దుబాయ్‌లోని సెంట్రల్ జైలు
2017 డిసెంబర్ 28 వరకు తమవద్ద ఉన్న సమాచారం మేరకు 76 దేశాలలోని జైళ్లలో 7,985 మంది భారతీయులున్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం.జె.అక్బర్ జనవరి 3న లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల స్థితిగతుల గురించి లోక్‌సభ సభ్యులు నినాంగ్ ఎరింగ్, కైలాష్ ఎన్ సింగ్ దేవ్, జితేందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్)లు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని గోప్యతా చట్టాల వల్ల జైళ్లలో ఉన్నవారి వివరాలు తెలియడం లేదు.
ఆరు అరబ్ దేశాల గల్ఫ్ సహకార మండలి (గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ – జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియాలో 2,229, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో 1,628, కువైట్‌లో 506, ఖతార్‌లో 196, బహ్రెయిన్‌లో 77, ఒమన్‌లో 60 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాల జైళ్లలోనే 58 శాతానికి పైగా 4,696 మంది ఉన్నారు. మలేషియాలో 341, సింగపూర్‌లో 115, నేపాల్‌లో 859, పాకిస్తాన్‌లో 395, థాయిలాండ్‌లో 47, యూకేలో 376, యఎస్‌లో 343 మంది జైళ్లలో ఉన్నారు.
వీరిలో శిక్షా కాలం పూర్తయిన వందలాది మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. జరిమానాలు చెల్లించనందున కొందరు, సాంకేతిక కారణాల వలన మరి కొందరు జైళ్లలో, డిటెన్షన్ సెంటర్ల (నిర్బంధ కేంద్రాలు)లో మగ్గుతున్నారు. పరాయిదేశం, తెలియని భాష, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో తప్పులుచేసి జైలు పాలైనవారు కొందరున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశంలో ప్రమాదాలకు కారకులైనవారు, గొడవలు, ఆర్థికపరమైన మోసాలు, ఇతర మోసాలు, మద్యం సేవించడం, మద్యం వ్యాపారం, జూదం, లంచం, వీసా నిబంధనలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, ఫోర్జరీ లాంటి కేసులలో కొందరు జైళ్లలో మగ్గుతున్నారు.
మాదక ద్రవ్యాల వినియోగం, మాదక ద్రవ్యాల వ్యాపారం, మానవ అక్రమ రవాణా, సెక్స్, వ్యభిచార నిర్వహణ, దొంగతనాలు, హత్యలు లాంటి తీవ్రమైన నేరాలలో జైలు పాలైన వారూ ఉన్నారు. భారత్ నుంచి విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేవారు, తాము ఏ దేశానికి, ఏం పనిపై వెళుతున్నారు, ఆ దేశ చట్టాలు, ఆచార వ్యవహారాలూ, పద్ధతులు తెలుసుకొని అవగాహనతో వెళ్లడం మంచిది. ఆయా దేశాల చట్టాల ప్రకారం శిక్షలు ఖరారు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మెలగాలి.
గల్ఫ్ నుంచి భారత్‌కు బదిలీకి ఎదురుచూస్తున్న ఖైదీలు
ఖైదీలను స్వదేశానికి తీసుకువచ్చే చట్టం 2013 (రిపాట్రియేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 2013) ప్రకారం ఇప్పటివరకు 170 దరఖాస్తులు వచ్చాయని 62 మంది విదేశీ జైళ్ల నుంచి భారత్ జైళ్లకు బదిలీ అయ్యారని మంత్రి తెలిపారు. భారత్ ఇప్పటివరకు 30 దేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకున్నదని అన్నారు. ఇవికాకుండా ఇంటర్ అమెరికన్ కన్వెన్షన్‌ను ఆమోదించిన సభ్య దేశాలతో భారతదేశం ఖైదీల బదిలీకి అభ్యర్థనలు పంపడానికి, స్వీకరించడానికి అర్హత కలిగి ఉన్నది. యూఏఈ, భారత్ మధ్య 2011 నవంబర్ 2న ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది.
అప్పటి భారత హోంమంత్రి పి.చిదంబరం, యూఏఈ దేశ ఉప ప్రధాని, హోం మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహయాన్‌లు ఈ ఒప్పందంపై ఢిల్లీలో సంతకాలు చేశారు. 2015 మార్చి 25న ఖతార్‌తో కూడా ఖైదీల బదిలీ ఒప్పందం జరిగింది. ఈ రెండు గల్ఫ్ దేశాల ఒప్పందాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, రాసల్ ఖైమా, ఫుజీరా, ఉమ్మల్ కోయిన్ అనే ఏడు రాజ్యాలలోని వివిధ జైళ్లలో మగ్గుతున్న 1,628 మందిలో శిక్షపడిన వందలాది మంది భారతీయ ఖైదీలతో పాటు ఖతార్‌లోని 196 మందికి ఈ ఒప్పందం వలన లాభం కలుగుతుంది.
వీరు మిగిలిన శిక్ష కాలాన్ని తమ ఇష్ట ప్రకారం భారత్ జైళ్లలో పూర్తిచేసుకోవచ్చు. వీరిలో 40 మంది మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. భారత్‌లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒకే ఒక్క యూఏఈ పౌరుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతీయ ఖైదీలు తమ స్వదేశానికి బదిలీ అయితే తమ కుటుంబ సభ్యులను కలుసుకొని స్వాంతన పొందే అవకాశం ఉంది. విదేశీ జైళ్లలో మగ్గుతున్న పేద ప్రవాసీ కార్మికులకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ సహాయం అందించాలి. చిన్నపాటి జరిమానాలను చెల్లించి వారి విడుదలకు కృషి చేయాలి.
గల్ఫ్ జైళ్లలో ఉన్న మలయాళీలను విడిపించడం కోసం కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతేక నిధిని కేటాయించింది. సంవత్సరాల తరబడి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. నొప్పి నివారణ మాత్రలు, గసగసాలు కలిగి ఉన్నందుకు 24 ఏళ్ల జైలు శిక్షకు గురై దుబాయి జైలులో మగ్గుతున్న తెలుగువారు ఉన్నారు. గల్ఫ్ దేశాలలో ఏం చేయాలో, ఏం చేయకూడదో మన కార్మికులకు తెలియజేయడానికి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి.
–మంద భీంరెడ్డి mbreddy.hyd@gmail.com
Comments
Please login to add a commentAdd a comment