న్యూఢిల్లీ: సహచర నాయకుడు శశిథరూర్‌ను ఓడించి ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే (80) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పదవిలో కొనసాగుతున్న తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (75) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు లాంఛనంగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ‘‘అధ్యక్ష బాధ్యతల బరువు నేటితో దిగిపోయింది.
నాకు చాలా ఊరటగా ఉంది’’ అంటూ వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు! మార్పు సహజమంటూ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడారు. కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో పాటు పార్టీ అగ్ర నేతలంతా పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఖర్గేకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఒక మామూలు కార్యకర్త కుమారుడైన అతి సాధారణ కార్యకర్తను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ కుటుంబం మొత్తానికీ కృతజ్ఞతలు. ఇది గొప్ప గౌరవం. నిరంతరం కష్టించి పని చేస్తా. ప్రతి కార్యకర్తకూ గొంతుకగా మారతా. పార్టీలో అన్ని స్థాయిల్లోనూ నాయకత్వాన్ని పెంపొందిస్తా’’ అని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఖర్గేను సోనియా స్వయంగా అధ్యక్ష కార్యాలయంలోకి తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టారు. తన పక్క కుర్చీలో కూర్చోవాల్సిందిగా ఖర్గే కోరగా సున్నితంగా తిరస్కరించారు.
‘భయపడొద్దు’ నినాదంతో ముందుకు
తన ముందున్న సవాళ్ల గురించి పూర్తి అవగాహన ఉందని ఖర్గే అన్నారు. పార్టీగా కాంగ్రెస్‌కు ఇది కష్టకాలమేనని అంగీకరించారు. అయితే కార్యకర్తలు తమలో ఉన్న భయాలను పారదోలితే ఎంతటి సామ్రాజ్యమైనా వారిముందు మోకరిల్లుతుందన్నారు. రాహుల్ ఇచ్చిన ‘భయపడొద్దు’ నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో బీజేపీని ఓడించేందుకు నేతలు, కార్యకర్తలూ స్వరశక్తులూ ధారపోయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పార్టీలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు వయసు వారికే ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను సంపూర్ణంగా అమలు చేసి సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై కళ్లు మూసుకుంటూ ఆశ్రిత పెట్టుబడిదారీ మిత్రులకు సర్వం దోచిపెడుతోందని మండిపడ్డారు. ‘‘గాడ్సేను దేశభక్తునిగా, గాంధీని దేశద్రోహిగా చిత్రిస్తున్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చి సంఘ్ పరివార్ రాజ్యంగం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ దుయ్యబట్టారు.
ఈ అబద్ధాలను బట్టబయలు చేసి, మోసాలను ఎండగట్టి, విద్వేష ప్రచారాలను తుత్తునియలు చేసి తీరతామన్నారు. పార్టీని ఖర్గే మరింత పటిష్టపరుస్తారని, స్ఫూర్తిదాయకంగా నడుపుతారని సోనియా విశ్వాసం వెలిబుచ్చారు. ఇంతకాలం తనకు సహకరించిన నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ కాంగ్రెస్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఓటమిని మాత్రం ఎన్నడూ అంగీకరించలేదని అన్నారు. దేశ ప్రజాస్వామిక సూత్రాలకే పొంచి ఉన్న పెను ముప్పును దీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు పార్టీ ముందున్న పెద్ద సవాలని అభిప్రాయపడ్డారు. అధికారం కోసమే రాజకీయాలు చేసే ఈ కాలంలో సోనియా మాత్రం స్వార్థరహితంగా పార్టీని ముందుకు నడిపారంటూ ఖర్గే కొనియాడారు.
సునాక్‌కు సోనియా లేఖ
బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ను సోనియా అభినందించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమంటూ ఆయనకు లేఖ రాశారు. ఆయన హయాంలో ఇరు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు.
ఆఫీస్ బేరర్ల రాజీనామాలు...
47 మందితో స్టీరింగ్ కమిటీ
47 మందితో కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని నూతన అధ్యక్షుడు ఖర్గే నియమించారు. కాంగ్రెస్ నూతన వర్కింగ్ కమిటీ ఏర్పాటయ్యేదాకా దాని బాధ్యతలను ఖర్గే సారథ్యంలోని ఈ కమిటీ చూస్తుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా, రాహుల్‌తో పాటు గత సీడబ్లు్యసీ సభ్యుల్లో అత్యధికులకు కమిటీలో చోటు దక్కింది. ప్రియాంక, ఏకే ఆంటోనీ, అంబికా సోని, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా, దిగ్విజయ్‌సింగ్, టి.సుబ్బరామిరెడ్డి తదితరులు కమిటీలో ఉన్నారు.
సీడబ్లు్యసీ ప్రత్యేక ఆహ్వానితుల్లో మాత్రం ఎవరికీ చోటు దక్కలేదు. కొత్త టీములను ఏర్పాటు చేసుకునేందుకు ఖర్గేకు వీలు కల్పిస్తూ అంతకుముందు సీడబ్లు్యసీ సభ్యలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు తదితర ఆఫీసు బేరర్లంతా ఆయనకు లాంఛనంగా రాజీనామాలు సమర్పించారు. అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికను ఆమోదించేందుకు వచ్చే మార్చిలో పార్టీ ప్లీనరీ జరిగే అవకాశముంది. ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో గుజరాత్‌లో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment