సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనే క్రమంలో ప్రియాంకను తెరపైకి తీసుకువచ్చింది. ఇక ఉత్తర ప్రదేశ్ తూర్పు ఇన్చార్జిగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నియమించారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.ఇక జ్యోతిరాదిత్య సింధియాకు పశ్చిమ యూపీ బాద్యతలు అప్పగించారు. గులాం నబీ ఆజాద్‌ను యూపీ ఇన్‌ఛార్జ్‌గా తప్పించి ఆయనకు హర్యానా బాధ్యతలు కట్టబెట్టారు. కేసీ వేణుగోపాల్‌ను ఏఐసీసీ సంస్ధాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాను నియమించారు.ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ఇన్చార్జి బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియా తక్షణమే చేపడతారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment