సాక్షి, న్యూఢిల్లీ: మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 25న జరిగే ఉప ఎన్నికల కోసం మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతున్నాయి. ఉపఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరి తేదీ నవంబర్ 5 కావడంతో అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడానికి ఓ ఎన్నికల కమిటీని నియమించామని, శనివారం ఈ కమిటీ సమావేశం జరుగుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏర్పాటుచేయడం కన్నా ఉప ఎన్నికలపైపే ప్రధానంగా దృష్టి సారించాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మూడు సీట్లను మరోసారి దక్కించుకుని నగరంలో తమ పట్టు చెక్కుచె దరలేదని నిరూపించుకోవాలని, దాని వల్ల కార్యకర్తలకు నూతనోత్సాహం లభిస్తుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ మూడు సీట్లను గెలుచుకుని అసెంబ్లీలో తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని ఆశిస్తోం ది. మూడు సీట్లను గెలిస్తే తమ పార్టీ అ సెంబ్లీలో అతి పెద్ద రాజకీయ పార్టీగా మారుతుందని, అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి నిరాకరించి ఎన్నికలకు మార్గం సగమం చేయవచ్చని ఆప్ ఆశిస్తోంది. నామినేషన్ల దాఖలుకు సమయం ఎక్కువగా లేనందువల్ల అభ్యర్థుల ఎంపికకు కొత్త పద్ధతిని పాటించనున్నట్లు ఆప్ నేతలు చెబుతున్నారు. జిల్లా కమిటీలు అందించే సమాచారం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన జాబితానుంచి అభ్యర్థులను ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తామని వారు అంటున్నారు. రెండు మూడురోజులలో తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని వారు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత చతికిలబడిన కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలతో కోల్పోయిన ప్రజల మద్దతును మళ్లీ పొందాలనుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో బలమైన శక్తిగా ఆవిర్భవించి తమను చిత్తు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు అంత ప్రజాదరణ లేదని అందువల్ల తమ స్థితి మెరుగపడవచ్చని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆమోదంతో ఖరారు చేసే అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ అంటోంది. కృష్ణానగర్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి డాక్టర్ అశోక్ వాలియాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళితో వాయిదాపడిన విద్యుత్తు చార్జీల పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: నవంబర్ నెల నుంచి పెరుగుతాయనుకున్న విద్యుత్తు చార్జీలు మరికొన్ని రోజుల తరువాత పెరగనున్నాయి. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో విద్యుత్తు కొనుగోలు సవరణ చార్జీలకు సంబంధించిన ప్రకటన చేయరాదని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీల విద్యుత్తు కొనుగోలు ఖర్చును సర్దుబాటు చేయడం కోసం డీఈఆర్‌సీ ఇంధనం పన్నును నవంబర్‌లో విధించనుండడంతో నగరంలో విద్యుత్తు చార్జీలు ఐదు నుంచి ఏడు శాతం పెరుగుతాయని భావించారు. ఈ పెరిగే విద్యుత్తు చార్జీలను నవంబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 31 వరకు విద్యుత్తు వినియోగదారుల బిల్లులలో చేర్చాలనుకున్నారు. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా వాయిదా పడిన ఈ పెంపు ఇక నవంబర్ 25న పోలింగ్ ముగిసిన తరువాతే అమల్లోకి రానుంది.
ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న మూడు పార్టీలు
Published Fri, Oct 31 2014 10:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement