తెలంగాణ గల్ఫ్ జేఏసీ ఆవిర్భావం
► ప్రవాసీలను ఆదుకోవడమే లక్ష్యం: కన్వీనర్ భీమ్‌రెడ్డి
సాక్షి, వేములవాడ: ప్రవాసీ భారతీయులను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ గల్ఫ్ జేఏసీ ఆవిర్భవించిందని ఆ సంస్థ కన్వీనర్ మంద భీమ్‌రెడ్డి, నాయకులు నంగి దేవేందర్‌రెడ్డి, నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్స వం, గల్ఫ్‌లో కార్మికులకు సెలవు దినం కావడంతో శుక్రవారం ఈ సంస్థకు అంకురార్పణ చేశామని వెల్లడించారు. శుక్రవారం వారు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ప్రవాసీ సంఘాలు, నిపుణులైన ప్రముఖులు, నిర్ణయాత్మకమైన గ్రూపులతో కలిసి జేఏసీ పనిచేస్తుందని చెప్పారు. స్వరాష్ట్రం సాధించుకున్నా వలసకా ర్మికుల గురించి పట్టించుకోవడం లేదని, అందుకే జేఏసీ తరఫున గల్ఫ్ కార్మి కుల హక్కుల రక్షణ, సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతామని అన్నారు.
చట్టబద్ధ వలసలు, పెన్షన్, బీమా, పరిహారం చెల్లింపు, న్యాయ సలహాలు, పునరావాసం కల్పన తదితర అంశాల్లో బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి సుమారు 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారని, వారి ద్వారా చేకూరే విదేశీ మారకంతో ద్వారా మనదేశం పెట్రోలియం ఉత్పతులు కొనుగోలు చేసే అవకాశాలున్నాయన్నారు. ప్రవాసీ భారతీయుల కుటుంబాలు చేసే ఖర్చు ద్వారా కూడా ప్రభుత్వానికి పన్ను రూపేణా ఏటా రూ.2 వేల కోట్లు సమకూరుతున్నాయని తెలిపారు. అయినా గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో పాలకులు చిత్తశుద్ధి చూపడంలేదని విమర్శించారు. అందుకే తాము ముందుకు వస్తున్నామని వారు చెప్పారు.