డిగ్గీ రాజా ఔట్.. కుంతియా ఇన్
► దిగ్విజయ్ స్థానంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమించిన సోనియా
► రెండో ఇన్‌చార్జిగా కర్ణాటకకు చెందిన సతీశ్ జర్కిహోలి
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియా నియామకమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రస్తుతం తెలంగాణ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను తొలగించి.. రెండో ఇన్‌చార్జిగా ఉన్న కుంతియాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ మంగళవారం ప్రకటించారు.
రెండో ఇన్‌చార్జిగా కర్ణాటకకు చెందిన సీనియ ర్ నేత సతీశ్ జర్కిహోలిని నియమించినట్లు వెల్లడించారు. వాస్తవానికి దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పిస్తారని కొంతకాలంగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అక్టోబర్ నెలాఖరునాటికి ఏఐసీసీలో సంస్థాగతంగా మార్పులు చేయాలన్న యోచనతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల నుంచి దిగ్విజయ్‌ను తప్పించినట్టుగా పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
విభజనకు ముందు నుంచీ..
దిగ్విజయ్ సింగ్ 2004 నుంచి మూడేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జిగా పనిచేశారు. అనంతరం 2013లో తిరిగి ఈ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీలకు ఇన్‌చార్జిగా కొనసాగారు. వీటితోపాటు ఇటీవలి వరకు గోవా, కర్ణాటకల రాష్ట్రాల బాధ్యతలూ చూశారు. మార్చిలో గోవా బాధ్యతలను, మేలో కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించగా... తాజాగా తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
ఉత్తమ్ మాటే నెగ్గిందా!
దిగ్విజయ్‌సింగ్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించడానికి ఉత్తమ్ కారణమని పార్టీ వర్గాల్లో వాదన వినిపిస్తోంది. మరికొందరు నేతలు మాత్రం ఈ మార్పుకు, రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు సంబంధం లేదని చెబుతున్నారు. వాస్తవానికి వచ్చే అక్టోబర్ నాటికి టీపీసీసీ చీఫ్ మారతారని.. వచ్చే ఎన్నికల కోసం కొత్త సారథిని నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్‌ను తొలగించాలని డిమాండ్ చేసే నేతలకు దిగ్విజయ్ సహకరిస్తున్నారనే ప్రచారమూ ఉంది. పలు అంశాల్లో దిగ్విజయ్‌కు, ఉత్తమ్‌కు మధ్య సఖ్యత సరిగా లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో నేరుగా సంబంధాలున్న ఉత్తమ్‌ను తొలగించడానికి వారు సిద్ధపడలేదని.. అందువల్ల దిగ్విజయ్‌నే రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించారని కొందరు నేతలు వాదిస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీలో ఉత్తమ్ మాటే చెల్లుబాటు అవుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం దిగ్విజయ్ మార్పునకు, రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేదని అభిప్రాయపడుతున్నారు.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం అయిన దిగ్విజయ్‌సింగ్‌కు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు కీలకమని.. అక్కడ పూర్తికాలం పనిచేయాల్సి ఉన్నందునే తెలంగాణ వ్యవహారాల నుంచి ఉపశమనం కలిగించారని చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాన ని.. అందువల్ల తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని దిగ్విజయ్ అధిష్టానాన్ని కోరార ని వారు అంటున్నారు. మరోవైపు దీర్ఘకాలం పాటు పార్టీ వ్యవహారాల బాధ్యతల్లో ఉన్న దిగ్విజయ్‌ను తప్పించడం వల్ల రాష్ట్రంలో పార్టీకి లాభమా, నష్టమా అన్న దానిపై పార్టీ ముఖ్యులు విశ్లేషించుకుంటున్నారు.
సౌత్‌జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా జె.గీతారెడ్డి
ఏఐసీసీలో నూతన విభాగంగా ఏర్పాటు చేసిన ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సౌత్‌జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా జె.గీతారెడ్డి నియమితులయ్యారు. వైస్ చైర్మన్, వెస్ట్‌జోన్ కో–ఆర్డినేటర్‌గా మిలింద్ దేవ్‌రా, ఈస్ట్ జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా గౌరవ్ గొగోయ్, నార్త్ జోన్ రీజనల్ కో–ఆర్డినేటర్‌గా సల్మాన్ సోజ్ నియమితులైనట్టు జనార్దన్ ద్వివేదీ ప్రకటించారు.