సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు.
ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది
వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు.
ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్‌కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్‌పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్‌కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment