సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఫలితం దక్కలేదని చింతిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సమాయాత్తం కావాలని భావిస్తోంది. రానున్న నాలుగేళ్లలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు వ్యూహ రచన చేస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ మాసంలో ఏఐసీసీని పునర్ వ్యవస్థీకరించాల్సి ఉంది. తమకు పట్టున్న రాష్ట్రాల్లో వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా దీని కూర్పు ఉండబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా యువతకు పెద్దపీట వేయాలని పార్టీ భావిస్తోంది. ఈ దిశగా తెలంగాణ నుంచి నలుగురు నేతలకు కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీలో ఒకరికి, ఏఐసీసీలో ముగ్గురికి స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటరీ అనుభవం ఉన్న నేతలనే ఇందుకు ఎంచుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డికి సీడబ్ల్యూసీ సభ్యత్వం దక్కే అవకాశం ఉంది.
ప్రస్తుతం సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఒక్కరే ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇక ఏఐసీసీ కార్యదర్శులుగా డాక్టర్ జి.చిన్నారెడ్డి, వి.హనుమంతరావు కొనసాగుతున్నారు. ఇటీవలే మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.
బీసీలకు ప్రాధాన్యం..
తెలంగాణ పీసీసీ, సీఎల్పీ పదవులు రెడ్డి సామాజికవర్గానికి దక్కినందున ఏఐసీసీ పదవుల్లో బీసీ, ఎస్సీ వర్గాలకు దక్కవచ్చనిపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీలో ప్రధాన కార్యదర్శిగా ఉత్తర తెలంగాణ నుంచి బీసీ నాయకుడికి దక్కే సూచనలు ఉన్నాయి. అలాగే రెండు కార్యదర్శి పదవుల్లో ఒకటి బీసీకి, మరొకటి ఎస్సీకి అవకాశం ఉంది. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎస్సీ నేతకు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవి మైనారిటీలకు.. ఇలా అన్ని వర్గాలకు కీలక ప్రాతినిథ్యం దక్కినా..
బీసీలకు సరైన ప్రాతినిథ్యం లభించలేదని ఆ వర్గం నేతల్లో ఒకింత అసంతృప్తి ఉంది. తెలంగాణ కోసం గట్టిగా పోరాడిన మాజీ ఎంపీల్లో ఒకరికి ప్రధాన కార్యదర్శి పదవి లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన ఒక మాజీ ఎంపీ పేరును కార్యదర్శి పదవికి పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏఐసీసీ కార్యదర్శి పదవులకు గరిష్ట వయోపరిమితిని 50 ఏళ్లుగా నిర్ధారించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇప్పటివరకు సరైన ప్రాతినిథ్యం లేని ఉత్తర తెలంగాణ నుంచి నేతలను కీలక పదవులకు ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్లు తమకు సరైన ప్రాతినిథ్యం దొరకడం లేదని భావిస్తూ పార్టీని వదిలిపెడుతున్న తరుణంలో ఇలాంటి సమీకరణాలు మరిన్ని కీలక పరిణామాలకు తావిచ్చే అవకాశం ఉంది.
తెలంగాణకు కీలక పదవులు
Published Fri, Jul 17 2015 3:16 AM | Last Updated on Fri, Aug 17 2018 6:03 PM
Advertisement
Advertisement