపేటికను రవాణా చేయడానికి ఖర్చులను కూడా భరించుకోలేని పేదరికంలో ఆ మృతుడి కుటుంబ పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఏర్గట్ల జెడ్పిటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ ఆ రాత్రి 'ప్రవాసిమిత్ర' అధ్యక్షులు మంద భీంరెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అధికారి చిట్టిబాబుకు ఫోన్లో సమాచారం అందించారు. నిబంధనల కంటే మానవత్వం ముఖ్యమని భావించిన చిట్టిబాబు తక్షణమే స్పందించి ఆరాత్రి ప్రోటోకాల్ విభాగానికి ఫోన్ చేసి ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీచేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన మారంపల్లి చిన్న భోజన్న అనే ప్రవాసి కార్మికుడి మృతదేహం దుబాయి నుండి హైదరాబాద్ కు బుధవారం తెల్లవారుజామున చేరుకోగా ప్రోటోకాల్ అధికారి నర్సింగ్ పోలీసు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ నిబంధనలు పూర్తి చేయించి మృతుల బంధువులకు శవపేటిక అప్పగించి అంబులెన్సులో పంపించారు. బాధిత కుటుంబానికి ఆపత్కాల సమయంలో అండగా నిలిచి తన వంతు సహాయం అందించిన అధికారి సేవలను పలువురు కొనియాడారు. ఆపదలో ఆదుకునే హెల్ప్ లైన్లు వివిధ దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న వలసకార్మికుల పక్షాన భారత్‌లోని వారి బంధువులు ఢిల్లీలోని భారత ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1800 11 3090, హాట్ లైన్ నెంబర్ +91 11 4050 3090, తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఎన్నారై విభాగం నెంబర్ +91 94408 54433 ఈ-మెయిల్: so_nri@telangana.gov.in కు సంప్రదించవచ్చు. హైదరాబాద్ లోని నాంపల్లి గృహకల్ప భవనంలోని పిఓఇ కార్యాలయ ఆవరణలోని 'క్షేత్రీయ ప్రవాసి సహాయతా కేంద్రం' (కేపీఎస్కే)ను స్వయంగా సందర్శించవచ్చు లేదా హెల్ప్ లైన్ నెంబర్ +91 73067 63482 ఈ-మెయిల్: helpline@owrc.in ద్వారా కూడా తమ సమస్యలను విన్నవించుకోవచ్చు. 'ప్రవాసిమిత్ర' వాలంటీర్లు బిఎల్ సురేంద్రనాథ్, హైదరాబాద్ +91 79818 14226, స్వదేశ్ పరికిపండ్ల, కరీంనగర్ +91 94916 13129, సురేందర్ సింగ్ ఠాకూర్, కామారెడ్డి +91 93912 03187 లను కూడా సంప్రదించవచ్చు. -
అవగాహన లేకుంటే.. చిక్కులే
వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై గత శుక్రవారం కువైట్‌లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులను కువైట్ నిఘా బృందాలు అరెస్టు చేశాయి. నిరసన ప్రదర్శన ఉద్దేశం మంచిదే అయినా ఆ దేశ చట్టాలకు విరుద్ధం కాబట్టి నిరసనకారులు ఇబ్బందుల్లో పడ్డారు. భారత దేశంలో పౌరులు తమ హక్కుల కోసం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లడానికి బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం సర్వసాధారణం. భారత్‌లో పుట్టిపెరిగిన వారు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వలన చిక్కుల్లో పడుతున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి రాచరిక పాలన, ముస్లిం షరియా చట్టాలు అమలులో ఉండే అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి పరిస్థితులలో ఇమడలేక మాన సిక సంఘర్షణ పడుతుంటారు. కొంత కాలం తర్వాత అలవాటుపడి సర్దుకుపోతుంటారు. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో అక్కడి చట్టాల ప్రకారం సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధం. గల్ఫ్‌లో సభలు, సమావేశాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపా ర సదస్సులు తదితర ఏ కార్యక్రమం చేపట్టాల న్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా ప్రభావం గల్ఫ్‌లో ఉండే చాలా మంది ప్రవాసులు స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులతో వాయిస్ కాల్, వీడియో కాల్ మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్లలో ఐఎంఓ (ఈమో), బోటిం, వాట్సాప్ లాంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. స్వదేశంలో జరిగే సంఘటనలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై తమ సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తున్నారు. రకరకాల విషయాలపై ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపులలో వాగ్యుద్ధాలు, తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. అర్థవంతమైన, విషయాత్మక చర్చలు, విలువైన సమాచార మార్పిడి కూడా జరుగుతున్నది. వార్తలు, విశేషాల అప్డేట్స్ కోసం ప్రవాసులు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. – మంద భీంరెడ్డి, ప్రవాసీ మిత్ర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు మంచి కోసమైనా సరే.. గల్ఫ్ దేశ నిబంధనలకు విరుద్ధంగా పొతే జైలుపాలవుతాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మన దేశానికి చెందిన సీనియర్ల సలహా తీసుకుని నిర్వహించాలి. ఆ దేశ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. గల్ఫ్‌లో చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుంటపోతది. వరంగల్ ఘటనపై ఆవేదనతో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. వారిని విడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. – గోలి, శ్రీనివాస్,ఖతార్ వినతి పత్రం రూపంలో పంపాలి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మనం ఇక్కడ అతిథులం మాత్రమే. ఈ దేశాల పౌరులం కాదు. మన సమస్యలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా వ్యక్తం చేయాలన్నా వినతి పత్రం రూపంలో ఇండియన్ ఎంబసీకి పంపాలి. మన సమస్యలపై భారత ప్రభుత్వానికి, ఆయా శాఖలకు ఉత్తరాలు రాయవచ్చు. కానీ, గల్ఫ్‌లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం నిషేధం. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. – షహీన్ సయ్యద్, సామాజిక కార్యకర్త, కువైట్ -
హైదరాబాద్‌లో ఏడు గల్ఫ్ మెడికల్ సెంటర్లు
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలయిన సౌదీ అరేబియా, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), ఓమాన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ లతోపాటు యెమెన్‌కు కొత్తగా ఉద్యోగానికి/నివాసానికి వెళ్లాలనుకునే వారు ముందస్తు ఆరోగ్య పరీక్షలు (ప్రీ హెల్త్ చెకప్ - మెడికల్ ఎగ్జామినేషన్) చేయించుకొని మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఇందుకోసం 'గల్ఫ్ హెల్త్ కౌన్సెల్' వెబ్ సైటు https://gcchmc.org/Gcc/Home.aspx ద్వారా ఆన్ లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా ? ఎయిడ్స్, టీబీ వంటి వ్యాధులు ఉన్నాయా ? వారు ఆరోగ్యంగా ధృడంగా ఉన్నారా..? అని ఇక్కడ పరీక్ష చేసి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆరోగ్యవంతులకు మాత్రమే అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీసా జారీ అవుతుంది. 'గల్ఫ్ హెల్త్ కౌన్సిల్' వారు భారత దేశంలోని 17 నగరాలలో 114 మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు అనుమతి ఇచ్చారు. మంగుళూరు (4), అహ్మదాబాద్ (4), బెంగుళూరు (5), లక్నో (12), ముంబై (19), చెన్నై (7), ఢిల్లీ (13), హైదరాబాద్ (7), జైపూర్ (5), తిరువనంతపురం (5), తిరుచ్చి (5), కాలికట్ (5), మంజేరి (4), తిరూర్ (4), కొచ్చి (5), గోవా (3), కోల్‌కతా (7) మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు హైదరాబాద్‌లోని ఈక్రింది ఏడు మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు వినియోగించుకోవచ్చు. ► మెస్కో డయాగ్నొస్టిక్ సెంటర్, దార్స్ షిఫా ఫోన్: 040 2457 6890 ఈ-మెయిల్: mescodc@hotmail.com ► గుల్షన్ మెడికేర్, అబిడ్స్ ఫోన్: 040 2461 2194 ఈ-మెయిల్: gulshanmedicarehyderabad@gmail.com ► ప్రీతి డయాగ్నొస్టిక్ సెంటర్, మెహిదీపట్నం ఫోన్: 040 6656 6785 ఈ-మెయిల్: preethi_kvk@yahoo.com ► సాలస్ హెల్త్ కేర్, హిమాయత్ నగర్ ఫోన్: 040 6625 7698 ఈ-మెయిల్: kasim@doctor.com ►ఎస్.కె. మెడికల్ సెంటర్, గోల్కొండ ఫోన్: 040 6558 7777 ఈ-మెయిల్: skmc7777@hotmail.com ► ఎస్.ఎల్. డయాగ్నోస్టిక్స్, ఖైరతాబాద్ ఫోన్: 040 2337 5235 ఈ-మెయిల్: sldpl@yahoo.co.in ► హైదరాబాద్ డయాగ్నొస్టిక్, సోమాజిగూడ ఫోన్: 040 2341 4051 ఈ-మెయిల్: hyderabaddiagnostic@gmail.com సేకరణ: మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం +91 98494 22622 -
తెలంగాణలో రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు 44
గల్ఫ్‌తో సహా 18 ఇసిఆర్ దేశాలకు భారతీయులను ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 42 రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. తెలంగాణలో వివిధ కారణాలతో 22 ఏజెన్సీలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా 1276 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి, 478 ఏజెన్సీలు మూతపడ్డాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇ-మైగ్రేట్ ఆన్ లైన్ పోర్టల్ లో తేదీ: 05.02.2019 ఉదయం వరకు పొందుపర్చిన సమాచారం ప్రకారం ఈ క్రింది ఏజెన్సీలు లైసెన్సు కలిగి 'యాక్టివ్' గా ఉన్నాయి. ఇవి కాకుండా దేశంలోని, రాష్ట్రంలోని పలు ఏజెన్సీల బ్రాంచీలు కూడా తెలంగాణలో పనిచేస్తున్నాయి. మరింత సమాచారం కోసం https://emigrate.gov.in/ext/raList.action వెబ్ సైటులో చూడవచ్చు. 1. షార్ప్ హూమన్ రీసోర్స్, సికిందరాబాద్ (మోహతేషాముద్దీన్ 040-66313922) 2. గ్లోబల్ ప్లేసెమెంట్స్, హైదరాబాద్ (ఎన్. శ్రీనివాస్ 040-23314054) 3. మాస్టర్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ (గుబ్బల సూర్యనారాయణ 040-27844266) 4. పి.ఎం.ఎస్ ట్రావెల్స్, హైదరాబాద్ (పోల్సాని శ్యామల 040-66368333) 5. రికీ ఇంటర్నేషనల్, హైదరాబాద్ (సంగీతా శీలేంద్ర సింగ్ 040-66759889) 6. అల్ మొహసిన్ టూర్స్, హైదరాబాద్ (అబ్దుల్ మజీద్ 040-66804545) 7. ప్లేసువెల్ హెచ్ఆర్డి కన్సల్టెంట్స్, హైదరాబాద్ (డి.శ్రీనివాస రెడ్డి 040-44360990) 8. అల్ ఆజమ్ టూర్స్, హైదరాబాద్ (మహ్మద్ సిరాజ్ ఖాన్ 040-66786111) 9. ట్రంప్స్ రిక్రూటింగ్ కన్సల్టెంట్స్, సికింద్రాబాద్ (ఎం.నాగరాజ్ 040-66888367) 10. మెహరాజ్ హూమన్ రీసోర్సెస్, హైదరాబాద్ (షకీల్ అహ్మద్ 040-23206000) 11. సౌమ్య ట్రావెల్ బ్యూరో, హైదరాబాద్ (నాగిరెడ్డి ప్రశాంతి 040-69000064) 12. హోప్ ప్లేసెమెంట్ రీసోర్సెస్, హైదరాబాద్ (అమీరుల్లా హుసేని 040-23398269) 13. గ్రీన్ వేస్ ట్రావెల్ సర్వీసెస్, హైదరాబాద్ (ఎస్ వై జాఫర్ హుసేన్ 040-66688857) 14. ఆర్బిట్ స్టాఫింగ్ ఇన్నోవిజన్, హైదరాబాద్ (ఈశ్వర్ సింగ్ యాదవ్ 040-23733329) 15. టాంకామ్, హైదరాబాద్ (కె వై నాయక్ 40-23342040) 16. ప్రొఫెషనల్ రిక్రూటర్స్, హైదరాబాద్ (మొహసిన్ పాషా ఖాద్రి 40-23303100) 17. అల్ మెహరాజ్ సర్వీసెస్, హైదరాబాద్ (జమీల్ అహ్మద్ 040-27429898) 18. శ్రీవాణి టూర్స్ అండ్ ట్రావెల్స్, హైదరాబాద్ (రోహిత్ గంట 040-60008379) 19. టి ఎస్ ఓవర్సేస్ కన్సల్టెంట్స్, హైదరాబాద్ (సయ్యద్ గౌస్ 040-29705234) 20. ఏషియన్ మ్యాన్ పవర్ సర్వీసెస్, హైదరాబాద్ (అబ్దుల్ సమీ 40-24472416) 21. డెక్కన్ వల్డ్ ట్రావెల్స్, హైదరాబాద్ (తజ్యీం కౌసర్ 040-23241207) 22. అల్ అహాయత్ టూర్స్, హైదరాబాద్ (సుమయ ఫాతిమా 040-24414577) 23. ఎక్సెల్ ప్లేస్మెంట్ సర్వీసెస్, హైదరాబాద్ (మహేందర్ సింగ్ 40-66661110) 24. ఓంక్యాప్, హైదరాబాద్ (పి. వెంకటరామి రెడ్డి 040-23300686) 25. జిటిఎం ఇంటర్నేషనల్, సికింద్రాబాద్ (చీటి కవిత 040-40071515) 26. ఎస్ ఎల్ ఇంటర్నేషనల్, మెటుపల్లి (గనవేని అంజయ్య 08725-236117) 27. బెస్ట్ మ్యాన్ పవర్ రిక్రూటింగ్, జగిత్యాల (పొట్టవత్తిని భరత్ 8724-297099) 28. మల్లికార్జున మ్యాన్ పవర్, జగిత్యాల (బుర్రవేణి తిరుపతి 08724-226566) 29. ఆర్ కె ట్రావెల్ బ్యూరో, మేటుపల్లి (దేవక్క రవి 08725-252041) 30. విహారీ మ్యాన్ పవర్, జగిత్యాల (బగ్గని మల్లేశ్వరి 08724-224411) 31. కార్తీక్ ఇంటర్నేషనల్, జగిత్యాల (తంగెళ్ల గంగారాం 08724-223004) 32. హన్సిక మ్యాన్ పవర్, జగిత్యాల (చిట్ల రమణ 08724-222277) 33. రమ్య మ్యాన్ పవర్, నిర్మల్ (జోషి వెంకట్రాజు 08734-245539) 34. శివ సాయి కన్సల్టెన్సీ, నిర్మల్ (నాగుల ప్రదీప్ గౌడ్ 08734-248819) 35. కె ఎస్ ట్రావెల్స్, భీంగల్ (నెల్లోల్ల రవీందర్ 08463-238525) 36. శ్రీ గీతాంజలి ట్రావెల్స్, నిజామాబాద్ (పి.గంగారెడ్డి 08462-225599) 37. కౌముది ఇంటర్నేషనల్, నిజామాబాద్ (ఛిల్మల కృష్ణ 08462-241212) 38. యు వి కన్సల్టెన్సీ, నిజామాబాద్ (దొడ్డి అర్చన 08462-255959) 39. సాత్విక ఇంటర్నేషనల్, నిజామాబాద్ (ఇస్సపల్లి సురేందర్ 08462-236355) 40. ఎ ఆర్ ఆర్ మ్యాన్ పవర్, వేములవాడ (షఫీ మహ్మద్ 08723-236777) 41. సుష్మా ఇంటర్నేషనల్, సిరిసిల్ల (కందుకూరి సాధిక 08723-231020) 42. ఆర్ జె మ్యాన్ పవర్, సిరిసిల్ల (ఎస్. దేవేందర్ 087232-33155) 43. డైమండ్ మ్యాన్ పవర్, హైదరాబాద్ (కోనాల బసివిరెడ్డి 040-29885244) 44. అహ్మద్ ఎంటర్ ప్రయిజెస్, హైదరాబాద్ (ఐజాజ్ అహ్మద్ 040-23563895) -మంద భీంరెడ్డి, అధ్యక్షులు, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం +91 98494 22622 -
ఎమిగ్రేషన్ బిల్లుపై సూచనలు కోరిన విదేశాంగ శాఖ
వివిధ మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక మండళ్లు (ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), విద్యా సంస్థలతో సంప్రదింపుల తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త ఎమిగ్రేషన్ బిల్ ముసాయిదాను ఖరారు చేసింది. 35 ఏళ్ల క్రితం ఏర్పాటయిన ఎమిగ్రేషన్ యాక్ట్-1983 స్థానాన్ని, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఎమిగ్రేషన్ బిల్-2019 భర్తీ చేయనున్నది. ప్రతిపాదిత ఎమిగ్రేషన్ బిల్-2019 ముసాయిదాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైటు https://mea.gov.in/emigrationbill.htm లో చూడవచ్చు. ముఖ్యమైన అంశాలపై 4 పేజీల నివేదిక, 51 పేజీల పూర్తి ముసాయిదాను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు ముసాయిదా బిల్లో వివిధ అంశాలపై వ్యాఖ్యలు, సలహాలు 20 జనవరి 2019లోగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ-మెయిళ్లు dsoia1@mea.gov.in, so2oia1@mea.gov.in కు పంపవచ్చు. కొత్త బిల్లు గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. -మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు +91 98494 22622 -
విదేశాలకు వెళ్లే కార్మికులకు శిక్షణ
పార్లమెంటులో ప్రవాస భారతీయం గల్ఫ్, మలేషియా తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ డిసెంబర్ 12న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడుకు చెందిన ఏఐడీఎంకే సభ్యుడు డా.సి.గోపాలక్రిష్ణన్, పి.నాగరాజన్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ – పీడీఓటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని మంత్రి వివరించారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం లక్ష్యమని వివరించారు. ఇప్పటివరకు 30వేల మంది కార్మికులకు పీడీఓటీ శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా ఈ శిక్షణను అందించాలని ఆయన కోరారు. కాన్సులార్ ఆక్సెస్.. భారత పౌరులు విదేశీ జైళ్లలో, నిర్బంధ కేంద్రాలలో (డిటెన్షన్ సెంటర్లు) ఉన్నప్పుడు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యా లయాలు స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ‘కాన్సులార్ ఆక్సెస్’ (భారత దౌత్య అధికారులను కలిసే అవకాశం) కల్పిస్తున్నామని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సభ్యుడు రవీంద్ర కుమార్ జెనా అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. 68 దేశాల జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు 68 దేశాలలోని వివిధ జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ వెల్లడించారు. పశ్చిమబంగకు చెందిన సీపీఎం సభ్యుడు బదరుద్దొజాఖాన్ అడిగిన ప్రశ్నకు డిసెంబర్ 19న మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని కఠినమైన గోప్యతా చట్టాల కారణంగా ఖైదీల సమాచారాన్ని వెల్లడించడం లేదని, 15 దేశాల జైళ్లలో శిక్ష అనుభవిస్తూ 40 మంది భారతీయ ఖైదీలు మృతిచెందారని తెలిపారు. ‘విదేశా ల్లోని భారతీయుల భద్రత, శ్రేయస్సు భారత ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యతలు. ప్రవాస భారతీయులు దాడులు, అగౌరవానికి గురైన సందర్భాలలో భారత దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండి జాగరూకతతో పర్యవేక్షిస్తాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం. ఉచితంగా సేవలు అందించే న్యాయవాదులు (ప్రోబోనో లాయర్స్) అందుబాటులో ఉన్న దేశాలలో ఖైదీలకు న్యాయ సహాయం అందజేస్తున్నాం’ అని మంత్రి వివరించారు. శిక్ష కాలం పూర్తయిన భారతీయ ఖైదీల విడుదలకు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ ప్రభుత్వాలకు చెందిన సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఎగ్జిట్ వీసాలు (దేశం విడిచి వెళ్లడానికి అనుమతి), జరిమానాల మాఫీ లాంటి పనులు వేగవంతంగా పూర్తిచేసి త్వరగా భారత్‌కు రప్పిస్తున్నామని పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలకు అవసరమైన సందర్భాలలో ఉచితంగా విమాన ప్రయాణ టికెట్లు సమకూరుస్తున్నామని వివరించారు. కాగా, గల్ఫ్‌లోని ఆరు దేశాల జైళ్లలో 4,705 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. –మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు -
రేపు దుబాయిలో రాహుల్ గాంధీ భారీ సభ
సాక్షి, దుబాయి : ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రేపు(శుక్రవారం) యూఏఈలో పర్యటించనున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మంద భీంరెడ్డి తెలిపారు. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4గంటలకు భారీ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని చెప్పారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని, ఉచిత ప్రవేశం కొరకు www.rginuae.com లో పేర్లు నమోదు చేసుకోవాలని మంద భీంరెడ్డి గల్ఫ్ ప్రవాసులకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని "గాంధీ 150 సంవత్సరాలు - భారతదేశం యొక్క ఆలోచన" అనే అంశంపై సభలో రాహుల్ ప్రసంగించనున్నారని భీంరెడ్డి పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలలో సెలవు దినమైన శుక్రవారం రోజున నిర్వహిస్తున్న ఈ సభలో పాల్గొనే కార్మికుల కోసం వారు నివసిస్తున్న లేబర్ క్యాంపుల నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరాల కోసం వాట్సప్ నెంబర్ +91 98494 22622కు సంప్రదించవచ్చని మందభీంరెడ్డి తెలిపారు. -
వలసలతోనే అభివృద్ధి, మానవ వికాసం
ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలసకార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత, అంతర్జాతీయంగావలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే) గా ప్రకటించింది. వలస అనేది భౌగోళికంగా లేదా రాజకీయ పరంగా నిర్ణయించిన రెండు సముదాయాల మధ్య జరిగే నివాస మార్పును తెలియజేస్తుంది. వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉంది. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో పునరేకీకరణ, స్థానభ్రంశం, సురక్షిత వలసలు, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలలో కీలకమైన రాజకీయ, విధానపర విషయాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. వలసలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ‘పుష్ ఫ్యాక్టర్’ అంటే.. వలస వెళ్లేలా నెట్టివేయబడే పరిస్థితులు. స్థానిక ప్రదేశంలోని అననుకూల పరిస్థితులు ప్రజలను బయటకు నెట్టివేస్తాయి. ఉదాహరణకు.. అణచివేసే చట్టాలు, అధిక పన్నుల భారం, మతకల్లోలాలు, అంతర్యుద్ధాలు, పేదరికం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రాజెక్టుల కోసం గ్రామాలను ఖాళీ చేయించడం (డిస్ప్లేస్మెంట్) అనే అంశాలు ప్రేరేపిస్తాయి. ‘పుల్ ఫ్యాక్టర్’ అంటే.. వలస వెళ్లేలా ఆకర్షింపబడే పరిస్థితులు. అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం, బాహ్య ప్రదేశంలోని అనుకూల పరిస్థితులు వారిని ఆకర్షిస్తాయి. సంపన్న దేశంలో మంచి జీతం కలిగిన ఉద్యోగం అంతర్జాతీయ వలసల శక్తివంతమైన ఆకర్షణకు కారణం. పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లేవారు కొందరు, మరింత మెరుగైన జీవితం కోసం, అధిక సంపాదన కోసం వెళ్లేవారు మరికొందరు. – మంద భీంరెడ్డి, అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర -
ఆమ్నెస్టీకి నమోదు చేసుకోండిలా..
దుబాయ్ : యూఏఈ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకాన్ని ఉపయోగించుకోదలచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్నార్టీ) వారి వెబ్ సైటు www.apnrt.com/uae లో నమోదు చేసుకోవాలని ఏపీ ఎన్నార్టీ దుబాయ్ కోఆర్డినేటర్ వాసు పొడిపిరెడ్డి కోరారు. ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం పొందడం సులువు అవుతుందని ఆయన అన్నారు. క్షమాభిక్ష పథకంలో సహాయం పొందగోరు వారు యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రాసల్ ఖైమా తదితర ప్రాంతాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చు. వారి వివరాలు : 1. వాసు పొడిపిరెడ్డి (దుబాయ్) +97152 6653567 2. జివివి సత్యనారాయణ (రాసల్ ఖైమా) + 97156 4270960 3. జెకెఎం షరీఫ్ షేక్ (అబుదాబి) +97152 2127786 4. రాజేష్ కుమార్ కొండెపు (దుబాయ్) +97158 2181785 5. అనురాధ వొబ్బిలిసెట్టి (దుబాయ్) +97150 4293402 6. జాఫర్ అలీ (దుబాయ్) +97150 5640923 7. ఖాదర్ బాషా షేక్ (దుబాయ్) +97150 4227865 8. మోత్కూరి విశ్వేశ్వర్ రావు (దుబాయ్) +97150 1815383 9. ముక్కు తులసి కుమార్ (దుబాయ్) +97158 2435489 10. రాజా రవికిరణ్ కోడి (దుబాయ్) +97150 7778599 11. శివ సుందర్ పట్నం (దుబాయ్) +97156 2275840 12. శ్రీకాంత్ చిత్తర్వు (దుబాయ్) +97155 6939320 13. సుధాకర్ సింగిరి (దుబాయ్) +97152 3825328 14. వంశీ కృష్ణ కొల్లి (దుబాయ్) + 97156 2622562 15. వేణు గుంటుపల్లి (దుబాయ్) +97156 5771796 16. నిరంజన్ కంచర్ల (దుబాయ్) +97150 9577411, 17. గుడాల భాగ్యనందం (షార్జా) +97150 3959677 మరిన్ని వివరాలకై ఏపీ ఎన్నార్టీ వారి ఇండియా హెల్ప్ లైన్ +91 86323 40678 లేదా వాట్సప్ +91 85000 27678 ను సంప్రదించవచ్చని ప్రవాసీ మిత్ర అధ్యక్షులు మందభీంరెడ్డి తెలిపారు. -
యూఏఈ క్షమాభిక్ష: సందేహాలు - సమాధానాలు
అక్రమ వలసదారులు ఎలాంటి జరిమానా, జైలుశిక్షలేకుండా తమ తమ దేశాలకు వెళ్లిపోవడానికి వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం 1 ఆగష్టు నుండి 31 అక్టోబర్ వరకు మూడు నెలలపాటు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించిన విషయం తెలిసిందే. క్షమాభిక్ష ఉపయోగించుకోవాలనుకునే ప్రవాసీలకు ఉపయోగపడే విధంగా గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న: యూఏఈ క్షమాభిక్ష-2018 పథకాన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి జవాబు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని ఏడు రాజ్యాలయిన అబుదాబి, దుబాయి, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఉమ్మల్ కోయిన్, ఫుజీరా లలో గల ఇమ్మిగ్రేషన్ (వలస) కేంద్రాలలో సంప్రదించాలి. ఏ ఎమిరేట్ (రాజ్యం) వీసా ఉన్నవారు అక్కడి ఇమ్మిగ్రేషన్ కేంద్రాలకు మాత్రమే వెళ్ళాలి. ప్రశ్న: జరిమానా పూర్తిగా మాఫీ చేస్తారా? నామమాత్రంగా చెల్లించాలా? జవాబు: గడువుమీరి ఎక్కువరోజులు ఉన్నoదుకు జరిమానా పడదు. కానీ, యూఏఈ ప్రభుత్వం కొంత ఫీజు వసూలు చేస్తుంది. ప్రశ్న: దేశంనుంచి బయిటకు వెళ్ళడానికి ఇచ్చే 'ఎగ్జిట్ పర్మిట్' పొందాలంటే ఎంత డబ్బు చెల్లించాలి ? జవాబు: 221 దిర్హములు (రూ.4 వేలు), వీసా రెగ్యులరైజ్ (క్రమబద్దీకరణ) చేసుకోవడానికి 521 దిర్హములు(రూ.9,400) చెల్లించాలి. ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందడానికి ఏ డాక్యుమెంట్లు (దస్తావేజులు) సమర్పించాలి జవాబు: ఒరిజినల్ పాస్ పోర్ట్ లేదా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (అవుట్ పాస్ అనబడే తెల్లరంగు తాత్కాలిక పాస్ పోర్టు), విమాన ప్రయాణ టికెట్టు దాఖలు చేయాలి. ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందిన తర్వాత ఎన్నిరోజులలోగా దేశం వదిలి పోవాలి జవాబు: 21 రోజులలోగా ప్రశ్న: 'ఎగ్జిట్ పర్మిట్' పొందడానికి ఎన్నిరోజులు అవుతుంది జవాబు: బయోమెట్రిక్ స్కానింగ్ అయిన వెంటనే ఇస్తారు ప్రశ్న: పాస్ పోర్ట్ పోగొట్టుకున్నసందర్భాలలో పోలీస్ క్లియరెన్స్ రిపోర్ట్ అవసరమా జవాబు: అవును. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఒకలెటర్ పొంది, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయానికి వెళితే వారు వీసా స్టేటస్ (స్థితి) ని తెలుపుతూ ఒక ప్రింట్ అవుట్ ఇస్తారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్, కోర్టుల నుండి స్టాంప్ వేయించుకోవాలి. చివరగా పోలీస్ స్టేషన్ లో "లాస్ట్ పాస్ పోర్ట్" (పాస్ పోర్ట్ పోయినది) అనే సర్టిఫికెట్ అరబిక్ భాషలో ఇస్తారు. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించుకొని ఇండియన్ ఎంబసీలో దరఖాస్తు చేసుకోవాలి. ఇండియన్ ఎంబసీ వారు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (అవుట్ పాస్ అనబడే తెల్లరంగు తాత్కాలిక పాస్ పోర్టు) ఇవ్వాలన్నా, యూఏఈ ప్రభుత్వం 'ఎగ్జిట్ పర్మిట్' ఇవ్వాలన్నా పోలీస్ క్లియరెన్స్ రిపోర్ట్ అవసరం. క్షమాభిక్ష సందర్బంగా ఈ ప్రక్రియను కొంత సరళతరం చేశారు. ప్రశ్న: యూఏఈ దేశంలోకి మళ్ళీ ప్రవేశించకుండా నిషేధం (నో ఎంట్రీ బ్యాన్) ఎన్నేళ్లు ఉంటుంది? ఈ బ్యాన్ కు ఎవరు గురవుతారు? జవాబు: సరైన పత్రాలు లేకుండా యూఏఈ దేశంలోకి అక్రమంగా ప్రవేశిచిన వారికి రెండేళ్ల బ్యాన్ విధిస్తారు. అత్యవసర పరిస్థితులలో దేశంవిడిచి వెళ్లేవారికి ఈ బ్యాన్ వర్తించదు. ప్రశ్న: కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నవారు 'క్షమాభిక్ష' పథకాన్ని ఉపయోగించుకోవచ్చా? జవాబు: లేదు. న్యాయస్థానం నుండి అనుమతి పొందిన తర్వాతనే 'క్షమాభిక్ష' పథకానికి అర్హులు. నిర్ణీత కాలానికంటే మించి ఉన్నవారి (ఓవర్ స్టేయర్స్) సమస్యలను మాత్రమే ఇమ్మిగ్రేషన్ వారు పరిగణలోకి తీసుకుంటారు. ప్రశ్న: యజమాని నుండి పరారీ (అబ్ స్కాండింగ్) అయినట్లు ఫిర్యాదు నమోదుకాబడ్డవారు అమ్నెస్టీ కోసం దరఖాస్తు చేయవచ్చా? జవాబు: కేసు వాస్తవాలను బట్టి, ఇమ్మిగ్రేషన్ అధికారులు 'అబ్ స్కాండింగ్' (పరారీ) రిపోర్ట్ ను తొలగించి, ఎలాంటి బ్యాన్ (నిషేధం) లేకుండా ఎగ్జిట్ పర్మిట్ (వెళ్లిపోవడానికి అనుమతి) జారీ చేయవచ్చు. ప్రభుత్వ సంస్థలు 'అబ్ స్కాండింగ్' ఫిర్యాదు దాఖలు చేసినట్లయితే 71 దిర్హములు, వ్యక్తులయితే 121 దిర్హములు, కంపెనీ అయితే 521 దిర్హముల ఫీజు చెల్లించాలి. ప్రశ్న: 'అబ్ స్కాండింగ్' (పరారీ) గా నమోదుకాబడ్డవారు దాని తొలగింపు (క్లియరింగ్)కు ఎవరిని సంప్రదించాలి? జవాబు: ఏ ఎమిరేట్ (రాజ్యం)లో వీసా పొందారో అక్కడే ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో సంప్రదించాలి. ప్రశ్న: స్పాన్సర్ (యజమాని) జాడలేని సందర్భాలలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్లేముందు ఏం చేయాలి? జవాబు: 'లేబర్ కార్డు'ను రద్దు చేసుకున్న తర్వాత ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళాలి. ప్రశ్న: ఉద్యోగి పాస్ పోర్ట్ ను స్పాన్సర్ (యజమాని) ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో జమచేసిన సందర్భాలలో పాస్ పోర్ట్ ను పొందడం ఎలా? జవాబు: ఇలాంటి కేసులలో, కంప్యూటర్ డేటాబేస్ లో వెతికిన తర్వాత ఆ ఉద్యోగిని సంబందిత ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి వెళ్ళమని సూచిస్తారు. అక్కడ పాస్ పోర్టు ఇవ్వబడుతుంది. మరింత సమాచారం కోసం 'ప్రవాసి మిత్ర' హెల్ప్ లైన్ వాట్సప్ నెంబర్ +91 98494 22622 లేదా mbreddy.hyd@gmail.com కు సంప్రదించవచ్చు. -
గల్ఫ్ ఏజెన్సీ లైసెన్సులపై విదేశాంగశాఖ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : గల్ఫ్ తో సహా 18 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులను భర్తీ చేయడానికి అవసరమైన రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సు పొందడం ఎలా అనే విషయంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశం కానున్నారు. మే 1 న ఉదయం 10 గం.లకు హైదరాబాద్ నాంపల్లి లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఈ) కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. భారత దేశంలో 1200 పైచిలుకు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 500 వరకు ముంబైలో, మిగతావి ఇతర మెట్రో నగరాలలో ఉన్నాయని భీంరెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని రిజిస్టర్డ్ ఏజెన్సీలు లేకపోవడం వలన ఆశావహులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. పలువురి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీల బ్యాంకు గ్యారంటీ రూ.50 లక్షలు చెల్లించే స్థోమతలేనివారి కోసం రూ.8 లక్షల బ్యాంకు గ్యారంటీతో చిన్న ఏజెన్సీల లైసెన్సు కూడా పొందవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. -
ఎన్ఆర్ఐలు.. బ్యాంకు అకౌంట్లు
ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత దేశంలో పలు రకాల బ్యాంకు ఖాతాలు కలిగి ఉండవచ్చు. ఎన్ఆర్ఇ (నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్) సేవింగ్స్ అకౌంట్ : ఎన్ఆర్ఇ అకౌంట్‌ను భారత కరెన్సీలో నిర్వహించుకోవచ్చు. ఈ ఖాతాలోకి విదేశాల నుండి విదేశీ మారక ద్రవ్యం ద్వారా మాత్రమే డబ్బు జమచేయవచ్చు. తన సంపాదనను ఇందులోకి బదిలీ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ ఖాతాలోని డబ్బును తాను నివసిస్తున్న దేశానికి వాపస్ (రిపాట్రియేట్) తీసికెళ్ళవచ్చు. ఇద్దరు ఎన్ఆర్ఐలు కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) సేవింగ్స్ అకౌంట్ : ఎన్ఆర్ఓ అకౌంట్‌ను భారత దేశంలోని లావాదేవీల కొరకు ఉపయోగించవచ్చు. భారత్ లో వచ్చిన ఆదాయాన్ని ఇందులో జమ చేసుకోవచ్చు. ఈ ఖాతా ద్వారా వచ్చే ఆదాయం పై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖాతాలోని డబ్బు ద్వారా వచ్చిన వడ్డీని తాను నివసిస్తున్న దేశానికి వాపస్ (రిపాట్రియేట్) తీసికెళ్ళవచ్చు. అసలు ను కొన్ని నిబంధనలకు లోబడి వాపస్ తీసికెళ్ళవచ్చు. ఇద్దరు ఎన్ఆర్ఐలు లేదా ఒక ఎన్ఆర్ఐ తోపాటు భారత్ లో ఉన్న మరొకరితో కలిసి జాయింట్ ఖాతా తెరవవచ్చు. ఎఫ్ సి ఎన్ ఆర్ డిపాజిట్ అకౌంట్: పారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ ఖాతాలను అమెరికన్ డాలర్, బ్రిటన్ పౌండ్, యూరో, స్విస్ ప్రాంక్, సింగపూర్ డాలర్, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, హాంగ్ కాంగ్ డాలర్, జపాన్ యెన్ లాంటి 9 విదేశీ కరెన్సీలలో నిర్వహించుకోవచ్చు. ఆర్ ఎఫ్ సి (రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ) అకౌంట్: ఎన్ఆర్ఐలు భారత దేశానికి వాపస్ వచ్చిన సందర్భంలో వారి ''ఎన్ఆర్ఐ హోదా'' కోల్పోతారు. ఈ సందర్భంలో వారు ఈ ఖాతా ను తెరవవచ్చు. అమెరికన్ డాలర్, బ్రిటిష్ పౌండ్ లలో ఈ ఖాతాను నిర్వహించుకోవచ్చు. మళ్ళీ ఎన్ఆర్ఐ హోదా పొందిన తర్వాత ఈ ఖాతాలో డబ్బును ఎంఆర్ఇ లేదా ఎఫ్ సి ఎన్ ఆర్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. -మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com -
ఎన్ఆర్ఐలు ఓటర్లుగా నమోదు కావచ్చు
సాక్షి, హైదరాబాద్ : 2010లో సవరించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) భారత దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఎన్ఆర్ఐలు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్ పోర్ట్‌లో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎ లో తమ దరఖాస్తులను సమర్పించాలి. స్వయంగా, పోస్ట్ ద్వారా లేదా http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కలర్ ఫోటో, స్వయంగా ధ్రువీకరించిన (సెల్ఫ్ అటెస్టెడ్) పాస్ పోర్ట్, వీసా పేజీ కాపీలను జతచేయాలి (అప్ లోడ్) చేయాలి. స్వయంగా దరఖాస్తు చేసిన సందర్భంలో అధికారికి ఒరిజినల్ పాస్ పోర్ట్ చూపించాలి. దరఖాస్తు చేసిన తర్వాత భారత దేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఏడు రోజులవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. స్వయంగా వచ్చి ఓటేయాలి " ఓవర్సీస్ ఎలక్టర్స్" (ఎన్ఆర్ఐ ఓటర్లు) గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్ కు స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరికి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయరు కాబట్టి, ఒరిజినల్ పాస్ పోర్ట్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్ ఎన్ఆర్ఐలు పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్, ప్రాగ్జీ (ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) పద్ధతులు లేదా ఎంబసీల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే ఎన్ఆర్ఐలు భారత ఎన్నికలను ప్రభావితం చేయగలరు. ఆరు నెలలు లేకుంటే ఓటరు తొలగింపు ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఏ ఓటరయినా ఆ చిరునామాలో ఆరు నెలలు నివసించకపోతే పేరును ఓటరు జాబితా నుండి తొలగిస్తారు. సైన్యం, భద్రతా దళాలతో పనిచేసే వారికి మినహాయింపు ఉన్నది. 2010 చట్ట సవరణ ప్రకారం ఎన్ఆర్ఐలకు కూడా మినహాయింపు ఇచ్చారు. మరిన్ని వివరాలకు కేంద్ర ఎన్నికల సంఘం http://eci.nic.in వెబ్ సైటు లేదా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం http://ceotelangana.nic.in/ వెబ్ సైటు ను సందర్శించవచ్చు. - మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు -
76 దేశాల జైళ్లలో భారతీయ ఖైదీలు..
2017 డిసెంబర్ 28 వరకు తమవద్ద ఉన్న సమాచారం మేరకు 76 దేశాలలోని జైళ్లలో 7,985 మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ జనవరి 3న లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల స్థితిగతుల గురించి లోక్‌సభ సభ్యులు నినాంగ్ ఎరింగ్, కైలాష్ ఎన్ సింగ్ దేవ్, జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)లు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని గోప్యతా చట్టాల వల్ల జైళ్లలో ఉన్నవారి వివరాలు తెలియడం లేదు. ఆరు అరబ్ దేశాల గల్ఫ్ సహకార మండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ – జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియాలో 2,229, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 1,628, కువైట్‌లో 506, ఖతార్‌లో 196, బహ్రెయిన్‌లో 77, ఒమన్‌లో 60 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాల జైళ్లలోనే 58 శాతానికి పైగా 4,696 మంది ఉన్నారు. మలేషియాలో 341, సింగపూర్‌లో 115, నేపాల్‌లో 859, పాకిస్తాన్లో 395, థాయిలాండ్‌లో 47, యూకేలో 376, యఎస్‌లో 343 మంది జైళ్లలో ఉన్నారు. వీరిలో శిక్షా కాలం పూర్తయిన వందలాది మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. జరిమానాలు చెల్లించనందున కొందరు, సాంకేతిక కారణాల వలన మరి కొందరు జైళ్లలో, డిటెన్షన్ సెంటర్ల (నిర్బంధ కేంద్రాలు)లో మగ్గుతున్నారు. పరాయిదేశం, తెలియని భాష, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో తప్పులుచేసి జైలు పాలైనవారు కొందరున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశంలో ప్రమాదాలకు కారకులైనవారు, గొడవలు, ఆర్థికపరమైన మోసాలు, ఇతర మోసాలు, మద్యం సేవించడం, మద్యం వ్యాపారం, జూదం, లంచం, వీసా నిబంధనలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, ఫోర్జరీ లాంటి కేసులలో కొందరు జైళ్లలో మగ్గుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా, సెక్స్, వ్యభిచార నిర్వహణ, దొంగతనాలు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాలలో జైలు పాలైన వారూ ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు, తాము ఏ దేశానికి, ఏం పనిపై వెళుతున్నారు, ఆ దేశ చట్టాలు, ఆచార వ్యవహారాలూ, పద్ధతులు తెలుసుకొని అవగాహనతో వెళ్లడం మంచిది. ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్షలు ఖరారు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మెలగాలి. గల్ఫ్ నుంచి భారత్‌కు బదిలీకి ఎదురుచూస్తున్న ఖైదీలు ఖైదీలను స్వదేశానికి తీసుకువచ్చే చట్టం 2013 (రిపాట్రియేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 2013) ప్రకారం ఇప్పటివరకు 170 దరఖాస్తులు వచ్చాయని 62 మంది విదేశీ జైళ్ల నుంచి భారత్ జైళ్లకు బదిలీ అయ్యారని మంత్రి తెలిపారు. భారత్ ఇప్పటివరకు 30 దేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకున్నదని అన్నారు. ఇవికాకుండా ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్‌ను ఆమోదించిన సభ్య దేశాలతో భారతదేశం ఖైదీల బదిలీకి అభ్యర్థనలు పంపడానికి, స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నది. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. అప్పటి భారత హోంమంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, హోం మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహయాన్‌లు ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు చేశారు. 2015 మార్చి 25న ఖతార్‌తో కూడా ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. ఈ రెండు గల్ఫ్ దేశాల ఒప్పందాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్ అనే ఏడు రాజ్యాలలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 1,628 మందిలో శిక్షపడిన వందలాది మంది భారతీయ ఖైదీలతో పాటు ఖతార్‌లోని 196 మందికి ఈ ఒప్పందం వలన లాభం కలుగుతుంది. వీరు మిగిలిన శిక్ష కాలాన్ని తమ ఇష్ట ప్రకారం భారత్ జైళ్లలో పూర్తిచేసుకోవచ్చు. వీరిలో 40 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. భారత్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒకే ఒక్క యూఏఈ పౌరుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతీయ ఖైదీలు తమ స్వదేశానికి బదిలీ అయితే తమ కుటుంబ సభ్యులను కలుసుకొని స్వాంతన పొందే అవకాశం ఉంది. విదేశీ జైళ్లలో మగ్గుతున్న పేద ప్రవాసీ కార్మికులకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం అందించాలి. చిన్నపాటి జరిమానాలను చెల్లించి వారి విడుదలకు కృషి చేయాలి. గల్ఫ్ జైళ్లలో ఉన్న మలయాళీలను విడిపించడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతేక నిధిని కేటాయించింది. సంవత్సరాల తరబడి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. నొప్పి నివారణ మాత్రలు, గసగసాలు కలిగి ఉన్నందుకు 24 ఏళ్ల జైలు శిక్షకు గురై దుబాయి జైలులో మగ్గుతున్న తెలుగువారు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మన కార్మికులకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. –మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com -
ఆశలు రేపుతున్న ఎన్నారై విధానం
సందర్భం సొంత గడ్డపై మమకారం ఉన్నప్పటికీ బతుకు కోసం దేశాలు పట్టిన తెలంగాణ వాసుల తీరని వ్యథలకు పరిష్కారం చూపే విధానమే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ. తెలంగాణ నుంచి గల్ఫ్‌కు వెళుతున్న వలస కార్మికుల చిరకాల ఆశలు దీంతో ఫలించనున్నాయి. పనికి తగిన వేతనాలు లేక, సరైన జీవన ప్రమాణాలులేని నివాస సౌకర్యాలు, యజమానుల వేధింపులు, భద్రతలేని పనిప్రదేశాల వలన తరచూ ప్రమాదాలకు గురికావడం, అనారోగ్యం లాంటి సమస్యలను మన గల్ఫ్ వలస కార్మికులు తరచూ ప్రస్తావిస్తుంటారు. జైలు పాలయినప్పుడు న్యాయ సహాయంకోసం, చనిపోయినప్పుడు శవపేటికల రవాణాకు రోజులకొలది వేచిచూడడం సర్వసాధారణం. గల్ఫ్ దేశాలలో ఏర్పడే సంక్షోభాల ప్రభావం మనదేశ కార్మికలోకంపై పడుతున్నది. కంపెనీలు మూతపడి మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించడం, యుద్ధాలు, దురాక్రమణలు, అంతర్గత సంక్షోభం, గల్ఫ్ దేశాల్లో తరచుగా ప్రకటించే ‘ఆమ్నెస్టీ’ (క్షమాభిక్ష) పథకాలు, సౌదీ అరేబియాలో ఉద్యోగాల సౌదీకరణ, చమురు ధరల పతనం, ఇటీవలి ఖతార్ వెలి లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారి వాటి ప్రభావం నేరుగా మన పల్లెలపై, ప్రవాసీ కుటుంబాలపై కనిపిస్తున్నది. మనవారు ఉద్యోగాలు కోల్పోయి అర్ధంతరంగా ఇంటికి చేరడం లాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి మనవారిని రక్షించడానికి, ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు కలిగి ఉంటే మేలు. ప్రవాసీల సంక్షేమం, రక్షణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్న ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) కోసం రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గల్ఫ్ వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘తెలంగాణ ప్రవాసుల సంక్షేమం’ పేరిట 2014 లో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల క్రమంలో ఎన్నారై శాఖ మంత్రి కె. తారక రామారావు అధ్యక్షతన 27 జులై 2016న హైదరాబాద్‌లో విస్తృతస్థాయి ఎన్నారై పాలసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని సూచనల ప్రకారం ముసాయిదా పత్రాన్ని తయారుచేసి వివిధ ప్రభుత్వ శాఖలకు పంపి వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించారు. విదేశాలకు వలసవెళ్లే కూలీలు, ఉద్యోగులు, వృత్తి నిపుణులు, విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించే వైఖరిని ఒక సమగ్రమైన రూపంలో తెలిపేదే ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం). అల్పాదాయ కార్మికులను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రవాస భారతీయుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కొంత ప్రభుత్వం, కొంత వృత్తి నిపుణులు, పారిశ్రామికవేత్తలు తదితరుల నుండి విరాళాలు సేకరించి ఈ నిధికి జమచేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్దిపొందని పేదకార్మికులను ఆదుకోవడానికి, ఎక్స్‌గ్రే షియా చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు. విదేశాల్లో మరణించినవారి శవపేటికలను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాల వరకు రవాణాకు ఉచిత అంబులెన్సు సౌకర్యం. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు. కేంద్ర ప్రభుత్వ ‘ముద్ర’ పథకంతో అనుసంధానం. గల్ఫ్ నుండి వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన. కొత్తగా వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి మార్జిన్ మనీ, రుణ సౌకర్యం కల్పించడం. జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. హైదరాబాద్‌లో ఎన్నారై భవన్ ఏర్పాటు. తెల్ల రేషన్ కార్డులు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ రుణాలు, గృహనిర్మాణం వంటి పథకాల వర్తింపుకు చర్యలు. 24 గంటల హెల్ప్ లైన్. విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు ‘ప్రవాసి తెలంగాణ’ వెబ్ పోర్టల్ ఏర్పాటు. ధనవంతులైన ఎన్నారైలు తమ గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహం. సంక్షేమానికి తగిన బడ్జెట్ కేటాయింపులు. ప్రవాసీల గణాంకాలు తయారుచేయడం. రాష్ట్ర విదేశీ ఉద్యోగాల కల్పనా సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్‌ను బలోపేతం చేయడం. ప్రభుత్వ పరంగా మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా అత్యున్నత స్థాయి వ్యవస్థ తెలంగాణ ప్రవాస భారతీయుల మండలి ఏర్పాటు చేయనున్నారు. ప్రవాసుల సంక్షేమం గురించి ప్రభుత్వ విధానాలపై అన్ని విధాలా మార్గదర్శనం చేయడం ఈ కౌన్సిల్ ముఖ్యమైన విధి. ఎన్నారై శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా ఉంటారు. ప్రవాసి తెలంగాణా సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులను కూడా సభ్యులుగా చేర్చాలనే సూచనలు ఉన్నాయి. ‘సెంటా’ అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల కేంద్రం. దీనికి ఎన్నారై మంత్రి ప్రభుత్వ అధినేతగా, ప్రభుత్వ అధికారి అయిన సీఈఓ పరిపాలన అధినేతగా వ్యవహరిస్తారు. ఈ కేంద్రం ఎన్నారైల సమస్యలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఒక కార్యనిర్వాహక సంస్థగా పనిచేస్తుంది. ‘డి–సెంటా’ అంటే.. తెలంగాణా ప్రవాస భారతీయుల వ్యవహారాల జిల్లా కేంద్రం. దీనికి జిల్లా కలెక్టర్ అధినేతగా ఉంటారు. జిల్లా కార్మిక సంక్షేమ అధికారి జనరల్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, కార్మిక, ఉపాధి కల్పన శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానికి వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి ‘ప్రవాసి తెలంగాణ దివస్’ ను జరుపుతారు. తెలంగాణ ఎన్నారైల సమస్యలను చర్చించడానికి, వారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలం దించిన తెలంగాణ ఎన్నారైలకు ‘ఉత్తమ తెలంగాణ ప్రవాసి’ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమల శాఖ పెట్టుబడుల సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఎన్నారై విధానం ప్రకటిస్తే ప్రవాసులకు ఊరట లభిస్తుంది. పలు కారణాలతో గల్ఫ్‌లో మరణించి శవపేటికల్లో ఇంటికి చేరుతున్నవారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడం, తిరిగొచ్చినవారి కోసం పునరావాసం, ఏజెంట్ల మోసాలు అరికట్టడం, ప్రవాసుల పేర్లను రేషన్ కార్డుల్లో కొనసాగించి పలు సామాజిక పథకాలకు అర్హత పొందేలా చేయడం, నైపుణ్య శిక్షణ, జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్లతో కూడిన పథకం అందుబాటులోకి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రవాసులు. మంద భీంరెడ్డి వ్యాసకర్త వలస వ్యవహారాల విశ్లేషకులు ‘ 93944 22622 -
తెలంగాణ గల్ఫ్ జేఏసీ ఆవిర్భావం
► ప్రవాసీలను ఆదుకోవడమే లక్ష్యం: కన్వీనర్ భీమ్‌రెడ్డి సాక్షి, వేములవాడ: ప్రవాసీ భారతీయులను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ గల్ఫ్ జేఏసీ ఆవిర్భవించిందని ఆ సంస్థ కన్వీనర్ మంద భీమ్‌రెడ్డి, నాయకులు నంగి దేవేందర్‌రెడ్డి, నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్స వం, గల్ఫ్‌లో కార్మికులకు సెలవు దినం కావడంతో శుక్రవారం ఈ సంస్థకు అంకురార్పణ చేశామని వెల్లడించారు. శుక్రవారం వారు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ప్రవాసీ సంఘాలు, నిపుణులైన ప్రముఖులు, నిర్ణయాత్మకమైన గ్రూపులతో కలిసి జేఏసీ పనిచేస్తుందని చెప్పారు. స్వరాష్ట్రం సాధించుకున్నా వలసకా ర్మికుల గురించి పట్టించుకోవడం లేదని, అందుకే జేఏసీ తరఫున గల్ఫ్ కార్మి కుల హక్కుల రక్షణ, సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని అన్నారు. చట్టబద్ధ వలసలు, పెన్షన్, బీమా, పరిహారం చెల్లింపు, న్యాయ సలహాలు, పునరావాసం కల్పన తదితర అంశాల్లో బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి సుమారు 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారని, వారి ద్వారా చేకూరే విదేశీ మారకంతో ద్వారా మనదేశం పెట్రోలియం ఉత్పతులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయన్నారు. ప్రవాసీ భారతీయుల కుటుంబాలు చేసే ఖర్చు ద్వారా కూడా ప్రభుత్వానికి పన్ను రూపేణా ఏటా రూ.2 వేల కోట్లు సమకూరుతున్నాయని తెలిపారు. అయినా గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడంలేదని విమర్శించారు. అందుకే తాము ముందుకు వస్తున్నామని వారు చెప్పారు.