సాక్షి, హైదరాబాద్ : 2010లో సవరించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 లోని సెక్షన్ 20-ఎ ప్రకారం 18 సంవత్సరాలు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) భారత దేశంలో ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఎన్‌ఆర్‌ఐలు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్ పోర్ట్‌లో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం 6-ఎ లో తమ దరఖాస్తులను సమర్పించాలి.
స్వయంగా, పోస్ట్ ద్వారా లేదా http://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కలర్ ఫోటో, స్వయంగా ధ్రువీకరించిన (సెల్ఫ్ అటెస్టెడ్) పాస్ పోర్ట్, వీసా పేజీ కాపీలను జతచేయాలి (అప్ లోడ్) చేయాలి. స్వయంగా దరఖాస్తు చేసిన సందర్భంలో అధికారికి ఒరిజినల్ పాస్ పోర్ట్ చూపించాలి. దరఖాస్తు చేసిన తర్వాత భారత దేశంలోని చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఏడు రోజులవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు.
స్వయంగా వచ్చి ఓటేయాలి
" ఓవర్సీస్ ఎలక్టర్స్" (ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు) గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్ కు స్వయంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వీరికి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేయరు కాబట్టి, ఒరిజినల్ పాస్ పోర్ట్ చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి.
పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్
ఎన్‌ఆర్‌ఐలు పోస్టల్ బ్యాలెట్, ఈ-బ్యాలెట్, ప్రాగ్జీ (ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) పద్ధతులు లేదా ఎంబసీల ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాలను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే ఎన్‌ఆర్‌ఐలు భారత ఎన్నికలను ప్రభావితం చేయగలరు.
ఆరు నెలలు లేకుంటే ఓటరు తొలగింపు
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఏ ఓటరయినా ఆ చిరునామాలో ఆరు నెలలు నివసించకపోతే పేరును ఓటరు జాబితా నుండి తొలగిస్తారు. సైన్యం, భద్రతా దళాలతో పనిచేసే వారికి మినహాయింపు ఉన్నది. 2010 చట్ట సవరణ ప్రకారం ఎన్‌ఆర్‌ఐలకు కూడా మినహాయింపు ఇచ్చారు.
మరిన్ని వివరాలకు కేంద్ర ఎన్నికల సంఘం http://eci.nic.in వెబ్ సైటు లేదా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం http://ceotelangana.nic.in/ వెబ్ సైటు ను సందర్శించవచ్చు.
- మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment