పుతిన్‌కు అండగా ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌ వైఖరి ఇదే.. | Trump Support For Russia In UN vote on Ukraine | Sakshi
Sakshi News home page

పుతిన్‌కు అండగా ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌ వైఖరి ఇదే..

Published Wed, Feb 26 2025 7:11 AM | Last Updated on Wed, Feb 26 2025 10:50 AM

Trump Support For Russia In UN vote on Ukraine

యుద్ధంలో రష్యా తప్పులేదన్నట్లు ప్రవర్తించిన అమెరికా

ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఓటేసిన ట్రంప్‌ సర్కార్‌

ఐక్యరాజ్యసమితి సాక్షిగా అగ్రరాజ్యం ద్వంద్వ వైఖరి

ఐక్యరాజ్యసమితి: బైడెన్‌ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడేళ్లుగా యుద్ధంలో ఉక్రెయిన్‌కు అన్నిరకాల సాయం చేస్తే తాజాగా ట్రంప్‌ సర్కార్‌ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న ఉదంతం ఐక్యరాజ్యసమితి సాక్షిగా తొలిసారిగా బహిర్గతమైంది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో రష్యాను దురాక్రమణదారుగా పేర్కొంటూ యూరప్‌ దేశాలు చేసిన ఒక తీర్మానానికి ఎన్నో దేశాలు మద్దతు పలికితే అమెరికా వ్యతిరేకంగా ఓటేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇక, యుద్ధం మొదలుకావడానికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొండివైఖరే కారణమని పదేపదే ప్రస్తావిస్తున్న ట్రంప్‌ సర్కార్‌ వైఖరి సోమవారం ఐరాస వేదికగా తేటతెల్లమైంది. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని, రష్యా సేనలు వెంటనే ఆక్రమణ భూభాగాల నుంచి వెనుతిరగాలని, పలు డిమాండ్లతో ఐరాసలో సోమవారం మూడు తీర్మానాలను పలు సభ్యదేశాలు ప్రతిపాదించాయి. ఒక బిల్లులో రష్యాను ఆక్రమణదారుగా పేర్కొన్నారు. అయితే రష్యాను ఆక్రమణదారుగా పేర్కొనడాన్ని సమర్థించబోనని అమెరికా తెగేసి చెప్పింది.

రష్యా తప్పేంలేదన్నట్లు ప్రవర్తిస్తూ ఓటింగ్‌ వేళ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. యూరప్‌ మిత్రదేశాలను కాదని ట్రంప్‌ సర్కార్‌ రష్యా అనుకూల వైఖరితో ముందుకెళ్లడం ఇప్పుడు యూరప్‌ దేశాల్లో చర్చనీయాంశమైంది. రష్యా సైన్యం తమ ప్రాదేశిక స్థలాల నుంచి వైదొలగాలని ఉక్రెయిన్‌ చేసిన ఒక తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా అమెరికా ఒత్తిడిచేసినట్లు తెలుస్తోంది. యూరప్‌ దేశాలు చేసిన మరో తీర్మానంలో ఓటేయకుండా అమెరికా దూరంగా ఉండిపోయింది. అమెరికా, యూరప్‌ దేశాల మధ్య సత్సంబంధాలు సన్నగిల్లుతు న్నాయనేది ఐరాస వేదికగా బహిర్గతమైంది.

దూరంగా ఉండిపోయిన భారత్‌
చర్చలు, సంప్రదింపుల ద్వారానే యు ద్ధాన్ని ముగించాలని మొదట్నుంచీ కోరుకుంటున్న భారత్‌ సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. సర్వ ప్రతినిధి సభలో ఉక్రెయిన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మా నంపై ఓటింగ్‌లో 176 దేశాలు పాల్గొనగా 93 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఉత్తరకొరియా సహా 18 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 

భారత్, చైనా, ఇరాన్, ఇరాక్, బంగ్లాదేశ్, ఖతార్, సిరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సహా 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. ‘‘యుద్ధం కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇరుదేశాల మధ్య  శాంతికి ప్రయత్నాలు చేద్దాం’’ అంటూ అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఫ్రాన్స్‌ మూడు సవరణలు సూచించింది. రష్యా కారణంగానే యుద్ధం మొదలైందని పేర్కొంది. దీనిపై రష్యా స్పందించింది. అసలు ఈ ఉద్రిక్తతలకు మూలకారణాలను ప్రస్తావించాలని రష్యా డిమాండ్‌ చేసింది. అయితే ఈ సవరణలను 93 దేశాలు సమర్థించగా 8 దేశాలువ్యతిరేకించాయి. 73 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement