AICC General Secretary
-
బోసురాజుకు మంత్రి పదవి?
రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజుకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి కల్పించనున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజు అసెంబ్లీ, విధాన పరిషత్ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అసంతృప్తి నెలకొంది. జిల్లాలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, సింధనూరు ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఎన్నికై న ప్రజాప్రతినిధులను కాదని, ఎమ్మెల్యే(ల్సీ) కాని వారిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోసురాజుకు అమాత్య పదవిని కేటాయించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. నాగేంద్రకు అమాత్యగిరి? బళ్లారిఅర్బన్: వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలతో మమేకమై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన యువనేత, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర శనివారం బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. సిద్దరామయ్య కేబినెట్లో సభ్యునిగా నాగేంద్ర పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో సంబరాలు నిండాయి. తాజా ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ కీలక నేత బీ.శ్రీరాములుపై అఖండ మెజార్టీతో జయభేరి మోగించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి వరించిందని తెలుస్తోంది. -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
ఏఐసీసీ కార్యదర్శిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యదర్శిగా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శ్రీధర్‌బాబుతో పాటు మరో నలుగురు ఏఐసీసీ కార్యాదర్శులకు కర్ణాటక బాధ్యతలు అప్పగించారు. -
హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రణదీప్‌సింగ్ సూర్జేవాలా సోమవారం హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డి.కె.శివకుమార్, ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా విడిగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాయచూర్‌లో జరిగే ఓ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి వెళ్తూ ఈ ముగ్గురు మార్గమధ్యలో హైదరాబాద్‌లో బసచేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, కర్ణాటక కాంగ్రెస్ సహ ఇన్చార్జి మధుయాష్కీగౌడ్ నివాసానికి వెళ్లిన వీరు కొంతసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని రాయచూర్‌కు వెళ్లారు. వీరిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. -
పార్టీ ముఖ్యనేతలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఏఐసీసీ కార్యదర్శులు, ఇన్ఛార్జ్లు, పీసీసీ చీఫ్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో దేశవ్యాప్తంగా కేంద్ర పభుత్వ వైఫల్యాలు, సంస్థాగత ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా కేంద్రం వైఫల్యాలపై ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సోనియా గాంధీ ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టారు. చదవండి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ -
ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంటే... విషం చిమ్ముతారా..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల పక్షాన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని, మంత్రులు పిచ్చివాగుడు వాగుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన విషం చిమ్ముతోందని మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారే తెలంగాణ సొంత బిడ్డలయిన కాంగ్రెస్ పార్టీ నేతలపై విషం చిమ్ముతున్నారని బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కరోనాతో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇప్పుడు వందల కోట్లు పెట్టి సచివాలయం ఎందుకు కడుతున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వైద్య సౌకర్యాలు కల్పించడానికి నిధులు సక్రమంగా కేటాయించని ప్రభుత్వం సచివాలయాన్ని కట్టడం అవసరమా అని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబానికి వాస్తు సరిగా లేదని ప్రజలకు చెందిన వేల కోట్ల ఆస్తులతో భవనాలు నిర్మించడం, దాన్ని మంత్రులు సిగ్గులేకుండా సమర్థించడం దౌర్భాగ్యమని అన్నారు. విభజన చట్టాన్ని తామే తయారు చేశామని కేసీఆర్ చెప్పుకున్నారని, మరి ఆ చట్టంలో సెక్షన్ 8 ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులకు చట్టం, రాజ్యాంగం తెలియడం లేదని, చట్టంలో ఉన్నది కాబట్టే తాము అడుగుతున్నామని, అది ఆమలు చేయమని అడగడం బానిసత్వం అవుతుందా అని ప్రశ్నించారు. మంత్రులకు కనీసం సోయి లేకుండా పోయిందని, చదువు, సంస్కారం, వివేకం, విచక్షణ ఉంది కాబట్టే తాము సెక్షన్ 8 గురించి అడుగుతున్నామని, అవేమీ మంత్రులకు లేవు కాబట్టి తమను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ఎక్కడ ఉంటే ఏందని మంత్రులు అంటున్నారని, కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని, ఆయన ప్రజల బాగోగులు తెలుసుకొని ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాలని, ఆ సమయంలో కేసీఆర్ కనిపించకుండా పోతే ఎలా అని అన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కరోనా అంటున్నారని, మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని, లేదంటే తాము చేతల్లో చూపించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కరోనా కాదని, టీఆర్ ఎస్ పార్టీ ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదని సంపత్ వ్యాఖ్యానించారు. -
ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన ప్రియాంక గాంధీ
-
పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బుధవారం పార్టీ ప్రధాన కార్యలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఆమె సోదరుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జనవరి 23న నియమించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అక్బర్ రోడ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ప్రియాంక కార్యాలయం ఏర్పాటు చేశారు. కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రియాంక గురువారం తొలి అధికారిక సమావేశంలో పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లతో జరిగే సమావేశానికి ప్రియాంక హాజరుకానున్నారు. వాద్రాకు బాసట మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరైన తన భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ప్రియాంక సంఘీభావం తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసిన అనంతరం నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న ప్రియాంక పార్టీ బాధ్యతలు స్వీకరించారు. కాగా వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. -
ప్రియాంకపై స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక ‘బైపోలార్ డిజార్డర్’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి ప్రజలకు కూడా వ్యాపించేలా కాంగ్రెస్ యత్నిస్తోందని, బైపోలార్ డిజార్డర్‌తో ప్రియాంక ప్రజా జీవితంలో పనిచేయలేదని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రియాంకకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ గత బుధవారం కాంగ్రెస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల మరికొందరు బీజేపీ నేతలు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లు వేయరని బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా వ్యాఖ్యానించగా.. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మరో నేత కైలాష్ విజయ్వర్జియా.. ‘కాంగ్రెస్‌లో సమర్థవంతమైన నాయకులు లేరు. అందుకనే ప్రియాంకకు పదవులు కట్టబెట్టారు. చాకొలేట్ ఫేస్‌లతో వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొందామని కాంగ్రెస్ నేతలు కలలుగంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్ డిజార్డర్‌గా పిలుస్తారు. -
రాహుల్ గాంధీ నిర్ణయం సరైందే: అఖిలేష్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీని ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ‘యువతకు అవకాశం ఇవ్వడాన్ని సమాజ్‌వాదీ పార్టీ స్వాగతిస్తుంది. ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం శుభపరిణామం. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి కలిసిరావాలని కోరుకుంటున్నా. ప్రియాంకను ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించిన పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీకి అభినందనలు’ అని అఖిలేష్ అన్నారు. (అక్కడ కాంగ్రెస్‌ను అందుకే పక్కనపెట్టాం) రానున్న ఎన్నికలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను ప్రత్యేక్ష రాజకీయాల్లోకి దించింది. మాటమాత్రమైనా చెప్పకుండా...తమను అసలు పరిగణనలోకే తీసుకోకుండా సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు కూటమిగా ఏర్పడటాన్ని చూసి డీలా పడిన కాంగ్రెస్ శ్రేణులకు ప్రియాంక రంగప్రవేశం నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో యూపీ, ఇతర హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. -
‘ప్రియాంక గాంధీ అందం చూసి జనం ఓట్లేయరు’
పట్నా : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయరు. మరో ముఖ్య విషయమేంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి అనుభవం, టాలెంట్ లేదు’ అని ఝా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ) ఇదిలాఉండగా.. ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేశారు. అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని చెప్పారు. ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రియాంక గాంధీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీప్రచార ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. -
‘వాళ్లకి కుటుంబమే పార్టీ.. మనకి పార్టీయే కుటుంబం’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. బుధవారం ఆయన మహారాష్ట్ర బీజేపీ కార్యకర్తలతో ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రియాంక రాజకీయ ఎంట్రీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొందరికి కుటుంబమే పార్టీ అని, అయితే బీజేపీకి మాత్రం పార్టీయే కుటుంబమని చెప్పారు.(అందుకే ప్రియాంకకు పదవి: రాహుల్) ‘మన పార్టీలో ఎలాంటి నిర్ణయాలు అయినా ఒకే కుటుంబం తీసుకోదు. అందరితో చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కరి ఆలోచన విధానాలపై పార్టీ నిర్ణయాలు ఉండవు. మన పార్టీకి కార్యకర్తలే కుటుంబం. కొందరికి కుటుంబంమే పార్టీ. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను పాటిస్తుంది. మన పార్టీని కార్యకర్తలతో నిర్మించుకున్నాం. ఎలాంటి నిర్ణయాలు అయినా అందరం కలిసి తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ దేశానికి అంకితం. దేశంలో ప్రజాస్వామ్య విలువలను పాటించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీయే’ అని మోదీ చెప్పుకొచ్చారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించారు. -
ప్రియాంక నియామకంపై ఎవరేమన్నారు?
న్యూఢిల్లీ: ప్రియాంక గాంధీని ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంతం ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించడంపై కాంగ్రెస్ పార్టీలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక నియామకంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందన్న ఆశాభావాన్ని సీనియర్ నాయకులు వ్యక్తం చేశారు. (ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ) ‘ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆమె ప్రవేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపనుంది. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేయనుంద’ని సీనియర్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ నియామకం పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకువస్తుందన్న నమ్మకాన్ని మరో సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యక్తం చేశారు. ప్రియాంక నియామకాన్ని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ చేసిన పెద్ద శస్త్రచికిత్సగా అభివర్ణించారు. ‘ప్రియాంకకు బాధ్యతలు అప్పగించడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రియాంక ఎంట్రీ ప్రభావం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాదని మిగతా ప్రాంతాల్లోనూ ఉంటుంద’ని మోతిలాల్ వోరా అభిప్రాయపడ్డారు. ప్రియాంక నియామకాన్ని ‘గేమ్ చేంజర్’గా యూపీ పీసీసీ అధ్యక్షుడు పియూష్ మిశ్రా వర్ణించారు. ‘ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రియాంక గాంధీని ఎంతో కాలంగా కోరుతున్నాం. యూపీ ఈస్ట్ ఇన్చార్జిగా ఆమె నియామకం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయ’ని తెలిపారు. అమేథి, రాయబరేలి నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్న ప్రియాంక గాంధీకి పార్టీలోని కార్యకర్తలందరితో పరిచయాలు ఉన్నాయని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు. విదేశాల నుంచి తిరిగి రాగానే ఫిబ్రవరి 1న ప్రియాంక బాధ్యతలు చేపడతారని రాజీవ్ శుక్లా వెల్లడించారు. కాగా, ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై కాంగ్రెస్ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ‘ఇందిరా గాంధీ మళ్లీ వచ్చారంటూ’ పోస్టర్లు ప్రదర్శించారు. -
ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ప్రియాంకా గాంధీ
-
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనే క్రమంలో ప్రియాంకను తెరపైకి తీసుకువచ్చింది. ఇక ఉత్తర ప్రదేశ్ తూర్పు ఇన్చార్జిగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నియమించారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.ఇక జ్యోతిరాదిత్య సింధియాకు పశ్చిమ యూపీ బాద్యతలు అప్పగించారు. గులాం నబీ ఆజాద్‌ను యూపీ ఇన్‌ఛార్జ్‌గా తప్పించి ఆయనకు హర్యానా బాధ్యతలు కట్టబెట్టారు. కేసీ వేణుగోపాల్‌ను ఏఐసీసీ సంస్ధాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు.ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ఇన్చార్జి బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియా తక్షణమే చేపడతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. -
అభివృద్ధి పేరుతో దేశాన్ని మోసగిస్తున్న మోదీ
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్ అర్బన్) : పెట్టుబడి దారి వ్యవస్థను ప్రొత్సహిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అభివృద్ధి పేరిటా దేశాన్ని మోసగిస్తున్నారని, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో భారీ అక్రమాలే ఇందుకు నిదర్శనమని ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు నాజీర్ హుస్సెన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పాల్పడున్న అక్రమాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి ప్రశ్నిస్తున్న వీటికి సమాదానం చెప్పటంలేదని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ అక్రమాలపై దేశ ప్రజలకు విడమరచి చెప్పెందుకు ఏఐసీసీ ప్రజల్లోకి వచ్చిందని, ఇందులో భాగంగానే రాష్ట్ర పర్యటనలో భాగంగా తాను జిల్లాకు రావటం జరిగిందన్నారు. 2015లో పారిస్ పర్యటనకు వెళ్లిన ప్రధాని అకస్మాత్తుగా 36 యుద్ద విమానాలను ఒక్కో విమానాన్ని రూ. 1670.70 కోట్లతో కొనుగోలు చేయగా, 36 విమానాల ధర ఏకంగా రూ. 60,145 కోట్లకు చేరిందన్నారు. దాంతో డస్సాల్గ్ ఏవియేషన్ తన వార్షిక నివేదిక, రిలయన్స్ డిఫెన్స్ రిపోర్ట్ ప్రకారం కొత్త ధరలో తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నిలదీయగా, విమానాల కొనుగోలులో ఎటువంటి దాపరికాలు లేవని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. యుద్ద విమానాల తయారీ కంపనీ డస్సాల్గ్, రిలయన్స్ మధ్యగల అంతర్గత ఒప్పంద రహస్యమేమిటో చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వం ఎందుకని తిరస్కరించిందో చెప్పాలన్నారు. ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫోరెన్స్ పార్టీ చెప్పిన విషయాల ఆధారంగా మన దేశ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాధమిక ఒప్పందం విషయంలో అబద్దాలు చెప్పినట్లు రుజువయ్యిందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, నాయకులు అరికెలా నర్సారెడ్డి, శేఖర్‌గౌడ్, రాంభూపాల్, మాజీద్‌ఖాన్, అంతిరెడ్డి రాజిరెడ్డి, అగ్గు భోజన్న, జావీద్ అక్రమ్, విపుల్‌గౌడ్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి
రైతు ఆత్మహత్యలపై ఏఐసీసీ కార్యదర్శి కుంతియా వరంగల్ : రైతుల ఆత్మహత్యలు దేశంలో సర్వసాధారణంగా మారాయని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఆర్సీ.కుంతియా అన్నారు. వరంగల్ జిల్లా కాం గ్రెస్ కమిటీ, తెలంగాణ కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్‌ల సంయుక్త ఆధ్వర్యం లో వరంగల్ జిల్లా హన్మకొండలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు పిట్టల్లా రాలిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. భూసేకరణ బిల్లును రైతులు వ్యతిరేకించడంతో మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొ న్నారు. వ్యవసాయరంగంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల తర్వాత స్థానం తెలుగు రాష్ట్రాలదే అన్నారు. వ్యవసాయ రంగాన్ని పట్టించుకోక పోవడంతో 2000 సంవత్సరం నుంచి పంటలు తక్కువ సాగు అవుతున్నాయన్నారు. అమెరికా లాంటి దేశాలు రైతులకు 300 శాతం సబ్సిడీని అందిస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవాలని కుంతియా సూచించారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు అంధకారంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిసాన్ ఖేత్ మజ్దూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీలు ఏకే .ఖాన్, హన్మంతరావు, ఆనందభాస్కర్, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌రాబు, సారయ్య పాల్గొన్నారు. -
తెలంగాణకు కీలక పదవులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఫలితం దక్కలేదని చింతిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సమాయాత్తం కావాలని భావిస్తోంది. రానున్న నాలుగేళ్లలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ మాసంలో ఏఐసీసీని పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. తమకు పట్టున్న రాష్ట్రాల్లో వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దీని కూర్పు ఉండబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా యువతకు పెద్దపీట వేయాలని పార్టీ భావిస్తోంది. ఈ దిశగా తెలంగాణ నుంచి నలుగురు నేతలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీలో ఒకరికి, ఏఐసీసీలో ముగ్గురికి స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ అనుభవం ఉన్న నేతలనే ఇందుకు ఎంచుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యత్వం దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఒక్కరే ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇక ఏఐసీసీ కార్యదర్శులుగా డాక్టర్ జి.చిన్నారెడ్డి, వి.హనుమంతరావు కొనసాగుతున్నారు. ఇటీవలే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. బీసీలకు ప్రాధాన్యం.. తెలంగాణ పీసీసీ, సీఎల్పీ పదవులు రెడ్డి సామాజికవర్గానికి దక్కినందున ఏఐసీసీ పదవుల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు దక్కవచ్చనిపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీలో ప్రధాన కార్యదర్శిగా ఉత్తర తెలంగాణ నుంచి బీసీ నాయకుడికి దక్కే సూచనలు ఉన్నాయి. అలాగే రెండు కార్యదర్శి పదవుల్లో ఒకటి బీసీకి, మరొకటి ఎస్సీకి అవకాశం ఉంది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎస్సీ నేతకు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవి మైనారిటీలకు.. ఇలా అన్ని వర్గాలకు కీలక ప్రాతినిథ్యం దక్కినా.. బీసీలకు సరైన ప్రాతినిథ్యం లభించలేదని ఆ వర్గం నేతల్లో ఒకింత అసంతృప్తి ఉంది. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన మాజీ ఎంపీల్లో ఒకరికి ప్రధాన కార్యదర్శి పదవి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన ఒక మాజీ ఎంపీ పేరును కార్యదర్శి పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శి పదవులకు గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లుగా నిర్ధారించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు సరైన ప్రాతినిథ్యం లేని ఉత్తర తెలంగాణ నుంచి నేతలను కీలక పదవులకు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు తమకు సరైన ప్రాతినిథ్యం దొరకడం లేదని భావిస్తూ పార్టీని వదిలిపెడుతున్న తరుణంలో ఇలాంటి సమీకరణాలు మరిన్ని కీలక పరిణామాలకు తావిచ్చే అవకాశం ఉంది. -
బీజేపీ ఎందుకు మాట్లాడలేదు: శోభా ఓఝా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓటుకు నోటు వైఖరిపై భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శోభా ఓఝా ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు పెదవి విప్పలేదని ఆమె మండిపడ్డారు. -
నిజాం మిల్లుతో రైతులకు మేలుజరగాలి
వనపర్తిటౌన్ : చంద్రబాబు హయాంలో అప్పనంగా డెల్టా పేపర్మిల్లుకు కట్టబెట్టిన నిజాం షుగర్‌మిల్లును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం హర్షించదగిన విషయమని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం వనపర్తిలోని పీఆర్ అతిథి గృహాంలో విలేకరులతో మాట్లాడారు. 2004లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం రత్నాకర్ అధ్యక్షతన పద్మాదేవేందర్‌రెడ్డిలతో హౌస్‌కమిటీ వేస్తే కార్మికులు, రైతులకు అన్యాయం జరిగిందని తాము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అప్పట్లో షుగర్ మిల్లుకు వ్యతిరేకంగా రిపోర్ట్ తయారుచేయాలని ఒత్తిడివచ్చినా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేశామని గుర్తుచేశారు. నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారిని నిజాం మిల్లుకు డెరైక్టర్‌ను చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు తైలం శకర్ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతయ్య, కేజీ మూర్తి, శ్యాం, ధనలక్ష్మి, బాబా పాల్గొన్నారు. -
రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదు
- పార్టీ టికెట్ ఇప్పిస్తానని మోసం చేశారు - ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఎదుట గిరిజనుల ఆందోళన సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత సార్వత్రిక ఎన్నికల్లో వైరా శాసనసభ స్థానానికి టికెట్ ఇప్పిస్తానని రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి రూ.1.10 కోట్లు తీసుకున్నారని ఇటీవల మృతి చెందిన డాక్టర్ రాంజీ సతీమణి కళావతి, గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షించేందుకు డీసీసీ కార్యాలయంలో కుంతియా, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీతోపాటు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు నినాదాలు, ప్లకార్డులతో ప్రదర్శనగా డీసీసీ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు గిరిజన సంఘం నాయకులను అడ్డుకున్నారు. కుంతియాను కలసి మాట్లాడాలని గిరిజన సంఘాల నాయకులు పట్టుబట్టడంతో కళావతితో పాటు పలువురు నాయకులకు గదిలోకి వెళ్లేందుకు అనుమతించారు. పార్టీ టికెట్ ఇప్పిస్తానని రాంజీకి మాయమాటలు చెప్పిందని, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మనోవేదనతో ఆయన మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కుంతియాకు వినతిపత్రం అందజేశారు. కుంతియా మాట్లాడుతూ మీ సమస్యలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. సోనియాగాంధీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని మీ ఇవ్వడంతో గిరిజన సంఘాల నాయకులు శాంతించారు. -
ఇలాగైతే ఎలా?
కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నవారిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో కష్టమేనని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. అన్నింటికీ హైకమాండ్ అనుమతి పొందాలంటే ఎలా అంటూ మంగళవారం జరిగిన టీఎన్‌సీసీ సమావేశంలో జాతీయ నేతలను నిలదీశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ సంస్కరణలు చేపట్టేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ను నాలుగు మండలాలుగా విభజించి ఆయా జిల్లాల అధ్యక్షులతో సమావేశాలు జరుపుతున్నారు. ఇప్పటికి మూడు మండలాలు పూర్తికాగా నాలుగో మండల సమావేశం మంగళవారం చెన్నైలోని సత్యమూర్తి భవన్ (పార్టీ రాష్ట్రశాఖ కార్యాలయం)లో నిర్వహించారు. చెన్నై మండల పరిధిలోని కాంచీపురం, తిరువళ్లూరు తదితర 11 జిల్లాలకు చెందిన అధ్యక్షులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన నేతల్లో అధిక శాతం హైకమాండ్‌పై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, అతని కుమారుడు కార్తి చిదంబరంలో మూడు నెలలుగా పార్టీని అల్లకల్లోలం చేస్తున్నారు. వేరు సమావేశాలు నిర్వహించడం, పార్టీని చీలికదిశగా తీసుకెళ్లడం, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై ప్రత్యక్ష విమర్శలు గుప్పించడం ద్వారా వర్గపోరు సాగిస్తున్నారు. తండ్రీ కొడుకుల వ్యవహారం టీఎన్‌సీసీకి తలనొప్పిగా పరిణమించగా సోనియా, రాహుల్‌కు చెప్పుకోవడం మినహా మరేమీ చేయలేని నిస్సహాయతను ఇళంగోవన్ ఎదుర్కొంటున్నారు. పీ చిదంబరానికి హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉన్న కారణంగా సోనియా, రాహుల్ సైతం చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. రాష్ట్రంలో గడ్డుపరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌ను గట్టెక్కించాలని ముకుల్‌వాస్నిక్ చేస్తున్న బోధనలను క్యాడర్ తిప్పికొట్టింది. పార్టీలో కొనసాగుతున్న వేర్పాటు వాదుల పనిపట్టే అధికారాలు లేని టీఎన్‌సీసీ పదవి వల్ల ఎంతమాత్రం మేలులేదని వారు స్పష్టం చేశారు. ప్రతి చిన్న విషయానికి డిల్లీకి వెళ్లి హైకమాండ్ అనుమతి పొందే విధానానికి స్వస్తి పలకాలని ముకుల్వాస్నిక్కు వారు విజ్ఞప్తి చేశారు. రాహుల్ విశ్రాంతి తప్పుకాదు కాంగ్రెస్ సమావేశం ముగిసిన అనంతరం ఇళంగోవన్ మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రాహుల్‌గాంధీ హాజరుకాకపోవడంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రాహుల్ గాంధీ విశ్రాంతి తీసుకోవడంలో ఎంత మాత్రం తప్పులేదు, ప్రధానిగా ఉన్నపుడు వాజ్‌పేయి కూడా తీసుకున్నారని వెనకేసుకు వచ్చారు. చిదంబరం, కార్తీ చేస్తున్న విమర్శలపై మాట్లాడి తన సమయాన్ని వృథా చేసుకోనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ అండగా నిలిచిన కాంగ్రెస్, డీఎంకే పార్టీలకు డీఎండీకే అధినేత విజయకాంత్ ధన్యవాదాలు తెలిపారు. -
సభ్యత్వంపై నిస్తేజం
⇒ మొక్కుబడిగా సాగుతున్న ⇒ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ⇒ నేడు ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, పొన్నాల రాక సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న ఆ పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు అధిష్టానం చేపట్టిన ఈ కార్యక్రమానికి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఇన్చార్జీలు లేని నియోజకవర్గాలే కాదు, అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికితోడు జిల్లా నాయకత్వంలో గ్రూపు విభేదాలు ఇంకా రగులుతూనే ఉండటంతో ఈ సభ్యత్వ నమోదుకు ప్రధాన అవరోధంగా తయారైంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల ఇన్చార్జీలు సభ్యత్వ నమోదు పుస్తకాలను ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు అప్పగించి వెళ్లిపోయారు. కనీసం వీరు నియోజకవర్గంలో కూడా అందుబాటులో ఉండకపోవడంతో కార్యకర్తలు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో సభ్యత్వ నమోదు పలుచోట్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్కో బూతుకు 50 చొప్పున సభ్యత్వాలు చేయించాలని నిర్ణయించారు. అంటే ఒక్కో నియోజకవర్గంలో కనీసం పది నుంచి 15 వేల చొప్పున నమోదు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల తొమ్మిది వరకు నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా నేతలు చొరవ చూపాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు గత 15న నిర్మల్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందే ఆసిఫాబాద్‌లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ఎక్కడ కూడా ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఎలాగైనా డిసెంబర్ నెలాఖరు లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఇన్చార్జీలు లేనిచోట్ల.. జిల్లాలో ప్రస్తుతానికి మూడు నియోజకవర్గాలకు నాయకులెవరూ లేకపోవడంతో ఇక్కడ సభ్యత్వ నమోదు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసిన కె.ప్రేంసాగర్‌రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ సభ్యత్వ నమోదు బాధ్యతను తీసుకునే నాయకుడే లేకుండాపోయారు. ద్వితీయ శ్రేణి నేతలు జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి వంటి నేతలు ఈ కార్యక్రమాన్ని షురూ చేసినా మొక్కుబడిగా కానిచ్చేస్తున్నారు. ఇక మంచిర్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జి.అరవింద్‌రెడ్డి కూడా ఎన్నికలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఇక్కడ ఈ సభ్యత్వ నమోదును భుజాన వేసుకునే నాయకుడెవరూ లేకుండా పోయారు. ఒకవేళ ఎవరైనా ఈ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకొచ్చినా తీరా పదవులు, టిక్కెట్లు తమకు దక్కుతాయనే ధీమా కనిపించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. ద్వితీయ శ్రేణి నాయకులే అడపాదడపా సభ్యత్వాలు చేయిస్తున్నారు. ముథోల్‌లో నియోజకవర్గంలో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా ఈ కార్యక్రమం పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో తప్పకుండా తనకే టిక్కెట్టు దక్కుతుందనే భరోసా లేకపోవడంతో ఈ ప్రక్రియపై శ్రద్ధ వహించడం లేదు. రెండు, మూడు చోట్ల మినహా జిల్లాలో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. -
యువతకు ప్రాధాన్యం ఇవ్వండి
దిగ్విజయ్‌సింగ్‌కు నల్లగొండ యూత్ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి సాక్షి, సిటీబ్యూరో : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్‌కు నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు రవీందర్‌రెడ్డి, ఉదయ్‌చందర్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో దిగ్విజయ్ సింగ్‌ను కలిసి నల్లగొండ జిల్లా పార్టీ పరిస్థితిపై ఒక నివేదిక అందజేశారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలతో రోజురోజుకు పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతుందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ సంస్థాగత పదవుల్లో యువతకు తగిన ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పిలుపునిచ్చి యువతను భాగస్వాములు చేయాలని సూచించారు. దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన బృందలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకుడు నందన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పవన్ ఉన్నారు. -
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వలసలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: సిద్ధాంతాలను నమ్ముకునే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లరని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వలస వెళతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వలసలు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యదర్శి కుంతియా మాట్లాడుతూ ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌కు తమ పార్టీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ఈ ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.