ramachandra kuntiya
-
గల్ఫ్ కార్మికులకు హక్కులు కల్పించాలి: కుంతియా
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికులకు అన్ని రకాల హక్కులు కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా అన్నారు. గురువారం బేగంపేటలో వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం గురించి దక్షిణ భారత స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుంతియా మాట్లాడుతూ ఇండియాలో బ్రిటిషర్లు ప్రారంభించిన వలసలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. విదేశాల్లో ఎంత కష్టపడినా వారికి సరైన ఫలితం దక్కడం లేదన్నారు. దళారులు, ఏజెంట్ల చేతిలో మోస పోయి, కుటుంబాలకు దూరంగా కాలం వెళ్లదీస్తున్నారన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో కొన్ని కంపెనీలు కార్మికులకు రెండేళ్లుగా జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. వలస కార్మికులు గల్ఫ్ దేశాలు వెళ్లి ఇబ్బందులు పడకుండా మన దేశంలోనే వారికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం వెళ్లి పనిచేస్తున్న వారికి పనిచేసే చోట ఓటు హక్కు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రూ.500 కోట్ల హామీ ఏమైంది? జానారెడ్డి మాట్లాడుతూ మూడు కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పనిచేస్తుండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగభారం తగ్గిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్లు ఖర్చు పెడతామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా అది ఏ విధంగా ఖర్చు పెడతారనేది స్పష్టత లేదన్నారు. సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం వలసలకు ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. 10 లక్షల వలస కార్మికులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
థర్డ్‌ఫ్రంట్ ఓ బూటకం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్న థర్డ్‌ఫ్రంట్ నాటకం బూటకమని, అది తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని సీఎం కేసీఆర్, డిసెంబర్లో జరిగే ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని భావించి వారిని తప్పుదోవ పట్టించేందుకు ఫ్రంట్ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బయటికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపుసభ గురువారంరాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కుంతియా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. విలాసవంతమైన జీవితంలో కేసీఆర్ కుటుంబం: ఉత్తమ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు హుజూరాబాద్‌లో సభే సమాధానం చెబుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోందన్నారు. వ్యవసాయ పెట్టుబడి కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మంలో రైతులు మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమంటే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈటల జైలుకు వెళ్లకతప్పదు: రేవంత్ ఆదర్శాలను వల్లించే హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలను ఈటల అక్రమంగా సంపాదించుకున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ కింద రైసుమిల్లర్లకు రా రైసుకు క్వింటాల్‌కు రూ.15, బాయిల్డ్‌కు క్వింటాల్‌కు రూ.25 చెల్లించాల్సి ఉండగా, రూ.30, రూ.50 పెంచి రూ.70 కోట్ల అదనపు భారం పడేలా చేశారని, ఇందులో పెద్దమొత్తంలో చేతులు మారాయని అన్నారు. రవాణా, ఇతర ఖర్చుల కింద మిల్లర్లకు రూ.270 కోట్లు చెల్లించారని, ఇందులోనూ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకోగా, ఆడిట్ అభ్యంతరాలతో బయటపడిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ.కోట్ల కుంభకోణం జరిగితే గుడ్డిగా సంతకం చేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్‌తోపాటు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, జీవన్‌రెడ్డి, శ్రీ«ధర్‌బాబు, పొన్నం, బలరాంనాయక్, టి.సంతోష్‌కుమార్, వెంకటరమణారెడ్డి,శారద పాల్గొన్నారు. -
భారతీయ కార్మికులకు అండగా ఉంటాం
కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) పథకంలో వాపస్ రావాలనుకుని ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయ కార్మికులకు భరోసా, నైతిక మద్దతు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కార్మిక సంఘాలు, పౌర సమాజ సంస్థల సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం కువైట్‌లో పర్యటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా వెంట మాజీ దౌత్యవేత్త, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం కన్వీనర్ నంగి దేవేందర్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జె.ఎన్.వెంకట్, ప్రవాసీ కార్మిక నాయకులు కె. ఎస్.రాం, ఎమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం (ప్రవాసీ సంక్షేమ వేదిక) అధ్యక్షుడు మంద భీంరెడ్డి ఉన్నారు. కువైట్ క్షమాబిక్ష పథకంలో స్వదేశానికి వెళ్లడానికి విమాన టికెట్లకు డబ్బులు లేక ఇబ్బందిపడుతున్న పేద ప్రవాసీ కార్మికుల్లో వంద మందికి కాంగ్రెస్ పార్టీ పక్షాన విమాన టికెట్లు ఇస్తున్నామని కుంతియా తెలిపారు. టికెట్లు ఇస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రవాసీలను మోసగించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కార్మికుల తిరుగు ప్రయాణానికి మానవతా దృక్పథంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్లు ఇవ్వడానికి ముందుకువచ్చిన డాక్టర్ జేఎన్ వెంకట్ (కోరుట్ల), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), షబ్బీర్ అలీ (కామారెడ్డి), కేఆర్ సురేష్‌రెడ్డి (ఆర్మూర్), సుదర్శన్‌రెడ్డి (బోధన్), మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), ఈరవత్రి అనిల్ (బాల్కొండ), నంగి దేవేందర్‌రెడ్డి (మక్తల్)లను కుంతియా అభినందించారు. -
రేవంత్‌తో కుంతియా భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత ఎ.రేవంత్‌రెడ్డితో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రామచంద్ర కుంతియా భేటీ అయ్యారు. శనివారం రేవంత్ నివాసానికి వెళ్లిన కుంతియా గంటకుపైగా సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు.అనంతరం కుంతియా మాట్లాడుతూ, రేవంత్ చేరిక కాంగ్రెస్ బలోపేతానికి ఉపయోగపడుతోందన్నారు. కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసాలపై రేవంత్ సహా ముఖ్య నేతలంతా ఎండగడతారని చెప్పారు. రేవంత్‌తో భేటీలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన సందర్భంగా మర్యాదపూర్వకంగానే భేటీ జరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ బిజీగా ఉన్నారని, త్వరలోనే రాష్ట్ర పర్యటన ఖరారు అవుతుందని వెల్లడించారు. టీఆర్ఎస్ ఉపాధి కూలీగా రమణ: రేవంత్‌రెడ్డి డిసెంబర్ 9 తర్వాత సీఎం కేసీఆర్ నిద్రపోరని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 9 నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని, ఆ తర్వాత కేసీఆర్ ఆలోచనలన్నీ తన చుట్టూనే తిరుగుతాయని పేర్కొన్నారు. రాజకీయంగా ఎత్తుగడలు తనకూ ఉన్నాయని చెప్పారు. చెప్పాల్సిన అంశాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పానని, టీడీపీ ముసుగులో ఉంటూ కేసీఆర్ ఇస్తున్న ఉపాధి కూలీతో బతుకుతున్న ఎల్.రమణ వంటి నాయకులకు చెప్పాల్సిందేమీ లేదని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాపై నోరుపారేసుకున్న రమణ.. అదే సమయంలో టీఆర్ఎస్లో చేరిన భూపాల్‌రెడ్డి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. కొడంగల్‌లో సభ పెడతానంటున్న టీడీపీ నేతలు గజ్వేల్‌లో, సిద్దిపేటలో ఎందుకు సభలు పెట్టడంలేదో చెప్పాలి’అని సవాల్ చేశారు. టీడీపీ ముసుగును తీసేసి టీఆర్ఎస్లో చేరడం రమణకు మంచిదని సూచించారు. టీడీపీ ముసుగులో టీఆర్ఎస్ ఉపాధి కూలీగా రమణ పని చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఉపాధి కూలీల సర్టిఫికెట్లు తనకు అవసరం లేదన్నారు. టీడీపీ నేతలందరినీ టీఆర్ఎస్లో చేర్పించిన తర్వాతనే రమణ టీఆర్ఎస్లో చేరుతారని ఆరోపించారు. కొడంగల్‌లో రమణను ఎవరు గుర్తిస్తారని, ముందుగా తన నియోజకర్గమైన జగిత్యాలలో సభ పెట్టుకుని గెలవాలని సూచించారు. రమణ వంటి ఉపాధి కూలీలపై కాదు, కేసీఆర్‌పైనే తన యుద్దమని స్పష్టం చేశారు. -
డిగ్గీ రాజా ఔట్.. కుంతియా ఇన్
► దిగ్విజయ్ స్థానంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జిగా నియమించిన సోనియా ► రెండో ఇన్చార్జిగా కర్ణాటకకు చెందిన సతీశ్ జర్కిహోలి సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా నియామకమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తుతం తెలంగాణ పార్టీ ఇన్చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను తొలగించి.. రెండో ఇన్చార్జిగా ఉన్న కుంతియాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ మంగళవారం ప్రకటించారు. రెండో ఇన్చార్జిగా కర్ణాటకకు చెందిన సీనియ ర్ నేత సతీశ్ జర్కిహోలిని నియమించినట్లు వెల్లడించారు. వాస్తవానికి దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పిస్తారని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అక్టోబర్ నెలాఖరునాటికి ఏఐసీసీలో సంస్థాగతంగా మార్పులు చేయాలన్న యోచనతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల నుంచి దిగ్విజయ్‌ను తప్పించినట్టుగా పార్టీ సీనియర్లు చెబుతున్నారు. విభజనకు ముందు నుంచీ.. దిగ్విజయ్ సింగ్ 2004 నుంచి మూడేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జిగా పనిచేశారు. అనంతరం 2013లో తిరిగి ఈ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీలకు ఇన్చార్జిగా కొనసాగారు. వీటితోపాటు ఇటీవలి వరకు గోవా, కర్ణాటకల రాష్ట్రాల బాధ్యతలూ చూశారు. మార్చిలో గోవా బాధ్యతలను, మేలో కర్ణాటక రాష్ట్ర ఇన్చార్జి పదవి నుంచి తొలగించగా... తాజాగా తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఉత్తమ్ మాటే నెగ్గిందా! దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించడానికి ఉత్తమ్ కారణమని పార్టీ వర్గాల్లో వాదన వినిపిస్తోంది. మరికొందరు నేతలు మాత్రం ఈ మార్పుకు, రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు సంబంధం లేదని చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే అక్టోబర్ నాటికి టీపీసీసీ చీఫ్ మారతారని.. వచ్చే ఎన్నికల కోసం కొత్త సారథిని నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్‌ను తొలగించాలని డిమాండ్ చేసే నేతలకు దిగ్విజయ్ సహకరిస్తున్నారనే ప్రచారమూ ఉంది. పలు అంశాల్లో దిగ్విజయ్‌కు, ఉత్తమ్‌కు మధ్య సఖ్యత సరిగా లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో నేరుగా సంబంధాలున్న ఉత్తమ్‌ను తొలగించడానికి వారు సిద్ధపడలేదని.. అందువల్ల దిగ్విజయ్‌నే రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించారని కొందరు నేతలు వాదిస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీలో ఉత్తమ్ మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం దిగ్విజయ్ మార్పునకు, రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదని అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం అయిన దిగ్విజయ్‌సింగ్‌కు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు కీలకమని.. అక్కడ పూర్తికాలం పనిచేయాల్సి ఉన్నందునే తెలంగాణ వ్యవహారాల నుంచి ఉపశమనం కలిగించారని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాన ని.. అందువల్ల తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని దిగ్విజయ్ అధిష్టానాన్ని కోరార ని వారు అంటున్నారు. మరోవైపు దీర్ఘకాలం పాటు పార్టీ వ్యవహారాల బాధ్యతల్లో ఉన్న దిగ్విజయ్‌ను తప్పించడం వల్ల రాష్ట్రంలో పార్టీకి లాభమా, నష్టమా అన్న దానిపై పార్టీ ముఖ్యులు విశ్లేషించుకుంటున్నారు. సౌత్‌జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా జె.గీతారెడ్డి ఏఐసీసీలో నూతన విభాగంగా ఏర్పాటు చేసిన ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సౌత్‌జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా జె.గీతారెడ్డి నియమితులయ్యారు. వైస్ చైర్మన్, వెస్ట్‌జోన్ కో–ఆర్డినేటర్‌గా మిలింద్ దేవ్రా, ఈస్ట్ జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా గౌరవ్ గొగోయ్, నార్త్ జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా సల్మాన్ సోజ్ నియమితులైనట్టు జనార్దన్ ద్వివేదీ ప్రకటించారు. -
వారికి లక్షల కోట్లు కట్టబెడుతున్నారు
‘చలో వెలగపూడి’లో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఆరోపణ సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీలు చేసే పేదలపై ట్యాక్స్‌లు వేసి ఆ మొత్తాన్ని ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే అంబానీ, అదానీ కంపెనీలకు లక్షల కోట్లు సునాయాసంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి రామచంద్ర కుంతియా ధ్వజమెత్తారు. నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం చలో వెలగపూడి (సచివాలయం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉన్న ఫళంగా పెద్దనోట్లు రద్దు చేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో పనిలో పనిగా రూ.కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను బీజేపీ, టీడీపీ నేతలు బ్యాంకుల్లో మార్చుకున్నారని ఆరోపించారు. -
నోట్ల రద్దుపై గ్రామస్థాయిలో ఉద్యమం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్య మించాలని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి రామచంద్ర కుంతియా సూచించారు. పార్టీ నేతలతో గాంధీ భవన్ లో మంగళవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం రాకపోగా పేదల కష్టాలు, చిల్లర కరెన్సీ కోసం ఇబ్బందులు పెరిగాయని అన్నారు. నోట్ల రద్దు నల్ల కుబేరులకు లాభం చేస్తూ పేదలకు నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సాహిత్యం, పార్టీ సిద్ధాంతం, పార్టీ నాయకుల కార్యక్రమాలను కార్యకర్తలకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి కాంగ్రెస్ సందేశ్ పుస్తకాలను మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ గౌడ్, అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
అధికారముందని విర్రవీగితే పరాభవమే
బీజేపీకి ఢిల్లీలో పట్టిన గతి టీఆర్ఎస్కు తప్పదు టీఆర్ఎస్కు ఏఐసీసీ నేత కుంతియా హెచ్చరిక హైదరాబాద్: అధికారం ఉందని అహంభావంతో విర్రవీగితే ప్రజల చేతుల్లో పరాభవం తప్పదని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి రామచంద్ర కుంతియా హెచ్చరించారు. సచివాలయం, ఛాతీ ఆసుపత్రిని మార్చొద్దంటూ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసుల చేతిలో గాయపడిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గీతారెడ్డితో కలసి కుంతియా మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ప్రకారం గాంధేయమార్గంలో ర్యాలీని ప్రారంభిస్తే పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కిరాతకంగా దాడి చేయడం గర్హనీయమన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరిస్తే ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు పడుతుందని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశ రాజధానిలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని కుంతియా అన్నారు. ఢిల్లీలో 15 ఏళ్లపాటు వరుసగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకత వల్లే ఓడిపోయామని వివరించారు. అధికారంలోకి వస్తామన్న బీజేపీకి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదంటే 8 నెలల్లోనే ఆ పార్టీపై వచ్చిన వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. ఈ ప్రజాతీర్పును తెలంగాణరాష్ట్రంలో టీఆర్ఎస్ కూడా గమనంలో ఉంచుకుంటే మంచిదని హితవు పలికారు. తప్పులు చేయొద్దంటే దాడిచేస్తారా: పొన్నాల సచివాలయం మార్చడం, ఛాతీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించడం వంటి తప్పులు చేయొద్దంటూ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో ప్రభుత్వం దాడి చేయించిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రజల ఆగ్రహాన్ని, కాంగ్రెస్ ఉద్యమాలను కట్టడి చేయలేరని హెచ్చరించారు. మొన్నటిదాకా తెలంగాణకోసం టీఆర్ఎస్ చేసిన ఉద్యమాలకు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతో సహకరించామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ను ప్రజాకోర్టులోనే నిలదీస్తామని హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ- కిరణ్‌బేడీ ఎన్నికల్లో జోడీ కట్టినా ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా బీజేపీ యూ-టర్న్ తీసుకున్నదన్నారు. -
ఐక్యతారాగం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘నువ్వా దరిని.. నేనీ దరిని’ అంటూ గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంగళవారం ఒకే వేదికపైకి చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, రాష్ట్ర ఇన్చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరైన బోధన్ సభలో ఐక్యతారాగం వినిపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు చేదు ఫలితాలు ఇచ్చినా, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదన్న ఆపవాదును దూరం చేసే ప్రయత్నం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు తీరుతెన్నులపై సమీక్షించేందుకు బోధన్‌లోని ఓ ఫంక్షన్హాల్లో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని విజయవం తం చేసేందుకు రెండు రోజులు బోధన్‌లోనే మకాం వేసిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి అందరినీ ఒకే వేదికపైకి చేర్చేందుకు కృషి చేశారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ దిగ్గజాలు ఐక్యత రాగం వినిపించడం కార్యకర్తలలో చర్చనీయాంశంగా మారింది. శాసనమండలి విపక్షనేత డి. శ్రీనివాస్, ఉపనేత మహ్మద్ అలీ షబ్బీర్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ సురేష్‌కుమార్ శెట్కార్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, డీసీసీబీ చైర్మన్ గంగాధర్‌పట్వారీ, మాజీ ఎమ్మెల్యేలు సౌదాగర్ గంగారాం, సౌదాగర్ సావిత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత్వ న మోదు కార్యక్రమానికి మరో రెండు నెలల గడువు పెరగగా, ఇప్ప టి కే 82 శాతం పూర్తి చేసిన జిల్లా అగ్రగామిగా ఉందని కుంతి యా, పొన్నాల లక్ష్మయ్య సంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల ధ్వజం కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం లో అధికారం చేపట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా, కుట్రపూరితంగా వ్యవహరించిందని, రెండు లక్షల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా ఓటర్లను నమోదు చేసి అక్రమ పద్ధతిని అవలంభించిందని రామచంద్ర కుంతియా మండిపడ్డారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ మత మార్పిడులను ప్రోత్సహిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలసలతో కాలం గడుపుతోందన్నారు. ఆరు నెలల పాలనలో బీజేీ ప, టీఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయని, ప్రజలను ఇం కెంతకాలమో మోసం చేయలేరని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, కేఆర్ సురేష్‌రెడ్డి, సురేశ్‌శెట్కార్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ కెసీఆర్‌ది నియంతృత్వ పాలన అని ధ్వజమెత్తారు. అ ధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పాకులాడలేదన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోని యా గాంధీ, యువనేత రాహుల్‌గాంధీపై పార్టీ కార్య కర్తలు, ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారన్నారు. మతతత్వ పార్టీలను విశ్వసించవద్దని, దేశ ఐక్యత కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. వర్షాభావ పరిస్థి తులతో తీవ్ర కరువు నెలకొన్నందున తక్షణ మే నిజామాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నమ్మి ఓట్లేసి న ప్రజలను నట్టేట ముంచుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తగులుతుందన్నారు. టీఆర్ఎస్ నేతల వేధింపులపై ఆవేదన సభలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకు లు, కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చే శారు. బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోలీసు అధికారులు టీఆర్ఎస్ కా ర్యకర్తలుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ రోపించారు. టీఆర్ఎస్ నేతలు అక్రమవ సూళ్లకు కౌంటర్లు తెరిచారని విమర్శించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ కొందరు నేతలు సభలు, సమావేశాలకే పరిమితమవుతూ, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. పదేళ్లు అ ధికారంలో ఉండి కార్యకర్తలకేమీ చేయలే క పోయామని, ప్రస్తుత పరిస్థితులలో అయి నా, కొందరు నేతలు హైదరాబాద్‌లో ఉంటూ ఫోన్లు ఎత్తకుండా ఉంటే కార్యకర్తలు మన వెంట ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఉన్నతస్థాయి నేతలు కార్యకర్తల బాగోగులు చూడాలని కోరారు. జడ్పీటీసీ సభ్యురాలు పుప్పాల శోభ, బాన్సువాడ ఇన్చార్జి కాసుల బాలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై టీఆర్ఎస్ నేతల పెత్తనం పెరి గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ సభ్యులకు కేటాయించే నిధులను సైతం ఎమ్మెల్యేలు మళ్లించుకుంటున్నారని శోభ ఆరోపించగా, టీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కక్షపూరి తంగా వ్యవహరిస్తూ, అక్రమ కేసులలో ఇరి కిస్తున్నారు బాలరాజు పేర్కొన్నారు. స్పం దించిన పొన్నాల లక్ష్మయ్య, డి.శ్రీనివాస్, సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సురేష్‌రెడ్డి తదితరులు కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ వేధింపులను సహించేది లేదని, ధైర్యంతో ముందుకు సాగుతామన్నారు. కార్యకర్తలకు బాసటగా ఉంటామని ప్రతిన చేశారు. నేతలకు దిశానిర్దేశం చేసిన కుంతియా, పొన్నా ల పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా కలిసి నడవాలని పిలుపునిచ్చారు. -
నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు
{పారంభించనున్న ఏఐసీసీ దూత రామచంద్రకుంతియా డిండిలోని ప్రైవేట్ ఫంక్షన్హాల్లో కార్యక్రమం హాజరుకానున్న రాష్ట్ర, జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లాలో ఆదివారం ప్రారంభంకానుంది. తెలంగాణ కాంగ్రెస్ పిలుపుమేరకు పార్టీలో యువరక్తాన్ని నింపాలన్న లక్ష్యంతో సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. జిల్లాలో తొలిసారిగా దేవ రకొండ డివిజన్ పరిధిలోని డిండి మండల కేంద్రంలోని ఫంక్షన్హాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ దూత రామచంద్ర కుంతియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ పక్ష నేత కుందూరు జానారెడ్డి, తెలంగాణ వర్కి ంగ్ ప్రెసిండెంట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, జె డ్పీ చైర్మన్ నేనా వత్ బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి తో పాటు ఇతర పార్టీ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. తొలి రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డిండిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్యక ర్తలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయం కొత్త సభ్యత్వాలతో పాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో జిల్లా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. దీంతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామ, మండల శాఖలు కూడా టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా తయారైంది. అదీగాక పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్న నేతలు సైతం వివిధ కార్యక్రమాలకు గైర్హాజరుకావడం పట్ల పార్టీలో పలువురు సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందిరా, రాజీవ్ గాంధీ వర్ధంతులు, చాచా నెహ్రూ జయంతి వేడుకులకు కూడా జిల్లా పార్టీ నాయకులు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో పార్టీ పెద్దలు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీలో ఇంటిలొల్లి తీవ్రంకావడంతో పార్టీ ఉనికికే ముప్పు ఏర్పడింది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారంతా తమ నియోజకవర్గం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చేపడతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ మేరకు ముందుకు సాగుతుందో వేచి చూడాలి. -
టీసీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా!
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు కుంతియా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న విద్యుత్ సమస్య, రైతు రుణమాఫీ ఇతర అంశాలపై నిలదీసేందుకు టీఎల్పీ సిద్దమవుతోంది. ఈ సమావేశానికి మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు అయ్యారు. -
అధిష్టానం దూతగా రామచంద్రన్ కుంతియా
హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్పు కేబినెట్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధిష్టానం.... ఏఐసీసీ కార్యదర్శి రామచంద్రన్ కుంతియాను రంగంలోకి దించింది. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో రామచంద్రన్ కుంతియా ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీధర్ బాబు వ్యవహారాన్ని చక్కదిద్దే పనితో పాటు రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు బస్సుయాత్రలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రామచంద్రన్ కుంతియా మీడియాతో మాట్లాడుతూ మంత్రుల శాఖలు మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని అన్నారు. అయితే ఏ సందర్భంలో శాఖ మార్చారో తెలుసుకుంటానని, వివాదాలు సమసిపోతాయని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో శాఖల మార్పు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై సీఎంతో పాటు, తెలంగాణ మంత్రులు, శ్రీధర్ బాబుతో సమావేశం కానున్నట్లు రామచంద్రన్ కుంతియా తెలిపారు. శాఖ మార్పుపై అసంతృప్తిగా ఉన్న శ్రీధర్ బాబు నేడు తన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.