ambika soni
-
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు. ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్‌కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్‌పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్‌కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత గుడ్‌బై
చండీగఢ్: చింతన్ శిబిర్ పేరుతో మేధో మథనం చేస్తున్న వేళ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, దివంగత నేత బలరాం జాఖడ్ కుమారుడు, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారంటూ షోకాజ్ నోటీసివ్వడం, పదవుల నుంచి తొలగించడంతో మనస్తాపానికి లోనై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘నా గుండె బద్దలైంది. అందుకే పార్టీలో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నాను. కాంగ్రెస్‌కు నేను చెప్పే ఆఖరి మాటలివే. గుడ్ లక్. అండ్ గుడ్‌బై కాంగ్రెస్’’ అని శనివారం ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించారు. చింతన్ శిబిర్‌ను ప్రహసనంగా అభివర్ణించారు. దానికి బదులు కాంగ్రెస్ ‘చింతా’ శిబిర్ నిర్వహించాలన్నారు. కొందరు ఢిల్లీలో కూర్చొని పంజాబ్‌ను నాశనం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోనిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌లో మంచి నాయకుడు రాహుల్ గాంధీయేనన్నారు. భజనపరుల్ని దూరం పెట్టి శత్రువులెవరో, మిత్రులెవరో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. జాఖఢ్ వంటి నాయకున్ని వదులుకోవద్దని పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. -
ఎవరీ చన్నీ?
పంజాబ్ సీఎంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. చన్నీ తండ్రి హర్సా సింగ్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా, బ్లాక్ సమితీ సభ్యుడిగా పనిచేశారు. తండ్రి నుంచి చన్నీ రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు. స్కూల్ యూనియన్ నాయకుడిగా ఎన్నికయ్యారు. పాఠశాల విద్య తర్వాత చండీగఢ్‌లోని గురు గోవింద్‌సింగ్ కాలేజీలో చేరారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ అందుకున్నారు. తర్వాత జలంధర్‌లోని పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. హ్యాండ్‌బాల్ క్రీడలో ఆయనకు మంచి ప్రావీణ్య ఉంది. ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ మీట్లో బంగారు పతకం సాధించడం విశేషం. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి.. చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా 2007లో చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012, 2017లోనూ అదే స్థానం నుంచి వరుసగా గెలిచారు. అంతకంటే ముందు మూడు పర్యాయాలు ఖరారా మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. రెండుసార్లు కౌన్సిల్ అధ్యక్షుడిగా పని చేశారు. 2015–16లో పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2017 మార్చిలో అమరీందర్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత పదవుల్లో, ప్రభుత్వ పోస్టుల్లో దళితులు అవకాశాలు దక్కడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం వినిపించి అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. సీఎంను మార్చాలంటూ కాంగ్రెస్ నాయకత్వంపై ఒత్తిడి పెంచిన మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆయన కూడా ఉన్నారు. 2018లో ఓ మహిళా ఐఏఎస్ అధికారికి అనుచితమైన మెసేజ్ పంపించినట్లు చన్నీపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పంజాబ్‌లో ‘మీ టూ’వివాదంలో ఆయన కేంద్ర బిందువుగా మారారు. సదరు ఐఏఎస్ అధికారిణి ఆయనపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తర్వాత వివాదం పరిష్కారమైందని నాటి సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. అయితే, ‘మీ టూ’వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ మహిళా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జ్యోతిష్యంపై గురి ఎక్కువ... జ్యోతిష్యాన్ని బాగా విశ్వసించే చన్నీ రాజకీయాల్లో వెలిగిపోవడానికి పూజలు, యాగాలు అధికంగా చేస్తుంటారని ఆయన సన్నిహితులు చెప్పారు. 2017లో మంత్రివర్గంలో చేరిన వెంటనే ఓ జ్యోతిష్యుడి సూచన మేరకు చండీగఢ్‌లోని తన ఇంటికి తూర్పు దిశగా రాకపోకల కోసం ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్కులో నుంచి అక్రమంగా రోడ్డును నిర్మించుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ రోడ్డును కార్పొరేషన్ అధికారులు మూసివేశారు. అలాగే ఓ జ్యోతిష్యుడి సలహాతో చన్నీ ఖరార్‌లోని తన ఇంటి ప్రాంగణంలో ఏనుగుపై ఊరేగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. – నేషనల్ డెస్క్, సాక్షి సీఎం పదవి వద్దన్నాను: అంబికా సోని న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్న ఆఫర్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఆదివారం చెప్పారు. ఆ సూచనను సున్నితంగా తిరస్కరించానని, సిక్కు నాయకుడే పంజాబ్ సీఎంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని తెలిపారు. శనివారం రాజీనామా చేసిన అమరీందర్ వారసుడి ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చలు జరిపింది. పార్టీ నేత రాహుల్ గాంధీతో శనివారం రాత్రి, ఆదివారం అంబికా సోనితో భేటీ అయ్యారు. కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ పార్టీ పెద్దలు తనను కోరిన మాట నిజమేనని ఆమె మీడియాతో చెప్పారు. కానీ, పంజాబ్‌లో గత 50 ఏళ్లుగా సిక్కు నాయకులే ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. దేశంలో సిక్కు సీఎం ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబేనని పేర్కొన్నారు. -
సుష్మా స్వరాజ్‌కు కాంగ్రెస్ ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. సుష్మాకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘటన నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత అంబికా సోని ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఐసిస్ చేతిలో బంధీలైన 39 మంది భారతీయ విషయంలో సుష్మా పార్లమెంట్‌ను, వారి బంధువులను మోసం చేశారు. ఇంతకాలం వారు బతికే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ కుటుంబ సభ్యులను పక్కదారి పట్టించారు. అందుకే ఈ నోటీసులు అని అంబికా సోని తెలిపారు. రాజ్యసభలో ఈ తీర్మాన నోటీసులు ప్రవేశపెట్టనున్నట్లు అంబికా వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు శశిథరూర్, గులాం నబీ ఆజాద్‌లు విదేశాంగ శాఖపై మండిపడ్డారు. మరోవైపు కేంద్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తోందని అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే.. ఈ నోటీసుల అంశం తెరపైకి రావటం విశేషం. కాగా, పంజాబ్‌కు చెందిన 39 మంది భారతీయ కూలీలు.. 2014లో ఇరాక్ రెండో అతిపెద్ద నగరం మోసుల్ లో కిడ్నాప్‌కు గురయ్యారు. ఇంతకాలం వారు క్షేమంగానే ఉన్నారంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్న కేంద్రం.. చివరకు మంగళవారం వారంతా ప్రాణాలతో లేరనే విషయాన్ని ప్రకటించింది. ఆ 39 మందిని చంపేశారు.. వాళ్లను చంపటం అతను చూడలేదు -
కశ్మీర్ పరిస్థితులపై కాంగ్రెస్ ఆరా
సాక్షి, శ్రీనగర్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఒక బృందం కశ్మీర్ పరిస్థితులను తెలుసుకునేందుకు శనివారం శ్రీనగర్ చేరుకుంది. మన్మోహన్ బృందం రెండు రోజుల పాటు కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు, శాంతి భద్రతలు, ఇతర అంశాలపై పరిశీలన చేయనుంది. అలాగే లోయలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం అవుతుంది. జమ్మూ బార్ అసోసియేషన్, ఛాంబర్ ఆప్ కామర్స్లతోనూ చర్చలు జరపనుంది. అంతేకాక యూపీఏ భాగస్వామ్య పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు, వివిధ పక్షాల నాయకులు, సామాజిక కార్యకర్తలతో మన్మోహన్ బృందం చర్చలు జరపనుంది. ఈ బృందంలో మన్మోహన్ సింగ్‌తో పాటు మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అంబికా సోని, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ ఉన్నారు. -
'రాహుల్‌కు త్వరలో బాధ్యతలు.. ఇంకేం చెప్పను'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలను అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టనున్నట్లు స్పష్టమైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అంబికా సోనీ స్పష్టం చేశారు. అయితే, అంతకుమించి వివరాలు తెలియజేసేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. 'త్వరలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారనున్నారనే విషయం మాకు తెలుసు. ఇంతకుమించిన వివరాలేవి మీకు నేను అందించలేను' అని అంబికాసోనీ మంగళవారం మీడియాతో చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
ముక్కోణపు ప్రేమలో క్రైమ్
మోడల్ ఉపేన్‌ను హీరోగా పరిచయం చేస్తూ, ముక్కోణపు ప్రేమకథతో ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టేట్స్’. శ్రవణ్‌కుమార్ నల్లా దర్శకుడు. అంబికా సోనీ, తాన్యా శర్మ కథానాయికలు. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘బూచమ్మ బూచోడు’ విజయవంతమైంది. ఆ ఉత్సాహంతో ‘లవ్ స్టేట్స్’ చేస్తున్నాం. ఇదో క్రైమ్ లవ్‌స్టోరీ. నూతన సంగీతదర్శకుడు పవన్ పాటలు ప్రత్యేక ఆకర్షణ. వచ్చే నెల 20న రిలీజ్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్. -
వాద్రాను వదిలేయండి: సోనీ
డెహ్రడూన్: జర్నలిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించిన సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోనీ వెనకేసుకొచ్చారు. వాద్రాను వదిలేయాలని ఆమె సూచించారు. 'చట్టం అందరికీ సమానమే. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. వాద్రాను లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యక్తిగత జీవితంలోకి చొరబడాలని మీడియా ప్రయత్నిస్తోంది' అని అంబికా సోని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా అంబికా సోనీ వ్యవహరిస్తున్నారు. శనివారం కాగ్ నివేదికపై ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై రాబర్ట్ వాద్రా ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మైక్రోఫోన్‌ను పక్కకు నెట్టేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాద్రా క్షమాపణ చెప్పాలని బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ కోరింది. -
ఓటమితో అంతా అయిపోలేదు
కాంగ్రెస్ అభ్యర్థులకు సోనియా లేఖలు న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయంతో కుదేలై దిగాలుపడ్డ పార్టీ నేతల్లో మనోస్థైర్యం నింపేందుకు అధినేత్రి సోనియాగాంధీ నడుం బిగించారు. ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులందరికీ ఆమె లేఖలు రాశారు. ‘‘ఓడినంత మాత్రా న అంతా అయిపోయినట్టు కాదు. రాజకీయంగా చురుగ్గా ఉండండి. మీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పని చేయండి’’ అని సూచించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోని శుక్రవారం ఈ మేరకు వెల్లడించారు. సోనియా నుంచి తనకు లేఖ వచ్చిందన్నారు. సోని కూడా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే.