మీడియా తీరు ఆశ్చర్యకరం
Published Mon, Dec 2 2013 12:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోసహా ఐదు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాజధానిలో ప్రచారం చేస్తున్నా మీడియా పట్టించుకోవడంలేదని, కేవలం మోడీ ర్యాలీలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రచారంపై కమలనాథులు చేస్తున్న విమర్శలను ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిప్పికొట్టారు. ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజధానిలో ప్రచార ర్యాలీలను రద్దు చేసుకుంటున్నారంటూ బీజేపీ చేసిన విమర్శలను ఆయన ఖండించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విదర్భ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణ, కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాందీ, హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హూడా ప్రచారం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఐదుగురు ముఖ్యమంత్రులు ప్రచారం చేస్తున్నా వారిని మీడియా విస్మరిస్తోందని మండిపడ్డారు. మోడీ ర్యాలీలకు మాత్రమే మీడియా ప్రాధాన్యతనివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాష్ట్రాలు గుజరాత్ కంటే అభివృద్ధి చెందిన విషయాన్ని మీడియా గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ,
ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తుదిదశ ప్రచారంలో పాల్గొంటారన్నారు. జపాన్ చక్రవర్తి రాకను పురస్కరించుకొనే నవంబర్ 30న జరగాల్సిన మన్మో హన్ ప్రచార ర్యాలీ రద్దయిందని, కాంగ్రెస్ ప్రచారాన్ని ఆపలేదని చెప్పారు. కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్, గులామ్ నబీ ఆజాద్, హరీష్ రావత్, కే రహమాన్ ఖాన్, కుమారి సెల్జా, వీ నారాయణ్ స్వామి, ఆర్‌పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద, పంజాబ్ పీసీసీ చీఫ్ ప్రతాప్‌సింగ్ బాజ్వా, అస్సాం పీసీసీ చీఫ్ భువనేశ్వర్ కలితా, ఎంపీలు రాజ్ బబ్బర్, అజరుద్దీన్, ముకుల్ వాస్నిక్, సత్పాల్ మహరాజ్ తదితరులు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్నారని గుర్తుచేశారు.
Advertisement