సాక్షి, న్యూఢిల్లీ: నిరంతరం ప్రజల్లో ఉంటూ మోదీ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటానికి చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. జాతీయ సమస్యలపై నిరంతర ఆందోళన కార్యక్రమాల కోసం ఇటీవల సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఏర్పాటు చేసిన 9మంది సభ్యుల కమిటీ మంగళవారం తొలిసారి భేటీ అయ్యింది. దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో చేపట్టబోయే అంశాలపై ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వార్ రూంలో 2 గంటల పాటు కమిటీ సభ్యులు చర్చించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు... కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రాత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, జుబేర్ ఖాన్, రాగిణి నాయక్, ఉదిత్ రాజ్‌లు పాల్గొని అభిప్రాయాలను వెల్లడించారు.
10 అంశాలపై పోరాటం
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్, వ్యవసాయ చట్టాలు, పెగాసస్, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు, రాజద్రోహం చట్టాలు, కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం, కుల జనగణన, ఈవీఎంల రద్దు, 60 నుంచి 80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి 10 అంశాలపై దిగ్విజయ్ నేతృత్వంలోని కమిటీ ఒక ప్రణాళికను రూపొందించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పలు వ్యూహాలను దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ రూపొందించింది.
దేశవ్యాప్తంగా దళితులను తిరిగి పార్టీకి దగ్గర చేయడంతో పాటు, 10 లక్షల బూత్‌లకు పార్టీ చేరుకొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కమిటీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రెండు గంటల పాటు జరిగిన కమిటీ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించామని, ఏ ప్రజా సమస్యలను చేపట్టి ఏ విధంగా ఆందోళనలు చేపట్టాలి అనే అంశంపై చర్చ జరిగిందని తెలిపారు. 2024 వరకు ప్రజా సమస్యలపై ఆందోళనలు కొనసాగుతాయని మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ తెలిపారు. 2014లో ధరలు ఎలా ఉన్నాయి... ఇప్పుడెలా ఉన్నాయో ప్రజలకు తెలియచేసేలా దేశవ్యాప్తంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తామన్నారు. రెండు, మూడు రోజుల్లో కమిటీ నివేదికను చైర్మన్ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అందిస్తారని ఉదిత్‌రాజ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment