రాయబార కార్యాలయం ముందు ఆమ్నేస్టీ అర్జీలతో కార్మికులు(ఫైల్)
- సౌదీ క్షమాబిక్ష (ఆమ్నేస్టీ) పథకంతో వెసులుబాటు
- జులై 25న ముగియనున్న గడువు
- 'మత్లూబ్' కేసులతో పలువురి నరకయాతన
- అప్పుల బాధతో వెనక్కి వచ్చేందుకు జంకుతున్న కార్మికులు
- ఆమ్నేస్టీతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 వేలమంది ఊరట లభిస్తుందని అంచనా
సాక్షి, హైదరాబాద్:
సౌదీ అరేబియా స్థానిక చట్టాలను అతిక్రమించి దేశంలో ఉంటున్న వారిని తిరిగి వారి స్వదేశాలకు వెళ్లడానికి వీలుగా అక్కడి ప్రభుత్వం కల్పించిన ఆమ్నేస్టీ (క్షమాబిక్ష) కి ఈ నెల 25 వ తేదీతో ముగుస్తోంది. జీవనోపాధిని వెతుక్కుంటూ ఏడాది దేశం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాస భారతీయులకు ఇదొక మంచి అవకాశం.
అత్యంత కఠిన చట్టాలు అమలు చేసే సౌదీలో అక్రమంగా వెళ్లినవారంతా తిరిగి స్వదేశం చేరుకోవడానికి ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ తెలిసీ తెలియక చేసిన చిన్నచిన్న పొరపాట్ల కారణంగా ఈ అవకాశం కూడా వినియోగించుకోలేక అక్కడే మగ్గుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని పట్టించుకునే వారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సౌదీ ప్రభుత్వం తొలుత మార్చి 29 నుంచి 90 రోజుల పాటు క్షమాబిక్ష (ఆమ్నేస్టీ) ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆ గడువును మరో 30 రోజులు పొడగించింది. ఆ గడువు ఈనెల 25 తో ముగుస్తోంది. ఈ ఆమ్నేస్టీలో కనీసంగా 30 వేల మంది భారతీయులు తిరిగి స్వదేశానికి చేరుకుంటారని అంచనా. ఇందులో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే 10 వేల మంది ఉంటారని తెలుస్తోంది. ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి రావాలంటే చేసిన అప్పులు వారిని భయపెడుతున్నాయి. తిరిగి స్వదేశానికి వెళితే ఏం చేయాలి? భవిష్యత్తు ఎలా ఉంటుందో? అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఉపాధి కల్పిస్తామంటూ ప్రభుత్వాల ఏదైనా భరోసా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో పలువురున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే ... చిన్నచిన్న పొరపాట్లు చేసి అక్కడి చట్టాలను అతిక్రమించిన వందలాది భారతీయ కార్మికులకు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నేస్టీ వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది.
సద్వినియోగం చేసుకోవాలి
నివాస మరియు కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన సౌదీలో ఉన్న విదేశీయులందరికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోక సౌదీలో అక్రమానివాసులుగా ఉండిపోయేవారికి లక్ష రియాళ్ల జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విధిస్తారు. ఈ పథకాన్ని వినియోగించుకున్నవారి వేలిముద్రలు తీసుకోరు, మళ్లీ సౌదీకి వెళ్లొచ్చు. వారిపై ట్రావెల్ బ్యాన్ ఉండదు. అధికారుల అంచనా ప్రకారం సౌదీలో ఎక్కువగా ఉద్యోగాల వీసాతో పోయిన అక్రమనివాసులు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. హజ్, ఉమ్రా వీసాల అక్రమనివాసులు తక్కువ.
యాజమానుల నుండి పారిపోయిన సుమారు వేలాది మంది ఉద్యోగుల పాస్ పోర్టులు భారత రాయబార కార్యాలయాలకు సౌదీ అధికారులు అందజేశారు. సౌదీలో 'హురూబ్' గా ప్రకటించబడ్డ ప్రవాస భారతీయులు 8,837మంది ఉన్నట్లు సౌదీలోని భారత రాయబార కార్యాలయం వెబ్ సైట్ లో ప్రకటించారు. గతనెలలో ప్రకటించిన సమాచారం ప్రకారం భారత రాయబార కార్యాలయాలు ఇప్పటివరకు 26 వేల అవుట్ పాస్ లను జారీ చేశాయి. అవుట్ పాస్ ల కోసం జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి 26,713 మంది (వీరిలో తెలంగాణ వారు 2,733 మంది, ఆంధ్రప్రదేశ్ వారు 1,120 మంది ఉన్నారు) భారతీయులు దరఖాస్తులు దాఖలు చేశారు. రియాద్ లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి 20,131 మంది దరఖాస్తు చేశారు.
సహాయం కోసం ప్రవాస భారతీయులు సంప్రదించాల్సిన హెల్ప్ డెస్క్ నెంబర్లు ఇవే