పార్లమెంటులో ప్రవాస భారతీయం
గల్ఫ్, మలేషియా తదితర దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ ఇస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ డిసెంబర్ 12న లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తమిళనాడుకు చెందిన ఏఐడీఎంకే సభ్యుడు డా.సి.గోపాలక్రిష్ణన్, పి.నాగరాజన్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన పథకంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి పారిశ్రామిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ డిపార్చర్ ఓరియెంటేషన్ ట్రైనింగ్ – పీడీఓటీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఆయా దేశాల సంస్కృతి, భాష, ఆచార వ్యవహారాలు, స్థానిక నియమాలు, నిబంధనలు తెలియజేస్తూ వలస వెళ్లే కార్మికుల విశిష్ట నైపుణ్యాలు (సాఫ్ట్ స్కిల్స్) పెంపొందించుట ఈ శిక్షణ ఉద్దేశమని మంత్రి వివరించారు. సురక్షితమైన, చట్టబద్దమైన వలసలకు మార్గాల గురించి విషయ పరిజ్ఞానం అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడం లక్ష్యమని వివరించారు. ఇప్పటివరకు 30వేల మంది కార్మికులకు పీడీఓటీ శిక్షణ ఇచ్చామని తెలిపారు. అన్ని రిక్రూటింగ్ ఏజెన్సీలు కూడా ఈ శిక్షణను అందించాలని ఆయన కోరారు.
కాన్సులార్ ఆక్సెస్..
భారత పౌరులు విదేశీ జైళ్లలో, నిర్బంధ కేంద్రాలలో (డిటెన్షన్ సెంటర్లు) ఉన్నప్పుడు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యా లయాలు స్థానిక అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ‘కాన్సులార్ ఆక్సెస్’ (భారత దౌత్య అధికారులను కలిసే అవకాశం) కల్పిస్తున్నామని ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ సభ్యుడు రవీంద్ర కుమార్ జెనా అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు.
68 దేశాల జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు
68 దేశాలలోని వివిధ జైళ్లలో 8,445 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ వెల్లడించారు. పశ్చిమబంగకు చెందిన సీపీఎం సభ్యుడు బదరుద్దొజాఖాన్ అడిగిన ప్రశ్నకు డిసెంబర్ 19న మంత్రి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని దేశాలలోని కఠినమైన గోప్యతా చట్టాల కారణంగా ఖైదీల సమాచారాన్ని వెల్లడించడం లేదని, 15 దేశాల జైళ్లలో శిక్ష అనుభవిస్తూ 40 మంది భారతీయ ఖైదీలు మృతిచెందారని తెలిపారు. ‘విదేశా ల్లోని భారతీయుల భద్రత, శ్రేయస్సు భారత ప్రభుత్వం ముఖ్య ప్రాధాన్యతలు. ప్రవాస భారతీయులు దాడులు, అగౌరవానికి గురైన సందర్భాలలో భారత దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండి జాగరూకతతో పర్యవేక్షిస్తాయి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం.
ఉచితంగా సేవలు అందించే న్యాయవాదులు (ప్రోబోనో లాయర్స్) అందుబాటులో ఉన్న దేశాలలో ఖైదీలకు న్యాయ సహాయం అందజేస్తున్నాం’ అని మంత్రి వివరించారు. శిక్ష కాలం పూర్తయిన భారతీయ ఖైదీల విడుదలకు ఆయా దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశీ ప్రభుత్వాలకు చెందిన సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని ఎగ్జిట్ వీసాలు (దేశం విడిచి వెళ్లడానికి అనుమతి), జరిమానాల మాఫీ లాంటి పనులు వేగవంతంగా పూర్తిచేసి త్వరగా భారత్‌కు రప్పిస్తున్నామని పేర్కొన్నారు. విడుదలైన ఖైదీలకు అవసరమైన సందర్భాలలో ఉచితంగా విమాన ప్రయాణ టికెట్లు సమకూరుస్తున్నామని వివరించారు. కాగా, గల్ఫ్‌లోని ఆరు దేశాల జైళ్లలో 4,705 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు.
–మంద భీంరెడ్డి,
గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment