
ప్రభుత్వ భూమిలో నిర్మించారని 9 ఇళ్లు కూల్చివేత
టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో విధ్వంసం
కట్టుబట్టలు, చంటి బిడ్డలతో రోడ్డునపడ్డ కుటుంబాలు
శాంతిపురం: టీడీపీకి ఓటు వేయలేదనే అనుమానంతో ఆ పార్టీ నేతలు పన్నిన కుట్రను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇళ్లు కట్టారంటూ 9 ఇళ్లను కూల్చివేసి, ఆయా కుటుంబాలను నిర్వాసితులను చేశారు. బాధితుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సంతూరు సమీపంలోని చెల్దిగాని చెరువు పక్కన మిట్టపై 9 కుటుంబాలు ఇళ్లు కట్టుకుని పాతికేళ్లుగా నివసిస్తున్నాయి. వీరిలో దళితులైన గణేష్, అశ్వత్, సోమశేఖర్, మంగమ్మ, భవానీ కుటుంబాలతో పాటు బీసీలైన నారాయణప్ప, కనకమ్మ, కావలి నారాయణప్ప, నరసింహులు కుటుంబాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో వీరి ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే అనుమానంతో అధికార పార్టీ నాయకులు వీరిని టార్గెట్ చేశారు. వారి ఇళ్లకు కరెంటు, నీటి సదుపాయాలను ఇప్పటికే తొలగించారు. బాధితులు కలెక్టర్, కడ పీడీ, శాంతిపురం తహసీల్దార్, ఎంపీడీవోలను కలిసి గోడును వెళ్లబోసుకున్నారు. మరోచోట ఇంటి స్థలాలు కేటాయిస్తే అక్కడికి వెళ్లిపోతామని మొరపెట్టుకున్నారు.
కానీ 48 గంటల్లో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులిచ్చిన అధికారులు గడువు తీరగానే కూల్చివేతలకు పూనుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పోలీసుల భద్రత నడుమ రెండు జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూల్చేశారు. ఇళ్లలోని వస్తువులు, ధాన్యం అంతా మట్టి పాలు చేశారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లాపాపలు, వృద్ధులతో సహా వీధిన పడ్డాయి.
సీఎం నియోజకవర్గంలో ఇంత దౌర్జన్యమా
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో దళితులు, పేదలపై అధికారుల జరిపిన దౌర్జన్యకాండను వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షడు కోదండరెడ్డి, మండల కన్వినర్ బుల్లెట్ దండపాణి, రెస్కో మాజీ చైర్మన్ చక్రపాణిరెడ్డి, నాయకులు సైపుల్లా, కావలి వెంకటరమణ, గజ్జల రమేష్, చలపతి ఖండించారు. బాధితులను పరామర్శించిన అనంతరం అక్రమ నిర్మాణం పేరుతో ఇళ్లను కూల్చిన అధికారులు మండల, నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చర్యను కొనసాగించగలరా అని ప్రశ్నించారు.
పిల్లలు, వృద్ధులకు నిలువ నీడ లేకుండా చేసి రాక్షసత్వం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటివరకూ పునరావాస ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించారు.
ఎలా బతకాలి
రోడ్డు ప్రమాదంలో భర్త, నాన్న చనిపోయారు. ముసలి వాళ్లైన అమ్మ మంగమ్మ, అమ్మమ్మ, వికలాంగుడైన కొడుకుతో కుటుంబాన్ని లాక్కొస్తున్నాను. రోజూ కూలికి పోతేనే ఇల్లు గడుస్తుంది. పైసా పైసా కూడబెట్టుకుని రేకుల ఇల్లు కట్టుకుంటే దిక్కులేని వాళ్లమనే కనికరం లేకుండా కూల్చేశారు. ఇప్పుడు మేం ఎలా బతకాలి?. ఎక్కడ తలదాచుకోవాలి?. – అశ్వని, బాధితురాలు
అడవుల పాల్జేశారు
ఓటు వేయలేదనే అనుమానంతో మా ఇంటిని కూలదోసి ఏమీ లేకుండా చేశారు. మతిస్థిమితం లేకుండా తన లోకాన తాను తిరిగే భర్త. స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బిడ్డలతో బతుకుతున్నా. కూలి పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తుంటే మా నోట్లో మట్టి కొట్టారు. మమ్మల్ని అడవుల పాలు చేశారు. – శారదమ్మ, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment