ఢిల్లీలో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అంబికా సోని
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్‌చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్‌లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు.
‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్‌లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు.
జాతీయోద్యమంగా జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు.
మోదీ ప్రభుత్వంపై నిప్పులు
ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు.
ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ
మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’
కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment