షీలా రివర్స్‌గేర్..!
సాక్షి, న్యూఢిల్లీ:ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, ఎమ్మెల్యేలు ఎన్నికలను కోరుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేయగలమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ అంటున్నారని, ఆయన బాధ్యతతోనే ఈ మాటలు అని ఉంటారని షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మంచిదేనని, ఒకవేళ బీజేపీ ఈ స్థాయికి చేరుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ఢిల్లీకి మంచిదేనని షీలాదీక్షిత్ చెప్పారు. ‘ఆప్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారేకాకుండా ఇతరులు కూడా ఎన్నికలను కోరుకోవడంలేదు. మరోవైపు ప్రజలు కూడా ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలనే కోరుకుంటున్నారు తప్ప ఎన్నికలు జరగాలను కోరుకోవడంలేదు. తాము ఎనుకున్న ప్రజాప్రతినిధుల పదవీకాలం కనీసం ఏడాది కూడా పూర్తి కాలేదనే అభిప్రాయం జనాల్లో కూడా వ్యక్తమవుతోంది.
ఇటువంటి సమయంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బీజేపీ అంటున్నప్పుడు.. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడే ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన బాధ్యతతో మాట్లాడుతున్నారనే భావించారు. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నం చేయడానికి బీజేపీకి అవకాశాన్ని ఇవ్వాలి. ఢిల్లీలోనేకాదు మరే ఇతర రాష్ట్రంలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేకపోవడం ప్రజాస్వామ్యంలో సరికాదు. ప్రజలకు వ్యక్తిగతంగా, సమిష్టిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం లేనట్లయితే తమ సమస్యల పరిష్కారం కోసం వారంతా ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలో వారికి అర్థం కాదు. అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్న బీజేపీ ప్రయత్నాన్ని అన్ని పార్టీలు స్వాగతించాల’ని షీలాదీక్షిత్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఢిల్లీలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం, దీంతో కేరళ గవర్నర్‌గా షీలా వెళ్లిపోవడం వంటివి జరిగిన తర్వాత క్రీయాశీల రాజకీయాలకు ఆమె దూరంగా ఉన్నారు. ఇటీవల కేరళ గవర్నర్ పదవికి షీలాదీక్షిత్ రాజీనామా చేసిన తర్వాత మళ్లీ ఢిల్లీ రాజకీయాల్లో ఆమె క్రీయాశీలంగా వ్యవహరించనుందనే సంకేతాలు కాంగ్రెస్ నేతల నుంచి వెలువడ్డాయి. ఇక ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకోవడం, కాంగ్రెస్, ఆప్‌లు బీజేపీని రోజుకోరకంగా ఇబ్బంది పెడుతున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహించిన షీలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. షీలా వ్యాఖ్యలు విశ్లేషకులనుసైతం ఆశ్చర్యానికి గురిచేశాయి.
బీజేపీ హర్షం
షీలాదీక్షిత్ మాటలు కాంగ్రెస్‌కు మింగుడుపడకపోయినా బీజేపీ మాత్రం హర్షం వ్యక్తం చేసింది. ఒక రాజకీయ నేతగా షీలాదీక్షిత్ వ్యాఖ్య పరిణితితో కూడినట్లుగా ఉందని సతీష్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. ‘షీలాజీ సీనియర్ నేత, ఆమెకు రాజ్యాంగ ప్రక్రియ గురించి తెలుస’ని సతీష్ ఉపాధ్యాయ అన్నారు. మద్దతిస్తే సిద్ధమే: అమిత్ షాఇదిలాఉండగా ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ సుముఖంగానే ఉందని, మద్దతు ఇవ్వడానికి ఎవరైనా తమంతట తాముగా ముందుకు వస్తే స్వీకరించడానికి సంకోచించమని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమే: కాంగ్రెస్
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అందుకు విరుద్ధంగా మాట్లాడడంపై కాంగ్రెస్ నేతలు విస్మయం చెందుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై షీలాదీక్షిత్ చేసిన వ్యాఖ్య ఆమె వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ స్పష్టం చేశారు. షీలాదీక్షిత్ వ్యాఖ్య దిగ్భ్రమ కలిగించిందని, దానిని ఆమె వ్యక్తిగత అభిప్రాయంగా తాము భావిస్తున్నామని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ చెప్పారు. కాంగ్రెస్ వైఖరి షీలాదీక్షిత్ మాటలకు భిన్నంగా ఉందన్నారు. ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని, అనైతిక పద్ధతిలో బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే అసెంబ్లీలో తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఆయన చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే తమ పార్టీ విప్ జారీచేస్తుందని ఆయన చెప్పారు. షీలాదీక్షిత్ వంటి సీనియర్ నేత ఇటువంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి హరూన్ యూసఫ్ అన్నారు. షీలాదీక్షిత్ తన వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే భీష్మ్ శర్మ డిమాండ్ చేశారు. షీలాదీక్షిత్ బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖరాశారు. షీలాదీక్షిత్‌ను సమర్థించే మతీన్ అహ్మద్ మాత్రం వ్యాఖ్యలను సమర్థించారు.