ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిగణనలోకి తీసుకున్న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 1990 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో ‘వలసకార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్గత, అంతర్జాతీయంగావలస వెళ్తున్న పౌరులందరి కోసం డిసెంబర్ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే) గా ప్రకటించింది.
వలస అనేది భౌగోళికంగా లేదా రాజకీయ పరంగా నిర్ణయించిన రెండు సముదాయాల మధ్య జరిగే నివాస మార్పును తెలియజేస్తుంది. వలసలు లేనిదే అభివృద్ధి, మానవ వికాసం లేదు. వలసలకు, అభివృద్ధికి సంబంధం ఉంది. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొందగలుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో పునరేకీకరణ, స్థానభ్రంశం, సురక్షిత వలసలు, సరిహద్దు నిర్వహణ వంటి అంశాలలో కీలకమైన రాజకీయ, విధానపర విషయాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి.
వలసలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ‘పుష్ ఫ్యాక్టర్’ అంటే.. వలస వెళ్లేలా నెట్టివేయబడే పరిస్థితులు. స్థానిక ప్రదేశంలోని అననుకూల పరిస్థితులు ప్రజలను బయటకు నెట్టివేస్తాయి. ఉదాహరణకు.. అణచివేసే చట్టాలు, అధిక పన్నుల భారం, మతకల్లోలాలు, అంతర్యుద్ధాలు, పేదరికం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం, ప్రకృతి వైపరీత్యాలు, భారీ ప్రాజెక్టుల కోసం గ్రామాలను ఖాళీ చేయించడం (డిస్‌ప్లేస్మెంట్) అనే అంశాలు ప్రేరేపిస్తాయి. ‘పుల్ ఫ్యాక్టర్’ అంటే.. వలస వెళ్లేలా ఆకర్షింపబడే పరిస్థితులు. అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం, బాహ్య ప్రదేశంలోని అనుకూల పరిస్థితులు వారిని ఆకర్షిస్తాయి. సంపన్న దేశంలో మంచి జీతం కలిగిన ఉద్యోగం అంతర్జాతీయ వలసల శక్తివంతమైన ఆకర్షణకు కారణం. పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు. ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు, దేశాలకు వెళ్లేవారు కొందరు, మరింత మెరుగైన జీవితం కోసం, అధిక సంపాదన కోసం వెళ్లేవారు మరికొందరు.
– మంద భీంరెడ్డి,
అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర
Comments
Please login to add a commentAdd a comment