భారత్‌ను వీడి విదేశాల్లో ఆశ్రయం పొందాలనుకుంటున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతర్యుద్ధం, రాజకీయ సంక్షోభం వంటి సమస్యలు లేకపోయినా విదేశాల్లో ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తెలిపింది. 2008–18 మధ్యకాలంలో ఇలా విదేశాలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య ఏకంగా 996.33 శాతానికి ఎగబాకిందని వెల్లడించింది. ఇలా ఆశ్రయం కోరుతున్నవారిలో అత్యధికులు అమెరికా, కెనడా దే శాలవైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొంది. సాధారణంగా అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత ఇతర కారణాలతో ప్రజలు ప్రాణాలను అరచేతపెట్టుకుని పారిపోతుంటారు. ఈ తరహా సమస్యలు ఏవీ లేకపోయినా భారత్ నుంచి భారీగా వలసలు పెరగడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల క్రితం పరిస్థితి వేరు...
పదేళ్ళ క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. 2008–09 మధ్యకాలంలో అమెరికా, కెనడాల ఆశ్రయాన్ని కోరుతూ కేవలం 282 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానీ గత పదేళ్ళలో ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి 22,967కి చేరుకుంది. 2018లో అమెరికా ఆశ్రయాన్ని కోరుకున్న భారతీయుల సంఖ్య 28,489కు పెరగ్గా, కెనడా ఆశ్రయాన్ని కోరుకున్న వారి సంఖ్య 5,522కు చేరుకుంది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అమెరికా, కెనడాల తర్వాత భారతీయులు ఆశ్రయం కోరిన దేశాల్లో దక్షిణాఫ్రికా(4,329), ఆస్ట్రేలియా(3,584), దక్షిణకొరియా(1,657), జర్మనీ(1,313) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి వలస వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ పేదరికం, అంతర్యుద్ధం, విపరీతమైన హింస ఉండే యెమెన్, సూడాన్, బోస్నియా, బురుండి వంటి దేశాలను కూడా భారతీయులు ఆశ్రయం కోరడం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులను విస్మయంలో పడేస్తోంది. 2018లో ఇలాంటి 57 దేశాల్లో భారతీయులు ఆశ్రయాన్ని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారత్‌లో నెలకొన్న అసహనం కారణంగానే ఇలా ప్రజలు విదేశీ ఆశ్రయం కోరుతున్నారని మరికొందరు వాదిస్తున్నారు.
భారత్‌కు వస్తున్నవారు తక్కువే...
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఆశ్రయిస్తోన్న శరణార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా 35.03 లక్షల మంది శరణార్థులు వేర్వేరు దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారు 11,957 మంది(0.34 శాతం) మాత్రమే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2018 చివరికినాటికి భారత్ 1.95 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. ప్రాంతాలవారీగా చూసుకుంటే పాకిస్తాన్ 14.04 లక్షల మంది విదేశీయులకు ఆశ్రయం ఇచ్చింది. వీరిలో అత్యధికులు ఆఫ్గన్లు. 9.06 లక్షల మందితో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రోహింగ్యాలు వీరిలో అత్యధికంగా ఉన్నారు.
బైబై ఇండియా..!
Published Mon, Jun 24 2019 4:33 AM | Last Updated on Mon, Jun 24 2019 5:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment