అమెరికా కీలక ఒప్పందం.. భారత వలసదారులు ఇక కోస్టారికాకు! | Costa Rica To Take Indian Deportees From US | Sakshi
Sakshi News home page

అమెరికా కీలక ఒప్పందం.. భారత వలసదారులు ఇక కోస్టారికాకు!

Published Wed, Feb 19 2025 6:55 AM | Last Updated on Wed, Feb 19 2025 8:05 AM

Costa Rica To Take Indian Deportees From US

200 మందితో నేడు తొలి విమానం

అక్కడినుంచి మాతృదేశాలకు తరలింపు

శాన్‌జోస్‌: భారత అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలించాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అగ్రరాజ్యం తమతో ఒప్పందం చేసుకున్నట్టు కోస్టారికా వెల్లడించింది. అందులో భాగంగా వలసదారుల తొలి విమానం బుధవారం తమ దేశానికి రానున్నట్టు కోస్టారికా అధ్యక్షుడు రొడిగ్రో చావెస్‌ రోబెల్‌ కార్యాలయం ప్రకటించింది.

ఈ సందర్బంగా రొడిగ్రో మాట్లాడుతూ..‘భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వస్తున్నారు. అనంతరం వారిని మాతృదేశాలకు పంపేస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పని చేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తాం’ అని తెలిపారు. అయితే 200 మందిలో భారతీయులు ఎందరన్నది మాత్రం వెల్లడించలేదు.

అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలను ఆ సంస్థే చూసుకోనుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారతీయులను స్వదేశానికి పంపించింది. 

ఇదిలా ఉండగా.. పనామా హోటల్‌లో భారతీయులతో సహా పలు దేశాల అక్రమ వలసదారులు ఉన్నారు. యూఎస్‌ ఆదేశాల మేరకు పనామా ప్రభుత్వం వారికి అక్కడ బస ఏర్పాటు చేసింది. వలసదారుల్లో ఇరాన్‌, ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్‌, అఫ్గాన్‌, చైనా ఇతర దేశాల వలసదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా దేశాల అధికారులు వారిని తీసుకెళ్లే ఏర్పాట్లు చేసే వరకు హోటల్‌లోనే ఉంటారని ఈ మేరకు పనామా వెల్లడించింది. పట్టుబడిన వారిలో 40 శాతం మంది సొంతంగా తమ దేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధంగా లేరని పనామా అధికారులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement