వలసపక్షులకు ఓటు హక్కు | Vote for NRI | Sakshi
Sakshi News home page

వలసపక్షులకు ఓటు హక్కు

Published Tue, Jan 20 2015 1:23 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

వలసపక్షులకు ఓటు హక్కు - Sakshi

వలసపక్షులకు ఓటు హక్కు

 ఈ దేశంలో పుట్టి ఇక్కడే పెరిగి... ఉపాధి కోసమో, మరింత ఉన్నతమైన జీవితం కోసమో పరాయి దేశాలకు వలసవెళ్లినవారికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ హక్కును కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికిచ్చిన ఆదేశం ప్రవాస భారతీయు(ఎన్నారై)లకు ఎంతో సంతోషం కలిగించి ఉంటుంది. ఈ ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణంలో తమకూ చోటివ్వాలని, తమ స్వరాన్ని కూడా వినాలని ఎన్నారైలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వారి కృషి ఫలించి అయిదేళ్లక్రితం ఆనాటి యూపీఏ సర్కారు భారత పాస్‌పోర్టు కలిగివున్న ఎన్నారైలకు ఇక్కడి ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు కూడా వచ్చాయి. ప్రవాసులు తమ స్వస్థలాల్లో ఓటర్ల జాబితాలో చేరేందుకు వీలు కల్పిస్తూ 2011లో నోటిఫికేషన్ జారీచేసింది. పర్యవసానంగా నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 11,328మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారు. అయితే, వివిధ దేశాల్లో దాదాపు కోటిమంది ఎన్నారైలున్నారన్న సంగతిని గుర్తుంచుకుంటే ఓటు హక్కు వినియోగించుకున్నవారి సంఖ్య ఎంత స్వల్పంగా ఉన్నదో అర్ధమవుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వ్యయప్రయాసలకోర్చి రావడం అందరికీ సాధ్యం కాకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎన్నారైలు ఉన్నచోటే ఉండి తమ తమ స్వస్థలాల్లోని నియోజకవర్గాల్లో నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసేందుకు అవకాశం కలుగుతుంది. ఎనిమిది వారాల్లో ఎన్నారైలకు ఈ-ఓటింగ్ హక్కు కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో కేంద్రానికి సూచించింది. మరో పిటిషన్‌పై విచారణ సందర్భంగా దేశంలో ఒకచోటునుంచి మరోచోటుకు వెళ్లాల్సివచ్చిన పౌరులకు కూడా ఇదే తరహా హక్కులు కల్పించే విషయమై అభిప్రాయమేమిటో చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది.

 ఉన్న ఊరునూ, కన్నతల్లినీ విడిచి వెళ్లవలసి వచ్చేవారు ఎవరైనా వలస పక్షులే. అలా వలస వెళ్లేవారు దేశంలోనే మరో రాష్ట్రానికి వెళ్తున్నారా...దేశం విడిచి వెళ్తున్నారా అనేది అంత పరిగణించాల్సిన అంశం కాదు. కానీ, దురదృష్టమేమంటే కేవలం విదేశాలకు వెళ్లేవారినే ప్రవాసులుగా గుర్తించి గౌరవించడం, వారికుండాల్సిన హక్కుల గురించి చర్చించడం తప్ప దేశంలోనే ఒకచోటునుంచి మరో చోటుకు వెళ్లినవారి గురించి ఆలోచించేవారు కరువవుతున్నారు. అంతర్గత వలసదారుల వరకూ ఎందుకు...విదేశాలకు వలసపోయినవారందరినీ సమానంగా చూసే సంస్కృతి కూడా ఉండటం లేదు.

  ప్రవాసీ భారతీయ దివస్‌వంటి సందర్భాల్లో జరిగే చర్చలన్నీ అమెరికా, బ్రిటన్‌వంటి దేశాల్లో ఉంటున్న ఎన్నారైల చుట్టూ, వారి సమస్యల చుట్టూ, వారి విజయాల చుట్టూ తిరుగుతాయి. ఆ చర్చల తీరు చూస్తే మన దేశంనుంచి ప్రధానంగా ఆ రెండు దేశాలకు మాత్రమే ఎక్కువమంది వలసపోతారన్న అభిప్రాయం కలుగుతుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లినవారిని గుర్తించేవారుగానీ, వారి సమస్యల గురించి చర్చించేవారు గానీ ఉండరు. నిజానికి ఎన్నారైలలో అత్యధిక సంఖ్యాకులు సౌదీ అరేబియా, దుబాయ్‌వంటి గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. 2012 గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల సంఖ్య దాదాపు 60 లక్షలు కాగా, అమెరికాలో ఉంటున్నవారు10 లక్షలమంది. ఇక డబ్బు రూపంలో చూసినా గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ఎన్నారైలు పంపే మొత్తమే చాలా రెట్లు ఎక్కువ. అయితే, ఈ ప్రవాసభారతీయుల ఆర్థిక స్థితిగతుల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అమెరికా, బ్రిటన్‌వంటి దేశాలకు వెళ్లేవారు సాధారణంగా విద్యాధికులు లేదా వ్యాపారులు అయి ఉంటారు. ఉన్నతావకాశాల కోసం, జీవితంలో మరింత ఎత్తుకు ఎదగడానికి వీరు వెళ్తారు. ఇందుకు భిన్నంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల్లో చాలామంది పొట్టచేతబట్టుకుని వెళ్లేవారే. పని మనుషులుగానో, డ్రైవర్లుగానో... అంతగా నైపుణ్యం అవసరంలేని మరే ఇతర పనో చేయడానికి వీరంతా వెళ్తారు. ఇలాంటి వారు నిత్యం ఎన్నో అగచాట్లు పడుతుంటారు. నిర్దయగా వ్యవహరించే యజమానుల వద్ద వెట్టి చాకిరీలో మగ్గుతుంటారు. వారి పాస్‌పోర్టులను కూడా లాక్కోవడంవల్ల స్వస్థలానికి రావడం యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. పైగా అమెరికా, బ్రిటన్‌వంటి దేశాలు వలసవచ్చినవారికి నిర్ణీత కాలవ్యవధి తర్వాత పౌరసత్వం, శాశ్వత నివాసం ఉండటానికి వీలుకల్పిం చడంతోసహా ఎన్నో సౌకర్యాలు అందిస్తాయి. కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్నన్నాళ్లు ఉండి రావడం తప్ప అక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకోవడం కుదరదు. నిజానికి ప్రవాసీ భారతీయ దివస్ వంటి సందర్భాలు ప్రధానంగా పట్టించుకోవాల్సింది ఇలాంటి చోట ఉంటున్నవారి సమస్యల గురించే. కేంద్ర ప్రభుత్వం వీరి స్థితిగతుల గురించి ఆయా దేశాలతో చర్చిస్తే అక్కడుంటున్న లక్షలాదిమంది ఎన్నారైలు మాత్రమే కాదు... దేశంలోని వారి ఆప్తులు కూడా ఊపిరిపీల్చుకుంటారు.

 ఎన్నారైల విషయంలోనే ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నచోట అంతర్గత వలస బాటలో వెళ్లిన వారి గురించి పట్టించుకుంటారని భావించడం అత్యాశే. ఎన్నారైలతో పోలిస్తే అంతర్గతంగా వలస పోయినవారి సంఖ్య ఎన్నో రెట్లుఎక్కువ. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 40 కోట్లమంది ఒకచోట నుంచి మరో చోటకు వలసపోతున్నారని వెల్లడైంది. కూలి పనుల కోసమో, వ్యాపారం నిమిత్తమో, ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానో, వివాహం కావడంవల్లో వెళ్లే ఇలాంటివారి సమస్యల గురించి పట్టించుకునేవారే ఉండరు. ఓటర్ల జాబితాలో ఉండరు గనుక స్వస్థలంలోని రాజకీయ నాయకులకు వీరి యోగక్షేమాలు పట్టవు. తమది కాని ప్రాంతానికి వెళ్లారు గనుక ఆ వెళ్లినచోట కూడా వీరి ఇబ్బందులేమిటో ఎవరూ ఆరా తీయరు. ఇలాంటివారంతా అయినవారికి దూరంగా ఉండటంతో పాటు తమ గుర్తింపునే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు వీరి ఓటింగ్ హక్కులపై దాఖలైన పిటిషన్ పర్యవసానంగా ఎన్నారైలకు లభించినట్టే ఉన్నచోటునుంచి ఓటేసే అవకాశం వీరికి కూడా లభిస్తే పరిస్థితులు కాస్త మారే వీలుంటుంది. రాజకీయ నాయకులకు వీరి సమస్యలపై దృష్టి పెట్టక తప్పని స్థితి ఏర్పడుతుంది. కనీసం అప్పుడైనా వలసజీవులందరి భద్రత, సంక్షేమం గురించి పాలకులు స్పష్టమైన విధానాలను రూపొందిస్తారని ఆశించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement