కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భరోసా, నైతిక మద్దతు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం కువైట్‌లో పర్యటించింది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా వెంట మాజీ దౌత్యవేత్త, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జె.ఎన్.వెంకట్, ప్రవాసీ కార్మిక నాయకులు కె. ఎస్.రాం, ఎమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (ప్రవాసీ సంక్షేమ వేదిక) అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఉన్నారు.
కువైట్ క్షమాబిక్ష పథకంలో స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న పేద ప్రవాసీ కార్మికుల్లో వంద మందికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విమాన టికెట్లు ఇస్తున్నామని కుంతియా తెలిపారు. టికెట్లు ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రవాసీలను మోసగించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కార్మికుల తిరుగు ప్రయాణానికి మానవతా దృక్పథంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్లు ఇవ్వడానికి ముందుకువచ్చిన డాక్టర్ జేఎన్ వెంకట్ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), కేఆర్ సురేష్‌రెడ్డి (ఆర్మూర్), సుదర్శన్‌రెడ్డి (బోధన్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్)లను కుంతియా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment