
సాక్షి, దుబాయి : ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రేపు(శుక్రవారం) యూఏఈలో పర్యటించనున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మంద భీంరెడ్డి తెలిపారు. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4గంటలకు భారీ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని చెప్పారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని, ఉచిత ప్రవేశం కొరకు www.rginuae.com లో పేర్లు నమోదు చేసుకోవాలని మంద భీంరెడ్డి గల్ఫ్ ప్రవాసులకు పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని "గాంధీ 150 సంవత్సరాలు - భారతదేశం యొక్క ఆలోచన" అనే అంశంపై సభలో రాహుల్ ప్రసంగించనున్నారని భీంరెడ్డి పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలలో సెలవు
దినమైన శుక్రవారం రోజున నిర్వహిస్తున్న ఈ సభలో పాల్గొనే కార్మికుల కోసం వారు నివసిస్తున్న లేబర్ క్యాంపుల నుండి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరాల కోసం వాట్సప్ నెంబర్ +91 98494 22622కు సంప్రదించవచ్చని మందభీంరెడ్డి తెలిపారు.