కమల్‌ హాసన్‌తో డీసీఎం భేటీ! | Udhayanidhi Stalin Meets To Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్‌ హాసన్‌తో డీసీఎం భేటీ!

Published Thu, Feb 13 2025 7:03 PM | Last Updated on Thu, Feb 13 2025 7:20 PM

Udhayanidhi Stalin Meets To Kamal Haasan

చెన్నై : మక్కల్‌ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan)కు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైనట్లే తెలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ గురువారం కమలహాసన్‌తో భేటీ అయ్యారు.  

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కమల్‌ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం కమల్‌ హాసన్‌ నివాసానికి రాష్ట్రమంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లారు. ఆ భేటీని ఎంఎన్‌ఎం పార్టీ ఎక్స్‌ వేదికగా ప్రస్తావించింది. దీంతో రాజ్యసభకు కమల్‌ హాసన్‌ ప్రచారం జోరందుకుంది.  

 

ఈ తరుణంలో కమల్‌ హాసన్‌తో ఉదయనిధి స్టాలిన్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కమల్‌తో భేటీ అనంతరం, ఉదయనిధి స్టాలిన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘మేం ఈరోజు మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్‌ హాసన్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాం. మమ్మల్ని హృదయపూర్వకంగా స్వాగతించినందుకు, రాజకీయాలు, సినిమాతో పాటు వివిధ రంగాలపై అభిప్రాయాలను పంచుకున్నందుకు నా కృతజ్ఞతలు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

 

2024లో తమ ఎన్నికల ఒప్పందంలో భాగంగా హాసన్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే హామీ ఇచ్చినట్లు సమాచారం. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చింది. గతేడాది మార్చిలో కమల్‌ హాసన్‌ డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంను సందర్శించారు. అక్కడ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఒప్పందంపై సంతకం చేశారు.

డీఎంకే నేతృత్వంలోని కూటమితో పొత్తు పెట్టుకోవాలనే తన నిర్ణయం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జరిగిందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. కానీ ఈ ఇండియా కూటమికి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పదవి కోసం కాదు, దేశం కోసం’అని ఆ సమయంలో వ్యాఖ్యానించారు.  

ఒప్పందం ప్రకారం, తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే  నేతృత్వంలోని కూటమి తరపున లోక్‌సభ ఎన్నికలకు కమల్ హాసన్ ప్రచారం చేశారు. ప్రతిగా 2025లో డీఎంకే కోటా నుండి రాజ్యసభ నామినేట్‌ చేయనుంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే సభ్యులతో సహా కనీసం ఆరుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం జూన్ 2025 నాటికి ముగియనుంది. అందుకే డీఎంకే పార్టీ ఇప్పుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేసేందుకు సిద్ధమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement