సత్ప్రవర్తన కలిగిన 390 మంది జీవిత ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు రాష్ట్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
చర్లపల్లి నుంచి 76 మంది, చంచల్‌గూడ నుంచి 9 మంది విడుదల
సత్ప్రవర్తన కలిగిన 390 మంది జీవిత ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు రాష్ట్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆమోదం మేరకు ఖైదీల క్షమాభిక్షకు హోంశాఖ తుది ఉత్తర్వులను (జీవో 286) విడుదల చేసింది. ఎవరెవరు ఖైదీలు క్షమాభిక్షపై విడుదలవుతున్నారనే జాబితాను మాత్రం బయటకు వెల్లడించలేదు. ఆ జాబితాను అన్ని కేంద్ర కారాగారాలకూ హోంశాఖ పంపింది. జాబితాకు అనుగుణంగా జైళ్ల శాఖ అధికారులు ఖైదీలను విడుదల చేయనున్నారు. సత్‌ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. చంచల్‌గూడ జైళ్లకు చెందిన 9 మంది ఖైదీలు శనివారం రాత్రి విడుదలయ్యారు.
చంచల్‌గూడ మహిళ జైలుకు సంబంధించి ఏడుగురు ఖైదీలు యాదమ్మ (హైదరాబాద్), ఇందిర (సంగారెడ్డి), కౌసల్య (పరిగి), విజయలక్ష్మి (గుంటూరు), చుక్కమ్మ, రాములమ్మ (తాండూరు), సీతామాలక్ష్మి అదేవిధంగా పురుషుల జైలుకు సంబంధించి తిరుమలేశ్ (షామీర్‌పేట), షేక్ చాంద్ (కరీంనగర్- ప్రస్తుతం ఆల్వాల్) విడుదయ్యారు. కాగా వీరంతా గతంలో హత్యకేసులో నిందితులుగా వుండి జైలు శిక్ష అనుభవిస్తూ వచ్చారు. విడుదలై బయటకు వచ్చిన ఖైదీలు కన్నీటి పర్యంతమై .. ఉద్వేగానికి లోనయ్యారు. కాగా.. చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి మొత్తం 24మంది, చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 35మంది, గచ్చిబౌలి వ్యవసాయ క్షేత్రం నుంచి 17మంది విడుదలయ్యారు.