ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ | will Elections, all parties | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ

Published Wed, Oct 22 2014 10:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ - Sakshi

ఎన్నికలకు అన్ని పార్టీలు రెడీ

రాజకీయ వ్యూహంపై చర్చలు
 
మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఎనలేని ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఫలితాల ప్రభావం ఢిల్లీ ఎన్నికలపైనా ఉంటుందని, మోదీ ప్రభంజనంతో విజయకేతనం ఎగురవేయొచ్చని భావిస్తోంది. ఇక ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్‌లు కూడా శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

న్యూఢిల్లీ: హ ర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులతోపాటు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై ఇన్నాళ్లూ సుప్రీంకోర్టులో నాన్చుడు ధోరణిని అవలంబించిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన తన వైఖరిని స్పష్టం చేయవచ్చని వారంటున్నారు. ఎన్నికలు జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయని  అంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు ప్రధాన పార్టీల నేతలు రాజకీయ వ్యహంపై చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు ఎన్నికల విషయంలో బీజేపీ నేతలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుండగా మిగతా పార్టీల నేతలు కూడా తాము కూడా అందుకు సిద్ధమేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల విషయంలో వెనుకంజ వేసినట్టు వారం క్రితం వరకూ కనిపించిన బీజేపీ.. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సాధించిన ఘనవిజయంతో జాతీయ రాజధాని శాసనసభ ఎన్నికలకు సిద్ధమైపోయింది. హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల మాదిరిగానే నరేంద్ర మోడీ పేరుబలంతో ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తోంది. హర్యానా, మహారాష్ట్రల మాదిరిగానే సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు భావిస్తుండగా, హర్షవర్ధన్‌ను ఢిల్లీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్లయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఇంకొందరు భావిస్తున్నారు.

ఆప్‌దీ అదే దారి

ఇక అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. 49 రోజుల పాలనలో తాము  చేసిన పనులు, ఇన్నాళ్లుగా తమ 27 మంది ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుంచాలని   యోచిస్తోంది. కేజ్రీవాల్ ఫిర్సే (మళ్లీ కేజ్రీవాల్) పరుతో ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించడంతోపాటు వీలైనంతవరకు స్థానిక సమస్యలను లేవనెత్తి ప్రజల మనస్సులో చోటుసంపాదించాలని భావిస్తోంది. విద్యుత్ చార్జీల తగ్గింపు, విద్యుత్ కంపెనీల ఆడిట్‌కు ప్రయత్నించడం వంటి అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించాలని, దానితోపాటు అధికారంలో లేకపోయినప్పటికీ తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టిన పనులను ప్రజలకు గుర్తుచేయాలని ఆప్ యోచిస్తోంది.

పరిస్థితి మెరుగుకు కాంగ్రెస్ యత్నం

వరుస పరాజయాలతో కోలుకోనేంతగా దెబ్బతిని ఆత్మవిశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనైనా తన పరిస్థితిని మెరుగుపరచుకోవాలని ఆశిస్తోంది. ఈ ఎన్నికల వల్ల తమ పార్టీ కోల్పోయేదేమీ లేదని పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సీట్లు గెలవవచ్చనే భావం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. మాజీ ఎంపీలను కూడా శాసనసభ ఎన్నికల బరిలోకి దింపితే ఫలితాలు కొంత మెరుగ్గా ఉండొచ్చనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందువల్ల టికెట్ రాని మాజీ శాసనసభ్యులు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు.  హర్యానాలో మాదిరిగా జాట్ ఓటర్లు కాంగ్రెస్‌కు అండగా నిలబడొచ్చని, అందువల్ల  తాము ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఢిల్లీ శాసనసభ  సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement