
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్, ఆయన బంధువుల ఇళ్ల కూల్చివేత
టీడీపీకి తాను ఓటేసేది లేదని చెప్పడంతో అరాచకం
కోరం లేకున్నా వైస్ చైర్మన్ కుర్చీ కోసం అడ్డదారులు
నేడు వైస్ చైర్మన్ ఎన్నిక
నర్సరావుపేట : టీడీపీ నేతలు బరితెగించారు. పిడుగురాళ్ల వైస్ చైర్మన్ కుర్చీని కుట్రలతో దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అధికారుల సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఇంటిని కూల్చివేశారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనుంది. కూటమి ప్రభుత్వానికి కోరం లేకున్నా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలతో, దౌర్జన్యాలతో లోబరుచుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీకి మద్దతిచ్చేది లేదని 29వ వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీరా సైదావలి తేల్చి చెప్పడంతో ఆదివారం టీడీపీ నేతలు బరితెగింపునకు పాల్పడ్డారు. కౌన్సిలర్ ఇంటితో పాటు, ఆయన బంధువుకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇంటిని మున్సిపల్ అధికారులను అడ్డుపెట్టుకుని పొక్లెయిన్‌తో కూల్చివేయించారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, శానిటేషన్ సిబ్బందితో పాటు టీడీపీకి చెందిన రాయపాటి సాంబశివరావు, షేక్ ఇంతియాజ్ తదితరులు, ఆ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని దగ్గరుండి మరీ రెండు ఇళ్లను కూల్చివేయించారు.
ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారి హృదయరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇళ్ల కూల్చివేత ఘటన తనకు తెలియదని, ఆదివారం తాను విధుల్లో లేనని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.
ఇప్పటికే రెండు సార్లు అరాచకాలు
పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 33 వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. చైర్‌పర్సన్‌గా కొత్త వెంకటసుబ్బారావు, వైస్ చైర్మన్‌లుగా కొమ్ము ముక్కంటి, షేక్ నసీమా జైలాబ్దిన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ముక్కంటి మృతితో ఈ నెల 3న వైఎస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ జీవో ఇచ్చింది.
అయితే, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి రానివ్వకుండా పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు అడ్డుపడటంతో ఎన్నిక 4వ తేదీకి వాయిదా పడింది. 4వ తేదీ కూడా టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఇళ్ల వద్ద ఉండి ఇళ్లల్లోంచి వారిని బయటకు రానివ్వకుండా అడ్డుపడ్డార‡ు. దీంతో మళ్లీ సోమవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment